ఈటల డీలా.. నమ్మించి నట్టేట ముంచారా..?

by  |
ఈటల డీలా.. నమ్మించి నట్టేట ముంచారా..?
X

దిశ ప్రతనిధి, కరీంనగర్ : తానోటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టుగా మారింది మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి. 17 ఏళ్లుగా అన్ని తానై వ్యవహరించిన ఈటల రాజేందర్ అంచనాలను సొంత నియోజకవర్గంలోని అనుచరులు తలకిందులు చేశారు. పార్టీ ముఖ్యమా.. ఈటల ముఖ్యమా.. అంటే మీరే ముఖ్యమన్న స్థాయిలో రెస్పాన్స్ ఇచ్చిన సెకండ్ కేడర్ తీరా సమయానికి ఆయనకు చెయ్యిచ్చి చెవిలో పువ్వు పెట్టేశారు. మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయిన తరువాత మొదటి సారి హుజురాబాద్‌కు వచ్చినప్పుడు ఎదురైన అనూహ్య స్పందన రెండోసారి కనిపించలేదు. ఒక్కొక్కరూ టీఆర్ఎస్‌తోనే ఉంటామని స్పష్టం చేస్తూ ఈటలకు దూరమైన తీరు ఆయన వర్గాన్ని డైలమాలో పడేసింది. తన గళం, బలం అంతా తన నియోజకవర్గ కేడర్ అన్న ధీమాతో ఉన్న ఈటలకు సెకండ్ కేడర్ అంతా కూడా జరగాల్సిన అసలు వాస్తవం ఏంటో చేతల్లోనే చూపించింది.

నా అనుకున్న వారే..

హుజురాబాద్‌లో తన కుడి భుజంగా ఉన్న నాయకులు సైతం ఈటలను వీడిపోయారు. ఈటల కారణంగా ఉన్నతంగా ఎదిగిన నాయకులు కూడా ఆయన్ను పుట్టి ముంచారన్న భావన ఈటల వర్గంలో నెలకొంది. అధిష్టానం కాదన్న తనను హుజురాబాద్ నాయకులు శిరస్థానంలో పెట్టుకుంటారనుకున్న కలలు అన్ని కల్లలేనని తేలిపోయింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, నామినేటడ్ పోస్టు్ల్లో ఉన్న వారు అంతా కలిసి సుమారు 250 మంది వరకూ ఉంటే అందులో 20 నుండి 30 మంది మాత్రమే ఇప్పటి వరకు ఈటల వెంట నడుస్తామని అంటున్నారు. మిగతా వారంతా కూడా గులాబీ నీడలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. తాను స్వయంగా హుజురాబాద్ కు వెళ్లి ఉంటే తన పంచన చేరే వారు ఉంటారని భావించినా.. ఈటల హుజురాబాద్‌కు రెండో సారి వచ్చాక ఆశించినంత సానుకూలత మాత్రం కనిపించ లేదు.

మేనేజ్మెంట్ లేకనేనా..?

నియోజకవర్గంలో పరిస్థితులు మారుతున్నాయని గమనించిన ఈటల ఒకరిద్దరు ముఖ్య నాయకులకు మేనేజ్ మెంట్ చేయాలన్న బాధ్యతలు అప్పగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈటలకు అనుకూలంగా ఉండేందుకు మిగతా వారిని ఒప్పించే విషయంలో వారు అశక్తులు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.



Next Story

Most Viewed