ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోహ్లిని ఎందుకు వద్దనుకుంది?

by  |
ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోహ్లిని ఎందుకు వద్దనుకుంది?
X

దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లి క్రికెట్‌లో ఎన్ని రికార్డులు సృష్టించాడో అందరికీ తెలిసిందే. కానీ, ఐపీఎల్‌లో ఆర్సీబీకి కప్పు తెచ్చిపెట్టలేకపోయాడనే మచ్చ ఉంది. ఆ మెగా లీగ్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా కోహ్లినే నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. 2008లో అండర్ – 19 జట్టుకు ప్రపంచకప్ తెచ్చిపెట్టిన కోహ్లిని ఆ మరుసటి ఏడాదే ప్రారంభమైన ఐపీఎల్‌లో సొంత నగరమైన ఢిల్లీ కొనుక్కోలేదు. అంతటి ప్రతిభావంతుడిని ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) ఎందుకు వదిలేసుకుందనే విషయం ఇప్పటికీ అంతుచిక్కలేదు. కాగా, ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవల్సి వచ్చిందో అప్పటి ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందర్ రామన్ వెల్లడించారు. ‘ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం కోహ్లి బదులు ప్రదీప్ సంగ్వాన్‌ను తీసుకుంది. అప్పటికే ఢిల్లీ జట్టులో సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ వంటి వాళ్లు ఉండటంతో వారికి మరో బ్యాట్స్‌మన్ అవసరం లేకుండా పోయింది. దీంతో బౌలర్ సంగ్వాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ, ఈ అవకాశాన్ని ఆర్సీబీ సద్వినియోగం చేసుకుంది’ అని సుందర్ రామన్ చెప్పారు. గత 13 సీజన్లుగా ఆర్సీబీ తరఫున ఆడిన కోహ్లి ఆ తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్ కూడా అయ్యాడు. ప్రదీప్ సంగ్వాన్ మాత్రం డోప్ టెస్టులో విఫలమై 15 నెలల నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత అతడి కెరీర్ ముగిసిపోయింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో 169 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ 37 సగటుతో 5412 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed