ఆడపిల్లల చదువు కోసం.. రోజుకు పది రూపాయలు!

by  |
ఆడపిల్లల చదువు కోసం.. రోజుకు పది రూపాయలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను చదివించడమంటే మాటలు కాదు.. లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిందే. ఈ క్రమంలో తల్లిదండ్రులు మగపిల్లలను అప్పు చేసైనా చదివించేందుకు సిద్ధపడుతుంటారు. కానీ ఆడపిల్లల విషయంలో మాత్రం ఇప్పటికీ మనదేశంలోని చాలా ప్రాంతాల్లో ‘ఫీజు’ల గురించే ఆలోచిస్తుండటం గమనార్హం. వారికి చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపిచేస్తుండటంతో.. చాలా మంది అమ్మాయిలు ‘బడిబాట’ పట్టడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ స్కూల్ యాజమాన్యం ఆడిపిల్లలను బడి బాట పట్టించడానికి ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.

ఉత్తర్‌ప్రదేశ్, అనుప్‌షహర్‌లోని పరదాదా-పరదాది (Pardada-Pardadi) స్కూల్ యాజమాన్యం పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలను బడికి రప్పించడానికి, వాళ్లను ప్రోత్సహించడానికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. స్కూల్‌కు వచ్చిన వారికి ప్రతిరోజు రూ. 10లు ఇచ్చేందుకు సిద్ధపడింది. సదరు స్కూల్‌కు మొత్తంగా 65 గ్రామాల నుంచి 1600 మంది ఆడపిల్లలు వస్తున్నారు. కాగా, అమెరికాలో చాలా సంవత్సరాలు గడిపిన వీరేందర్ సింగ్ అనే వ్యక్తి.. భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత, భారతీయ సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలని సంకల్పించి ఈ స్కూల్‌ను స్టార్ట్ చేశాడు.

ఒకరోజు.. తన విద్యార్థుల్లో ఒకరైన ఓ పదమూడేళ్ల అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ఒత్తిడి చేయడం గమనించిన వీరేందర్.. ఈ పథకాన్ని తీసుకొచ్చాడు. పరదాద-పరదాది స్కూల్‌లో పేద విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఉంటాయి. ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే ఈ స్కూల్‌ను స్థాపించాడు. అంతేకాదు, వారికి ఆ స్కూల్‌లో వారికి భోజన సదుపాయం కూడా కల్పించడం విశేషం. కాలేజీ చదువులు చదివే అమ్మాయిలకు ఈ స్కూల్ తరఫున లోన్లు కూడా అందిస్తున్నారు. ఆ విద్యార్థులు తమ కాలేజీ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించిన తర్వాత.. ఆ లోన్ అమౌంట్‌ను తిరిగి స్కూల్ యాజమాన్యానికి పే చేయాల్సి ఉంటుంది. ఓ విద్యార్థి ఫీజు ఏడాదికి రూ. 39వేల అవుతుండగా.. ఆ ఫీజు మొత్తాన్ని ఎన్ఆర్ఐలే భరిస్తారు.



Next Story

Most Viewed