విశ్వకర్మలను వేధిస్తే.. అరణ్య భవన్ ముట్టడిస్తాం

by  |
విశ్వకర్మలను వేధిస్తే.. అరణ్య భవన్ ముట్టడిస్తాం
X

హైదరాబాద్: వ్యవసాయ పనిముట్లు, గృహ నిర్మాణానికి కావాల్సిన తలుపులు, కిటికీలు సహా పలు ఉపకరణాలు తయారుచేసే విశ్వకర్మలను అటవీ అధికారులు మానసికంగా వేధిస్తున్నారని, ఉన్నపళంగా దాడి చేసి వడ్రంగి వృత్తినే దెబ్బతీస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ పరిణామాలపై సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని వడ్రంగి వృత్తిని కాపాడాలని ఆయన అభ్యర్థించారు. లేదంటే అరణ్య భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్రంగుల ఇండ్లపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసి కట్టె కోత మిషన్లు, దువ్వాడ మిషన్లు, ఇతర పనిముట్లు సీజ్ చేస్తున్నారని, ఫలితంగా రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించలేకపోతున్నామని విశ్వకర్మ సంఘానికి చెందిన నాయకులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ‌కు విన్నవించారు. తమ పోరాటానికి మద్దతునివ్వాలని కోరారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వేప, తుమ్మ, రాగి సహా 49 రకాల చెట్లను వృత్తి కోసం కొట్టేసేందుకు విశ్వకర్మలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశమిచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రభుత్వమే వారిపై దాడులకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా అనేక చేతివృత్తులు ధ్వంసమైపోతున్నాయని, ఇప్పుడు వడ్రంగి వృత్తిని ప్రభుత్వమే నష్టపరుస్తున్నదని ఆరోపించారు. వడ్రంగుల వృత్తిని నిలిపేస్తే… రైతులు సాగుచేయలేరని, కొత్త భవనాల నిర్మాణాలు ఆగిపోతాయని హెచ్చరించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే విశ్వబ్రాహ్మణులతో కలిసి అరణ్య భవన్ ముట్టడిస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటోజు వెంకటాచారి, చోల్లేటి పెంటచారి, నర్సింహ్మ చారి, పైడిమర్రి అంజయ్య, జంగాచారి, బీష్మ చారి, రేవల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed