తొలిసారి పెట్రోల్‌ను బీట్ చేసిన డిజీల్

by  |
తొలిసారి పెట్రోల్‌ను బీట్ చేసిన డిజీల్
X

దిశ, సెంట్రల్ డెస్క్: గడిచిన రెండు వారాలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. వరుసగా 18వ రోజు డీజిల్ ధరలు పెరగడంతో పెట్రోల్ రూ. 9.41 పెరగ్గా, డీజిల్ రూ. 9.58 పెరిగాయి. అయితే, సాధారణంగా డీజిల్ కంటే పెట్రోల్ ధర అధికంగా ఉండాలి కానీ తొలిసారిగా డీజిల్ ధర పెట్రోల్ ధరను దాటి దూసుకెళ్లింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందించిన వివరాల ప్రకారం…బుధవారం పెట్రోల్ ధర పెరగలేదు, డీజిల్ ధర మాత్రం 48 పైసల వరకు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉంది. ఢిల్లీలో డీజిల్ ధర పెంపుతో లీటర్ రూ. 79.88కి చేరుకోగా, పెట్రోల్ ధర రూ. 79.76గా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..2012 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ మధ్య ధరల తేడా రూ. 30 వరకూ ఉంది. 2012,జూన్ 18న ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ. 71.24 ఉండగా, డీజిల్ ధర రూ. 40.91గా ఉండేది. ముంబైలో అదే రోజున పెట్రోల్ రూ. 76.45, డీజిల్ రూ. 45.28గా ఉండేది. తర్వాతి పరిణామాల్లో పెట్రోల్, డీజిల్ మధ్య ధరల్లో అంతరం తగ్గుతూ వచ్చింది. బుధవారంతో ఆ అంతరం కాస్త కరిగిపోయి పెట్రోల్‌ను అధిగమించి డీజిల్ పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా అన్ని దేశాలు లాక్‌డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. మంగళవారానికి బ్రెంట్ క్రూడాయిల్ ధర 43.83 డాలర్లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లిలా ఉన్నాయి.

* హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 82.79, డీజిల్ రూ. 77.60గా ఉంది.
* ఢిల్లీలో పెట్రోల్‌ రూ.79.76, డీజిల్‌ రూ.79.88.
* ముంబైలో పెట్రోల్ రూ. 86.54, డీజిల్ రూ.78.22.
* చెన్నైలో పెట్రోల్ రూ. 83.04, డీజిల్‌ రూ. 77.17గా ఉంది.
* బెంగళూరులో పెట్రోల్ రూ. 82.35, డీజిల్ రూ. 75.51గా ఉంది.

Next Story

Most Viewed