కొవిడ్ బాధితులకు ‘ఇంటి భోజనం’..హోమ్ డెలివరీ చేస్తున్న క్యాటరర్స్

by  |
కొవిడ్ బాధితులకు ‘ఇంటి భోజనం’..హోమ్ డెలివరీ చేస్తున్న క్యాటరర్స్
X

దిశ, ఫీచర్స్ : ఓవైపు కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉంది. అయితే స్వల్ప లక్షణాలతో లేదా ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఈ క్రమంలో మహమ్మారి నుంచి కోలుకునేందుకు తాజా పోషకాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. కానీ వైరస్ సోకిన రోజుల్లో వంట చేసుకోవడం కాస్త ఇబ్బందే. ముఖ్యంగా ఫ్యామిలీకి, స్నేహితులకు దూరంగా ఉంటున్న వారికి కష్టంగానే ఉంటుంది. ఇలాంటి కష్టకాలంలో హోమ్ చెఫ్‌లు, స్వచ్ఛంద సేవకులు ఇంటి భోజనంతో పాటు పౌష్టికాహారాన్ని హోమ్ డెలివరీ చేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ‘క్యాటరర్స్, హోమ్ చెఫ్స్’ గురించి సోషల్ మీడియాలో ఆరా తీస్తుండగా.. కరోనా బాధితులకు స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న వారి విశేషాలు మీ కోసం..

వ్యాపారాల నుంచి సంఘాల వరకు, లోకల్ షెల్టర్స్ నుంచి సామాజిక కార్యకర్తల వరకు సెకండ్ వేవ్‌లో ప్రతీ ఒక్కరు తమ వంతు కృషి చేయడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ రోగులకు భోజన, వసతి సదుపాయాలు అందించడం కీలకం. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కొంతమంది క్యాటరర్లు, హోమ్ చెఫ్స్ కరోనా సోకినవారికి ఆహార ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. ఇవి ఒంటరిగా నివసిస్తున్న వారికి హెల్ప్‌ఫుల్‌గా ఉండటంతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై భారాన్ని తగ్గిస్తున్నాయి. అంతేకాదు బాధితులకు హైజీన్ ఫుడ్ అందిస్తూనే కొత్త ఆదాయ మార్గాన్ని కూడా అందిపుచ్చుకుంటున్నాయి.

14 రోజుల ప్యాక్ :

సాయి కైలాష్ దాబాకు చెందిన అనిల్ అగర్వాల్ గతేడాది కొవిడ్ బాధితులకు స్వచ్ఛందంగా భోజనం సరఫరా చేశాడు. ఇక సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో ఇప్పుడు దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాడు. ‘ఇప్పటి వరకు 3,000 మందికి శాఖాహార భోజనాన్ని పంపిణీ చేశాం. ప్రతిరోజూ 400 థాలీలను నగరంలోని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నాం. ఒకే ఇంటి నుంచి 5-6 ఆర్డర్లు వస్తే డెలివరీ చార్జీలను మేమే భరిస్తాం.14 రోజులకు మినీ హోమ్ థాలీ(రూ.4,000), హోమ్ థాలీ(రూ.6,000) అందిస్తున్నాం. ప్యాకేజీల్లో భోజనం, విందు మాత్రమే ఉన్నాయి’ అని నిర్వాహకుడు అనిల్ వెల్లడించాడు.

25 కి.మీ వరకు ఫ్రీ డెలివరీ :

ఇక 15 సంవత్సరాలుగా ఓల్డ్ సిటీలో సంఘీ క్యాటరర్స్‌ను నడుపుతున్న ఆనంద్ సంఘి.. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవారికి భోజనం అందిస్తున్నాడు. ప్రస్తుతం రోజుకు 20-25 ప్లేట్ల వరకు స్వచ్ఛమైన శాఖాహార భోజనాన్ని అందిస్తున్నాడు. 25 కి.మీ దూరం వరకు ఉచితంగా డెలివరీ చేస్తుండగా, 14 రోజులకు గాను రూ .9,000 చార్జ్ చేస్తున్నాడు.

ఆహారం, వసతి :

ఒక అడుగు ముందుకు వేసిన జైన్ రిలీఫ్ ఫౌండేషన్.. వైరస్ బారిన పడిన ప్రజలకు ఆహారంతో పాటు బస కూడా ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు 24×7 వారిని చూసుకునేందుకు ఓ నర్సుతో పాటు వైద్యులతో డైలీ విజిట్స్ చేయిస్తున్నారు. కరోనా బాధితుల ప్రతి అవసరాన్ని వాళ్లే చూసుకుంటుండగా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, హల్దీ మిల్క్(రాత్రి) అందిస్తున్నారు. ఇక్కడ సూపర్ డీలక్స్ గదులు కూడా అవైలబుల్‌గా ఉండగా, ఒకే కుటుంబానికి షేరింగ్ ప్రాతిపదికన కూడా గదులు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ అత్యవసరమైతే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పాటు రోగులు ఉపయోగించే అన్ని డిస్పోజబుల్ యుటెన్సియల్స్‌ను అవసరం తీరాక కాల్చివేస్తున్నారు. ఈ ప్యాకేజీలో ఒక వ్యక్తికి రోజుకు రూ .3,000 చార్జ్ చేస్తున్నారు.

ఓల్డ్ సిటీలో హెల్తీ బైట్ నడుపుతున్న పింకీ గుప్తా.. వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి సాయం చేయడానికి మాత్రమే తను సేవలు ప్రారంభించింది. పింకీ, వాళ్ల అత్తగారు అన్ని జాగ్రత్తలు తీసుకుని వంట చేస్తున్నారు. 14 రోజుల అల్పాహారం, భోజనం, డిన్నర్ ప్యాకేజీకి రూ .3,500 తీసుకుంటుండగా.. డెలివరీ చార్జీలు అదనం.

వీరితో పాటు రేవతి వెంకటేశన్ విద్యా నగర్‌లో క్లౌడ్ కిచెన్ (క్విక్ మీల్ 7) ప్రారంభించగా, నిఖిల్ అనే యువకుడు ‘7thecloudkitchen’ ద్వారా డైలీ యాభై మందికి పైగా ఫుడ్ డెలివరీ చేస్తూ, కేరళ నుంచి తీసుకొచ్చిన ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్ కూడా అందిస్తున్నాడు. వీళ్లే కాకుండా మరికొంతమంది హోమ్ చెఫ్స్ హైదరాబాద్ వ్యాప్తంగా స్పెషల్ కొవిడ్ ప్యాకేజీలు అందిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా డబ్బులతో కూడిన సేవలు కాగా ఎంతోమంది వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు కొవిడ్ పేషెంట్స్‌కు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

జొమాటో ఎమర్జెన్సీ డెలివరీ ఫీచర్..

ఫుడ్ డెలివరీ అప్లికేషన్ జోమాటో కూడా వైరస్ రోగులకు ప్రాధాన్యతా ప్రాతిపదికన ఆహారం అందించేందుకు కొత్తగా ఎమర్జెన్సీ డెలివరీ ఫీచర్‌ను ప్రారంభించింది. వినియోగదారులు తమ ఆర్డర్‌ను చెక్అవుట్ చేసినప్పుడు, అత్యవసర డెలివరీ ఫీచర్ చెక్ చేసుకోవాలి. ఇది అత్యవసర పరిస్థితులకు ప్రాధాన్యతనిచ్చేలా చేయడంతో పాటు రెస్టారెంట్‌ నిర్వాహకులు ఫుడ్ ప్యాకెట్‌ను ఫాస్ట్‌గా సిద్ధం చేసేందుకు దోహదపడుతుంది. అంతేకాదు వేగవంతమైన డెలివరీ కోసం డెడికేటెడ్ రైడర్‌ను కూడా జోమాటో అసైన్ చేస్తోంది. కాగా ఈ ఫీచర్‌ను ఓ అంబులెన్స్ సర్వీస్ లాగా చూడాలని, మిస్ యూజ్ చేయొద్దని ప్రజలను కోరిన జొమాటో.. ఈ అత్యవసర డెలివరీలు కాంటాక్ట్‌లెస్‌గా ఉంటాయని పేర్కొంది.

Next Story

Most Viewed