టీఆర్ఎస్‌లో లుకలుకలు.. ఆమె వర్సెస్ ఎమ్మెల్యేలు

by  |
ZP Chairperson vs MLA
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జిల్లాలో ప్రతిపక్ష నాయకులు లేరనుకున్నారమో.. అధికార పార్టీ నాయకులే ప్రతిపక్షంగా మారారు. జిల్లా అభివృద్ధిని మరిచి.. ఆధిపత్య పోరుకు దిగారు. ఒకరి ప్రతిపాదిస్తే, మరొకరు తిరస్కరించడం.. కొందరు సమావేశానికి వెళ్తే, మరికొందరు బహిష్కరించడం ఆనవాయితీగా చేసుకున్నారు. అసలే వెనకబడిన జిల్లాగా పేరొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో పెరిగిన ఆధిపత్య పోరుతో అభివృద్ధి మరింత కుంటుపడుతోందని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 మండలాలు ఉన్నాయి. గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ నుంచి డాక్టర్ అబ్రహం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ అధికార పార్టీకి చెందిన వారే జడ్పీటీసీలుగా ఉన్నారు. అయితే జడ్పీ చైర్మన్ ఎంపిక సమయంలో ఎమ్మెల్యేలు ఒకరిని ప్రతిపాదించగా.. అనూహ్యంగా మానోపాడు జడ్పీటీసీ సరిత జడ్పీ చైర్ పర్సన్‌గా ఎంపికైంది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారు. తమ ప్రమేయం లేకుండా అధిష్టానం అండదండలతో జడ్పీ పీఠంపై కూర్చున్న సరితకు ఎమ్మెల్యేలు మొదట్లో కొంతమేర సహకరించినా ఆ తర్వాత అడ్డుతగలడం ప్రారంభించారు.

విద్యావంతురాలైన సరిత తన పదవికి తగ్గట్లుగా, ఎవరి ప్రమేయం లేకుండా పాలన కొనసాగించాలని భావించినా.. ఎమ్మెల్యేల ఆటంకాలతో విభేదాలు ముదిరాయి. పార్టీ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్ పర్సన్‌ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. జిల్లా పరిషత్ సమావేశాలకు సైతం ఎమ్మెల్యేల అనుచరులుగా ఉన్న జడ్పీటీసీలు హాజరు కాకపోవడం, హాజరైనా రకరకాల సమస్యలపై సభలో ప్రతిపక్ష పార్టీల సభ్యులుగా అడ్డుతగలడం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. కొన్నిసార్లు సభ్యులు గైర్హాజర్ అవుతుండడంతో కోరం లేక సమావేశాలను వాయిదా వేసిన సందర్భాలూ ఉన్నాయి.

మూడు నెలల క్రితం జరగాల్సిన జిల్లా పరిషత్ సమావేశానికి రాష్ట్ర మంత్రులకు జడ్పీ చైర్ పర్సన్ ఆహ్వానించారు. వారికి స్వాగతం పలుకుతూ గద్వాల పట్టణమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తీరా ఆ సమావేశానికి మంత్రులు, సభ్యులు హాజరు కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే తమకు సమాచారం లేకుండా మంత్రులను ఆహ్వానించడం పట్ల ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రులతో మాట్లాడి తమ ప్రమేయం లేకుండా జడ్పీ సమావేశానికి ఎలా వస్తారని ప్రశ్నించడంతో వారు ఆగిపోయినట్లు జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. మీరు సఖ్యతగా ఉండి అందరూ కలిసి ఆహ్వానిస్తూనే వస్తామని మంత్రులు పేర్కొనడం, జడ్పీ సమావేశం వాయిదా పడడం పెద్ద దుమారమే లేపింది. మధ్యలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసినా సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడంతో మళ్లీ వాయిదా పడింది.

కాగా, మంగళవారం జరిగిన సమావేశానికి జడ్పీటీసీలు, ఎంపీపీలు, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం కొనసాగినంత సేపు జడ్పీ ఫండ్ నుండి నిధుల కేటాయింపు విషయంలో నానా హంగామా సృష్టించారు. ఎమ్మెల్యే అబ్రహం సైతం సభ్యుల వాదనకు మద్దతు పలకడంతో సమావేశం రభసగా మారింది. దీంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తీవ్రంగా స్పందించారు. రాజకీయాలు చేయాల్సింది ఇక్కడ కాదని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మందలించారు.

కాగా, జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీకే చెందిన జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యేల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు అభివృద్ధి పనులకు ఆటంకంగా మారుతుందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధిష్టానం కల్పించుకొని సమస్యలను పరిష్కరించాలని, రెండు వర్గాలను కలిసి జిల్లా ప్రగతిపథంలో నడిచేలా చూడాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.



Next Story

Most Viewed