కరోనా టైంలో కంత్రీ పనులు

by  |
కరోనా టైంలో కంత్రీ పనులు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేకించి జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తీవ్రతరమై ప్రజలు భయాందోళనలు చెందుతున్న సమయంలో గోషామహల్ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు బుధవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇలా వేడుకలు జరుపుకోవడం సాధారణమే, ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? అవును ప్రత్యేకత ఉంది. పుట్టినరోజు వేడుకలలో భాగంగా నియోజకవర్గంతో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరై సదరు నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పుట్టినరోజు జరుపుకున్న నాయకుడు, అతనికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ఏ ఒక్కరు కూడా మాస్కులు ధరలించలేదు. కనీసం సామాజిక దూరం కూడా పాటించలేదు. ఒకరిమీద ఒకరు కలబడినట్లు గా ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. అంతటితో ఆగకుండా ఫోటోలను వాట్సాప్, ఫేస్ బుక్ లలో కుప్పలుతెప్పలుగా పోస్ట్ చేశారు. కరోనా వ్యాధి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రస్తుత తరుణంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చూసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు. వీరు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. పుట్టినరోజు వేడుకలకు హాజరైన వారిలో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ ఉన్నా మిగిలిన వారి సంగతి ఏమిటి అనేది వేడుకలను చూసిన వారు ప్రశ్నిస్తున్నారు.

Next Story