తడబడతారా..నిలబెడతారా ?

by  |
తడబడతారా..నిలబెడతారా ?
X

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 144 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపు అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బౌల్ట్, సౌథీలు కట్టుదిట్టమైన బంతులతో ప్రధాన వికెట్లను చేజిక్కించుకుని భారత్‌ను ఆదిలోనే దెబ్బకొట్టారు.
వెల్లింగ్టన్‌లో జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆటముగిసే సమయానికి వైస్ కెప్టెన్ అజింక్య రహానే 25 (67 బాల్స్, 4 ఫోర్లు), హనుమ విహారి 15 ( 70 బాల్స్, 2 ఫోర్లు) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ కివీస్ కన్నా 39 పరుగలు వెనకంజలో ఉంది. 216/5తో మూడోరోజు ఆట ప్రారంభించిన కివీస్ మరో 132 పరుగులు చేసి 348 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బ్యాట్స్‌మెన్‌‌లో గ్రాండ్‌హోమ్(43), కైల్ జేమీసన్(44), ట్రెంట్ బౌల్ట్(38)లు ధాటిగా ఆడి కివీస్ స్కోరుకు దోహదపడ్డారు. భారత బౌలర్లో ఇషాంత్ శర్మ(5), అశ్విన్(3), బుమ్రా (1), షమీ(1) వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో కీలకపాత్ర పోషించిన జేమీసన్ బ్యాటింగ్‌లోనూ రాణించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించడంలో సాయపడ్డాడు.

వరుస వికెట్లు..

కివీస్ ఆలౌటైన అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌ను ట్రెంట్ బౌల్ట్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ పృథ్వీషా 14 (30 బాల్స్, 2 ఫోర్లు)ను రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. ఆ తరవాత క్రీజులోకి వచ్చిన నయా వాల్ పుజారా 11(81 బాల్స్) బౌలర్లను కాసేపు ప్రతిఘటించాడు. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్‌తో కలిసి 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, 32వ ఓవర్‌లో బౌల్ట్ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 58(99 బాల్స్, 7 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లీ 19(43 బాల్స్, 3 ఫోర్లు) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత రహానే, విహారీలు ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం 144/4తో ఉన్న భారత్‌ మరో 300 పరుగులు జోడిస్తేనే, చివరి ఇన్నింగ్స్‌లో పోరాడేందుకు సరిపడా స్కోరు ఉంటుంది. లేదంటే ఓటమి తప్పదు. అయితే నాలుగోరోజు మొదటి సెషన్ ఆట కీలకం కానుంది. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ అవుటైతే.. బయట ఒక పంత్ మాత్రమే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఉన్నాడు. కానీ, అతనికి టెయిలెండర్ల నుంచి సహకారం అందుతుందా అనేది సందేహమే. ఏదేమైనా నాలుగో రోజు ఆటతో ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కొనసాగుతున్న ‘కోహ్లీ’ వైఫల్యం

మొదటి ఇన్నింగ్స్‌లో స్లిప్‌లో ఫీల్డర్‌కు సునాయాస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో కాస్త కుదురుకున్నట్టే కనిపించాడు. అంతలోనే బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ద్వారా అవుటయ్యాడు. టెస్టు్ల్లో గత 20 ఇన్నింగ్స్‌ల నుంచి కోహ్లీ సెంచరీ చేయలేకపోవడం తెలిసిందే.

Read also..

ఉద్యోగుల వల్లే పథకాలు విజయవంతం



Next Story

Most Viewed