Sex Scenes:సెక్స్ సీన్లలో నటీనటుల కోసం.. ఇంటిమసీ కోఆర్డినేటర్

by  |
Sex Scenes:సెక్స్ సీన్లలో నటీనటుల కోసం.. ఇంటిమసీ కోఆర్డినేటర్
X

దిశ, ఫీచర్స్ : సినిమాల్లో లిప్‌లాక్స్ సీన్స్ సర్వసాధారణం అయిపోయాయి. కౌగిలింతలు, ఫిజికల్ టచ్, సిమ్యులేటెడ్ సెక్స్ లేకుండా సినిమాలు పూర్తవడం లేదంటే అతిశయోక్తి కాదు. అపురూప ప్రేమకథ, ఫక్తు యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రాలనే కాదు.. జోనర్, భాషతో సంబంధం లేకుండా.. వెబ్ సిరీస్ నుంచి వెండితెర వరకు తెరనిండుగా ఎక్కడ చూసినా న్యూడిటీ, సెక్సువల్ వయొలెన్స్, కల్ట్ సీన్స్, బై సెక్సువల్ వంటి బోల్డ్ దృశ్యాలే. అయితే ఈ సన్నివేశాల చిత్రీకరణ వెనక నటీనటుల సిగ్గు, బిడియం, భయం కూడా ఉంటాయి. ఈ సీన్లలో నటించేందుకు చాలా మంది నటులు అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో యాక్టర్స్ ఇబ్బంది, బెరుకు లేకుండా సహజంగా నటించేలా ‘ఇంటిమసీ కోఆర్టినేట్లు’ సహకరిస్తారు. మీ టూ (#MeToo) ఉద్యమం తర్వాత వీరికి ప్రాధాన్యత పెరగగా, సెక్స్ రిలేటెడ్ సన్నివేశాలు తీసేటపుడు యాక్టర్స్‌కు తగినంత భద్రత ఉండేలా చూసుకోవడం వీరి విధి. ఇలాంటి చాలెంజింగ్ జాబ్‌లో రాణిస్తోంది ఆస్తా ఖన్నా. భారతదేశ మొట్టమొదటి సర్టిఫైడ్ ఇంటిమసీ కోఆర్టినేటర్‌(ఐసీవో) తనే కావడం విశేషం.

అతడో నేరస్థుడు. వయసు 45 ఏళ్ల పైనే. బాధితురాలు 14 ఏళ్ల అమ్మాయి. వీరిద్ధరి మధ్య సన్నిహిత సన్నివేశం చిత్రించాలి. దర్శకుడు, సహాయ దర్శకులు సీన్ వివరించడానికి ఇబ్బంది పడుతున్నారు. నటీనటులు కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి సన్నివేశాలను నావిగేట్ చేయడంలోనే ‘ఇంటిమసీ కోఆర్టినేట్స్’ అవసరమవుతారు. మరో ఉదాహరణ తీసుకుంటే తెలియని వ్యక్తిని ముద్దుపెట్టుకోవడం, టూ పీస్ దుస్తుల్లో పురుషుడితో సన్నిహితంగా మూవ్ కావడం అమ్మాయిలకు కాస్త ఇబ్బంది కలిగించే అంశం. ధరించే దుస్తుల విషయంలోనూ అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సెట్‌లో అమ్మాయిల అభద్రతా భావాన్ని తొలగించేందుకు ఇంటమసీ కోఆర్టినేట్స్ ఉపయోగపడతారు. దర్శకుడు నటీనటుల మధ్య వీళ్లు సంధానకర్తలుగా వ్యవహరిస్తారు. సీన్ల విషయంలో, నటీనటుల హక్కుల పరంగా.. నిబంధనలు అతిక్రమించినా, ఏదైనా తేడా వచ్చినా వీళ్లు అడ్డుపడతారు. సదరు సన్నివేశాలను డిలీట్ చేయిస్తారు. ఒకవేళ దర్శకుడు, నటీనటులు షాట్ విషయంలో సంతృప్తిగా ఉంటే, ఆ సన్నివేశాన్ని కొనసాగిస్తారు. ఇప్పటివరకు సెట్స్‌లో నటుల శ్రేయస్సు కోసం సాధారణంగా ప్రొడక్షన్ సిబ్బంది బాధ్యత వహించేవాళ్లు కానీ ఇప్పుడు ఇంటిమసీ కోఆర్టినేటర్స్ ఆ పని చేస్తున్నారు.

Intimacy-Coordinator1

2017లోని ‘వీన్‌స్టెయిన్ కుంభకోణం, మీ టూ ఉద్యమం’ తరువాత యూఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఇంటిమసీ కోఆర్టినేట్లకు డిమాండ్ పెరిగింది. పరిశ్రమలో లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన చర్యలు హైలైట్ కావడంతో హాలీవుడ్ నటి ఎమిలీ మీడ్ తమ శ్రేయస్సు కోసం వృత్తిపరమైన భద్రతలను కోరడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే తాము తీసే అన్ని కార్యక్రమాల్లో చిత్రీకరించే సన్నిహిత సన్నివేశాల కోసం ఒక ఇంటిమసీ కోఆర్డినేటర్‌ను నియమిస్తున్నట్లు అక్టోబర్ 2018లో టెలివిజన్ నెట్‌వర్క్ హెచ్‌బీఓ ప్రకటించింది. 2019 జనవరిలో, నెట్‌ఫ్లిక్స్ సెక్స్ ఎడ్యుకేషన్‌ సిరీస్ విడుదల చేయగా, దీనికోసం ఇటా ఓబ్రెయిన్‌ను కోఆర్డినేట్‌గా ఉపయోగించింది. అప్పటి నుంచి నిర్మాతలు, దర్శకులు తమ సెట్లో ఇంటిమసీ కోఆర్డినేటర్‌ను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా భారత్‌లో కూడా ఆ మార్పు కనిపిస్తోంది. ఇదివరకు భారతీయ సినిమాల్లో హద్దులు మించిన శృంగార సన్నివేశాలు కనిపించడం అరుదు. కానీ ప్రస్తుతం ఆ సీన్లు లేకుండా సినిమాలు తీయడమే అరుదుగా మారింది. ఓటీటీ పుణ్యమాని బోల్డ్ కంటెంట్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడంతో సినిమాల్లోనూ సెక్స్, న్యూడ్, సెక్సువల్ హరాస్‌మెంట్ సన్నివేశాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇంటిమసీ కోఆర్డినేటర్స్ తెరమీదకు రాగా, ఇండియాలో తొలి సర్టిఫైడ్ ఐసీవోగా ‘ఆస్తా ఖన్నా నిలిచింది.

ఆస్తా ఖన్నా ఓ చిత్రం కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ‘ఇంటిమసీ’పై అధ్యయనం చేసింది. అప్పుడు ఆమెకు ‘ఇంటిమసీ కోఆర్డినేట్ల’ గురించి తెలిసింది. దాంతో ఆ కోర్సు చేయడానికి బ్లూమెంటల్ స్థాపించిన గ్లోబల్ ఏజెన్సీ ‘ఇంటిమసీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్’(ఐపిఎ)కు లేఖ రాసింది. అలా దక్షిణాసియా నుంచి శిక్షణ తీసుకున్న తొలి వ్యక్తిగా ఆస్తా నిలిచింది.

20 వారాల శిక్షణా కార్యక్రమానికి, రూ. 4 లక్షలు ఫీజుగా చెల్లించాలి. ఇందులో భాగంగా జెండర్, సెక్సువాలిటీ, అందులోని వైవిధ్యత వంటి అంశాలపై పాఠాలు చెబుతారు. సెక్సువల్ హరాస్‌మెంట్, కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ వివరిస్తారు. మైనర్లను, పెద్దలను ఎలా ట్రీట్ చేయాలి. ఏదైనా జరిగినప్పుడు వారికి ప్రథమ చికిత్స అందించడం, న్యాయవాద సలహాలు ఇవ్వడం తదితర విషయాలపై పూర్తిగా అవగాహన కల్పిస్తారు. అహింసాత్మక సంభాషణ ఎలా ఉండాలో కూడా నేర్పిస్తారు. వేర్వేరు లెన్స్‌ల ద్వారా సాన్నిహిత్య సమన్వయాన్ని చూడటం, ఫిల్మ్ సెట్‌ను నావిగేట్ చేయడం, కాంట్రాక్టును చదివే పద్దతి, విభిన్న ప్రోటోకాల్స్, ఫిల్మింగ్ ప్రాసెస్‌లు వంటి ప్రాథమిక విషయాలపై గైడెన్స్ అందిస్తారు.

ఒకప్పుడు ఇండియాలో హీరోయిన్లు తమ తల్లులు, తండ్రులతో లేదా మేనేజర్లతో కలిసి సెట్స్‌కు వెళ్లేవాళ్లు. ఒకరకంగా వాళ్లనే అనధికారిక ఇంటిమసీ కోఆర్డినేటర్లుగా అనుకోవచ్చు. సినిమాల్లోనే కాదు ఇండస్ట్రీలోనూ ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. మీటూ తర్వాత పరిస్థితులు మరింత మారాయి. నటీనటులు వివక్షకు గురైనా లేదా లైంగిక వేధింపులకు ఎదుర్కొంటున్నా, దాని గురించి కేర్ తీసుకునేందుకు ఇంటిమసీ కోఆర్డినేటర్ ఉండాల్సిన అవసరం పెరిగింది. అయితే ఇప్పటికీ ఇంటిమసీ కోఆర్డినేటర్‌ను పెట్టుకోవడం అంటే మేకర్స్ అదనపు ఖర్చుగా భావిస్తున్నారు.

‘యాక్షన్ డైరెక్టర్.. నటుల శారీరక భద్రతను కాపాడితే, ఇంటిమసీ కోఆర్డినేటర్ వారి ఫిజికల్ అండ్ మెంటల్ సేఫ్టికీ బాధ్యత వహిస్తారు. సెక్స్, న్యూడిటీ, లైంగిక హింస లాంటి సన్నివేశాలు తీసేటపుడు నటీనటుల హక్కులు కాపాడటం మా విధి. అందువల్లే అంతర్జాతీయంగా ఈ రెండు విభాగాల్లోని ప్రొఫెషనల్స్‌కు సమాన పే విధానం అమలు చేస్తున్నారు. ఇప్పడిప్పుడే మనదేశంలో ఇంటిమసీ కోఆర్టినేట్ల ప్రాధాన్యత గుర్తిస్తున్నారు. సన్నిహిత సన్నివేశాన్ని మేం డిజైన్ చేయం కానీ దర్శకుడు హెటిరోసెక్సువల్ సీన్ చూపించాలనుకుంటే లెన్స్, కెమెరా ఏ కోణంలో ఉంటాయి, స్టోరీబోర్డు ఏంటో తెలుసుకోవాలి. దానివల్ల సేఫ్టీ గేర్స్ ఎలా ఉన్నాయి, దుస్తులు సరైనవా కావా అని నిర్ధారించుకుంటాం. అంతకన్నా ముందు సన్నివేశం చేయడానికి యాక్టర్స్ సమ్మతి చాలా ముఖ్యం. దానికి ఉన్న హద్దుల గురించి అందరితో చర్చించి, అవి తీసేటపుడు సెట్స్‌లో అడ్డుగా పెట్టడానికి బోర్డులు ఉపయోగిస్తాం. వెజినా, చెస్ట్ పార్ట్స్‌కు గార్డ్స్ ఉపయోగించడంతో పాటు శరీరపు రంగులో కలిసిపోయే దుస్తులు, టేప్స్ యూజ్ చేస్తుంటాం. స్త్రీ,పురుషుల మధ్య అడ్డుగా దిండ్లు కూడా సెట్ చేస్తాం. కొత్తగా వచ్చిన అమ్మాయిలకు మరింత భయం, బెరుకు ఉంటాయి. మేం ఉంటే వాళ్లు భద్రంగా ఉన్నట్లు భావిస్తారు.
– ఆస్తా ఖన్నా



Next Story