టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారిన ఫీల్డ్ అసిస్టెంట్లు.. టార్గెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డినే..?

by  |
టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారిన ఫీల్డ్ అసిస్టెంట్లు.. టార్గెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డినే..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన లక్ష్యం ప్రభుత్వమే అయినా తెర చాటుగా ఉన్న టార్గెట్ మాత్రం వేరేనని స్పష్టం అవుతోంది. ఇంతకాలం తమను మెప్పిస్తూ ఒప్పిస్తూ వెల్లదీసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డినే వారు టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలతో పాటు చాలా సార్లు ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య పరిష్కారం కోసం హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని అంటున్నారు వారు. దీంతో తమ పోరాటాలకు ఎప్పటికప్పుడు బ్రేక్ వేయాల్సి వచ్చిందని భావిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పల్లా ప్రయత్నాలకు చెక్ పెట్టాలని స్కెచ్ వేస్తున్నట్టుగా సమాచారం.

హుజురాబాద్ బై పోల్స్ లో ఇల్లందకుంట ఇంఛార్జీగా ఉన్న పల్లా ప్రభావాన్ని గణనీయంగా తగ్గించి టీఆర్‌ఎస్ పార్టీ ఓటింగ్ శాతాన్ని పడిపోయేలా చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం వ్యూహ రచన చేసుకుంటున్న వారు, ఇల్లందకుంట మండలంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి భారీగా గండి కొట్టేలా ప్రచారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇల్లందకుంటలో టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు తగ్గితే దాని ప్రభావం పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పడుతుందని, ఈ విషయంపై అధిష్టానం కూడా దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. నెలల తరబడి ఇల్లందకుంటలోనే మకాం వేసినా పల్లా మాత్రం ఏమీ చేయలేకపోయారన్న సంకేతాలను పంపించినట్టవుతుందని కూడా భావిస్తున్నారు.

ప్రపోజల్ చేసే వారి కోసం…

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వానికి తమ సత్తా చాటాలనుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వెయ్యి మంది నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒక్కో అభ్యర్థికి పది మంది చొప్పున బలపర్చే ఓటర్లు కావాల్సి ఉన్నందున వారందరిని కూడబెట్టే పనిలో నిమగ్నం అయ్యారు. ప్రజా సంఘాలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధుల సహాకారంతో నామినేషన్ ఫాంలపై సంతకాలు చేసే వారిని కూడా సిద్దం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

పాదయాత్రపై…

మరో వైపున పాదయాత్ర విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారం ఇందిరా శోభన్ నేతృత్వంలో ఉపాధి భరోసా యాత్ర ప్రారంభించాలని భావించారు. అయితే చివరి నిమిషంలో అనుమతి లేదని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో చట్ట ప్రకారం పోలీసుల అనుమతి కోరేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. హుజురాబాద్ ఏసీపీ వెంకటరెడ్డిని కలిసి అనుమతి ఇవ్వాలని శనివారం కోరారు. అయితే సెప్టెంబర్ 5వ తేది వరకు ఎలాంటి అనుమతుల ఇచ్చే పరిస్థితి లేదని ఏసీపీ వారితో స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో తమకు ఆరో తేది నుండి పాదయాత్ర చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన దరఖాస్తును పోలీసులు ముందుగా తీసుకునేందుకు నిరాకరించడంతో రిజిస్టర్ పోస్టులో పంపించారని తెలిసింది. ఒక వేళ పోలీసులు అనుమతి ఇవ్వనట్టయితే కోర్టును ఆశ్రయించాలన్న యోచనలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. కోర్టు ద్వారా అనుమతి పొంది పాదయాత్ర చేసి తీరాలన్న లక్ష్యంతోనే పావులు కదుపుతున్నారు.



Next Story

Most Viewed