మేమేం పాపం చేశాం.. ప్రభుత్వం దయచూపాలంటున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లు

by  |
మేమేం పాపం చేశాం.. ప్రభుత్వం దయచూపాలంటున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లు
X

దిశ ప్రతినిధి, మెదక్: కార్మికులకు ఉపాధి కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లకే ప్రస్తుతం ఉపాధి దొరకని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టు పద్ధతితో ఫీల్డ్ అసిస్టెంట్లుగా కొనసాగిస్తున్న వారిని ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈ ఎఫెక్ట్‌తో ఏడాది కాలంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా కష్టకాలంలో ఇతర పనులు దొరక్క … ఉన్న ఉపాధి కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల ఉద్యోగుల మాదిరిగా తమను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్ చేస్తున్నారు.

మేమేం పాపం చేశాం ..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,754 గ్రామాలు ఉండగా సుమారు వెయ్యి మంది వరకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నట్టు సమాచారం. వీరంతా గ్రామాల్లోని హరితహరం మొక్కల సంరక్షణ బాధ్యత, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలచే పనులు చేయించడం, వారి బిల్లులు నమోదు చేసి కూలీ డబ్బులు పంపిణీ చేయడం లాంటి పనులు చేసే వారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ .10 వేల చొప్పున వేతనం చెల్లించేది. అయితే గతేడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం వీరి పోస్టును తొలగించి, వారి బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. దీంతో తాము ఏం పాపం చేశామంటూ బోరున విలపిస్తున్నారు.

ఏడాది కాలంగా ఇంట్లోనే …

అసలే కరోనా కష్టకాలం. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. జాబ్ దొరకడమే గగనమైన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించింది. దీంతో వారంతా ఏడాది కాలం నుండి ఇంటికే పరిమితమయ్యారు. ఉన్న ఉపాధి పోయి… వేరే ఉద్యోగం దొరక్క.. కుటుంబాన్ని నెట్టుకురాలేక సతమతమవుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వీధుల్లోకి తీసుకోవాలని గతంలో హైకోర్టులో కేసు వేయగా .. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఆ లోగా రాష్ట్ర ప్రభుత్వం తమపై దయచూపి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Next Story

Most Viewed