వెనక్కి తగ్గేది లేదు.. రైతు సంఘాల ప్రకటన

by  |
వెనక్కి తగ్గేది లేదు.. రైతు సంఘాల ప్రకటన
X

చండీగఢ్: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు 40 రైతు సంఘాలతో ఏర్పడిన కమిటీ నాయకత్వంలో ఆందోళనలను కొనసాగించాలని రైతు సంఘాల నిర్ణయించాయి. బుధవారం హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాలో నిర్వహించిన కండేలా మహాపంచాయత్ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి వేల మంది మద్దతుదారులతో భారతీయ కిసాన్ యూనియన్ (తికాయత్) నేత రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. ఐదు అంశాలతో కూడిన తీర్మానాన్ని మహా పంచాయత్ ఆమోదించింది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం, కనీస మద్దతు ధరకు రాజ్యాంగబద్దత, స్వామినాథన్ నివేదిక అమలు చేయడం, గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట ఘటన నేపథ్యంలో రైతులపైన నమోదు చేసిన కేసుల ఉపసంహరణతోపాటు వెంటనే వారిని విడుదల చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి.

రైతు సంఘాల నాయకులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా చర్చలు జరపాలని కోరారు. అనంతరం రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే విషయాన్ని రైతు సంఘాల నేతల కూడిన 40 సభ్యుల సంయుక్త కిసాన్ యూనియన్‌ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. మీరు చర్చల జరిపే మంత్రులను మార్చనట్లే మేం కూడా ఆందోళనల మధ్యలో నాయకత్వాన్ని మార్చలేమని పేర్కొన్నారు. భవిష్యత్తు కార్యక్రమాలపై కమిటీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. బీకేయూ(రాజేవల్) నేత బల్బీర్ సింగ్ రాజేవల్, బీకేయూ హర్యానా అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చదుని తదితరులు పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి తికాయత్ మాట్లాడటానికి ముందు స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. స్టేజీపైన ఉన్న రైతు సంఘాల నేతలు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

ఇంటర్నెట్ సేవల నిలిపివేత లేదు : కేంద్రం

ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవల నిలుపుదలను పొడిగించే అవకాశం లేదని కేంద్ర హోంమంత్రిత్వశాఖ బుధవారం స్పష్టం చేసింది. రైతుల ఉద్యమానికి కేంద్రంగా మారిన సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో గత నెల 29 రాత్రి 11గంటల నుంచి 31 రాత్రి 11గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఫిబ్రవరి 2 రాత్రి 11గంటల వరకు పొడిగించారు. అయితే, ఇంటర్నెట్ సేవలను నిలుపుదలను పొడిగించే అవకాశం లేదని కేంద్ర హోంమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

భారత ప్రతిష్ట దెబ్బతిన్నది : రాహుల్ గాంధీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు, ముళ్ల కంచెల ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ స్థాయిలో్ ‘భారత్ ఖ్యాతి’ పెరిగిందని ఎద్దేవా చేశారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచన విధానం వల్ల మన దేశ అతిపెద్ద బలమైన శాంతి, సామరస్యం దెబ్బతిన్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులతోనే కాదు ప్రజలు, జర్నలిస్టులతో వ్యవహరిస్తున్న తీరుతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠ దిగజారిందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed