చేతులెత్తేసిన అధికారులు.. ఆ జిల్లాల్లో పంట పోయినట్లే..!

by  |
crop
X

దిశ, తెలంగాణ బ్యూరో : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఆగమాగమైంది. ఈ వానాకాలం పంటలకు ముప్పు తెచ్చింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో పంటలకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల వ్యవసాయ శాఖ అనధికారికంగా అంచనా వేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, పంటల నష్టంపై సర్వే చేయడం లేదని చెప్పుతున్నారు. కానీ కొన్నిచోట్ల రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, పంటలు నష్టపోయిన వారి వివరాలు చెప్పుతున్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ వారం రోజుల వ్యవధిలో కురిసిన వానలకు రాష్ట్ర వ్యాప్తంగా 6.40 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. మొత్తం 19 జిల్లాల్లో పంటలు దెబ్బతినగా.. ఉత్తర తెలంగాణలోనే 18 జిల్లాలున్నాయి.

పత్తికి పెను ముప్పు

తెలంగాణ పత్తికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, రైతులందరూ పత్తి సాగు చేయాలని ప్రభుత్వం చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి పత్తి సాగు పెరిగింది. ఇదే సమయంలో ఆశించిన దాని కంటే ఎక్కువ వర్షాలు కురవడంతో వరి పంటలు నీట మునగగా, పత్తి, పసుపు చేన్లు జాలు పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఎడతెరిపి లేకుండా వానలు పడటంతో చెల్కల్లో జాలు పట్టింది. దీంతో చేను ఎర్రపడటం, వేరుకుళ్లు, జాజు తెగులు సోకుతున్నయి. అదే విధంగా పలు ప్రాంతాల్లో పత్తికి మశిపేను సోకి ఆకులు ముడతబారి ఎదుగుదల లోపించినట్లు రైతులు చెప్పుతున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాద్‌‌‌‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌‌‌‌, వరంగల్‌‌, హన్మకొండ ఈ ప్రమాదం నెలకొంది.

1.22 కోట్ల ఎకరాల్లో పంటలు

రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో మొత్తం 1.22 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ లెక్కన రాష్ట్రంలో సాధారణ సాగు దాటిపోయింది. వరి 49.87 లక్షల ఎకరాలు, పత్తి 50.85 లక్షల ఎకరాలు, కంది 8.98 లక్షలు, మొక్కజొన్న 6.12 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మొత్తం 1,11,70,286 ఎకరాల్లో పంట సాగు జరిగింది.

6.40 లక్షల ఎకరాల్లో నష్టం

రాష్ట్రంలో ఇటీవల వర్షాలకు 6.40 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రధానంగా పత్తి పంట నాలుగు లక్షలకుపైగా ఎకరాల్లో నష్టపోగా.. ఆ తర్వాత వరి నష్టపోయారు. వరి చాలా ప్రాంతాల్లో నీట మునిగింది. కొన్నిచోట్ల వరదలకు కొట్టుకుపోయింది. అదే విధంగా 5 వేలకు పైగా ఎకరాల్లో కూరగాయ పంటలకు నష్టం జరిగింది.

19 జిల్లాల్లో ప్రభావం

వర్షాలతో ఉత్తర తెలంగాణలోని 18 జిల్లాలతో పాటు మహబూబ్​నగర్​ జిల్లాల్లో పంటల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మహబూబ్​నగర్​జిల్లాల్లో కందిపంట ఎక్కువగా దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్​భూపాలపల్లి, జనగామ, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా పంటలకు నష్టం వాటిల్లింది. అదే విధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్​ జిల్లాల్లో స్వల్పంగా పంటలు దెబ్బతిన్నాయి.

బీమా లేదు.. ధీమా లేదు

రైతులు మళ్లీ నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకృతి విపత్తులతో పంట దెబ్బతింటే పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజన పథకం అమలు చేస్తుండగా.. రెండేళ్ల పాటు రాష్ట్ర సర్కారు బీమా ప్రీమియం వాటా చెల్లించింది. 2018-19, 2019-20 సంవత్సరాల్లో రాష్ట్ర వాటా చెల్లించలేదు. వాటా చెల్లించక పోవడంతో బీమా కంపెనీలు పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదు. తాజాగా ఈసారి కూడా ప్రభుత్వం ప్రీమియంపై నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో పంటలకు బీమా లేకుండా పోయింది. ఇప్పుడు వానాకాలంలో కురిసిన వానలకు పంటలు దెబ్బతినగా.. రైతులపైనే భారం పడుతోంది.

అధికారులు రారంతే..!

మరోవైపు పంటల నష్టంపై ప్రభుత్వం కూడా దాదాపుగా చేతులెత్తేసింది. చాలా జిల్లాల్లో పంటలు నష్టపోయినా.. వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి పరిశీలనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాస్తవంగా ఇప్పటికే చాలా పంటలు నీటిలో మునిగాయి. ఇంకా చాలాచోట్ల నీటిలోనే ఉన్నాయి. ప్రస్తుతం వాటిని పరిశీలించిన నష్టం అంచనా వేయాల్సి ఉండగా.. అధికారులకు ఆదేశాలు రాలేదని పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల రైతులు ఫోన్లు చేసి బతిమిలాడుకుంటున్నా.. తామేం చేయలేమంటూ చెప్పుతున్నారు. చాలాచోట్ల పంటలకు నష్టం జరిగిందని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకుంటే తామం చేస్తామంటూ వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు.



Next Story

Most Viewed