ఢిల్లీ ఓఆర్‌ఆర్‌లోనే ట్రాక్టర్ మార్చ్

by  |
ఢిల్లీ ఓఆర్‌ఆర్‌లోనే ట్రాక్టర్ మార్చ్
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున తలపెట్టిన ట్రాక్టర్ ‌ర్యాలీపై గురువారం ఢిల్లీ పోలీసులతో రైతు సంఘాల నేతల రెండో సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపైనే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతులు పట్టుబట్టారు. అందుకు బదులుగా దేశ రాజధానికి వెలుపల కుందిలి-మనేసర్-పల్వాల్(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వే‌పై నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. అందుకు రైతు సంఘాల నాయకులు ససేమిరా అనడంతో సమావేశం నిష్ఫలంగా ముగిసింది. గురువారం సింఘు సరిహద్దులోని మంత్రం రిసార్ట్‌లో రైతు సంఘాల నేతలతో సంయుక్త పోలీస్ కమిషనర్ ఎస్‌ఎస్ యాదవ్, ప్రత్యేక కమిషనర్లు సంజయ్ సింగ్, దీపేంద్ర పాథక్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు బదులుగా కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వేలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించుకోవాలని రైతులకు పోలీసు అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, రైతులు అందుకు అంగీకరించలేదు. సమావేశం అనంతరం స్వరాజ్య అభియన్ నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఢిల్లీలో ప్రశాంతంగా ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తాం. పోలీసులు దేశ రాజధాని వెలుపల ర్యాలీ నిర్వహించాలని సూచించారు. అది సాధ్యం కాదు అని పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న ఓ రైతు సంఘం నేత మాట్లాడుతూ ఢిల్లీకి వెలుపల ర్యాలీ నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కానీ, మేం దేశ రాజధాని లోపలే ట్యాక్టర్ ర్యాలీ నిర్వహించాలనుకుంటున్నాం. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలిపారు.



Next Story

Most Viewed