నీటి పాలైన పంటలు.. ఆవేదనలో రైతులు

by  |
నీటి పాలైన పంటలు.. ఆవేదనలో రైతులు
X

నష్టం వివరాలు (ప్రాథమిక అంచనా)
ఆగస్టు 3.5 లక్షల ఎకరాలు
సెప్టెంబర్ 10.9 లక్షల ఎకరాలు
అక్టోబర్ 9 లక్షల ఎకరాలు

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ వానాకాలం సీజన్ అపార నష్టాన్ని మిగిల్చింది. పంటలు వేసినప్పటి నుంచి కష్టాలే వెన్నంటాయి. చివరకు చేతికి అందివచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన వానలతో మొత్తం రూ.4,680 కోట్ల పంట నష్టం వాటిల్లింది. వేల కోట్ల ధాన్యం దిగుబడులను కోల్పోయారు. మొత్తం 23.40 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కొన్నిచోట్ల పొట్ట దశలోనే ఉన్న వరి మొత్తం నీటిలో కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల కోత చేసిన ధాన్యం తడిసిముద్దయింది. ఇక పత్తి మొత్తం రాలిపోయింది. కాత పగిలిన పత్తి మొత్తం నీట కొట్టుకుపోయింది. లక్షల ఎకరాల్లో పత్తి పంట మొత్తం ఇంకా నీటిలోనే ఉంది. దీంతో పత్తి చెట్లన్నీ ఎర్రబారుతున్నాయి. కంది, సోయా, జొన్న, వేరుశనగ పంటలు చాలా మేరకు దెబ్బతిన్నాయి. పంటల నష్టం వివరాలన్నీ ప్రాథమిక వివరాలతో కేంద్రానికి నివేదించినట్లు అధికారులు చెబుతున్నారు.

సెప్టెంబర్ వరకు 14.40 లక్షల ఎకరాల్లో నష్టం

ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలతో పలుచోట్ల వివిధ పంటలకు భారీగా నష్టం జరిగింది. ఆగస్టులో 3.5 లక్షల ఎకరాలు దెబ్బతినగా… సెప్టెంబర్ నెలలో కురిసిన వానలకు 10.9 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నష్టం ఎక్కువ వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో పేర్కొన్నారు.

తాజాగా అపార నష్టం

ఈ నెలలో నాలుగు రోజుల పాటు కురిసిన వాన బీభత్సం సృష్ఠించింది. 9 లక్షల ఎకరాల్లో అందివచ్చిన పంటలు ఆగమయ్యాయి. మొత్తం 23.40 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇంకా కొనుగోళ్లు మొదలుకాకపోవడం, వర్షాలకు తడుస్తుండటంతో గుండె చెదురుతోంది. ఈసారి ఖమ్మం, సంగారెడ్డి, వరంగల్, నల్గొండ మెదక్, సిద్దిపేట, నారాయణపేట, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది.

సంబురమంతా నీళ్లపాలు

సాగు పెరిగిందనే సంబురం నీళ్ల పాలవుతోంది. తడిసిన ధాన్యం కొంటారా.. లేదా అనేది ఇప్పుడు రైతులను తీవ్రంగా వేధిస్తోంది. సీఎం వ్యవసాయ శాఖపై సమీక్షలు నిర్వహిస్తున్నాతడిసిన ధాన్యంపై స్పందించడం లేదు. నియంత్రిత సాగు విధానాన్నిఅమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం నష్టపోయిన పంటలకు రూపాయి పరిహారం ఇవ్వడం లేదు. అటు పంటల బీమా పథకాలన్నీ ఎత్తివేశారు. రాష్ట్ర వాటా చెల్లించలేక ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి రాష్ట్రం నాలుగేళ్ల కిందటే తప్పుకుంది.

వాటా చెల్లించలేక వెనక్కి..

2016లో పీఎంఎఫ్‌బీవై పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. మూడేళ్లపాటు అమలు చేసిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఇష్టానికే వదిలేశాయి. వానాకాలం పంటకు 2 శాతం, యాసంగి పంటకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లిస్తే సరిపోయేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లింపును భారంగా భావించి పథకం నుంచి ఈ ఏడాది వైదొలిగింది. రైతులు ప్రభుత్వాల మీద భారం వేసి పంటలు సాగు చేసి నిండా మునిగారు.

Next Story

Most Viewed