తెరపైకి అగ్రిచట్టాలు..ఈసారి నేరుగా రాష్ట్రపతికే వినిపిస్తాం : రైతులు

by  |
తెరపైకి అగ్రిచట్టాలు..ఈసారి నేరుగా రాష్ట్రపతికే వినిపిస్తాం : రైతులు
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలకు ఏడు నెలలు నిండాయి. ఎనిమిదో నెలలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) దేశవ్యాప్త రైతు సంఘాలకు తమ డిమాండ్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలియజేయాలని పిలుపునిచ్చింది. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలోని తమ విభాగం డిమాండ్ల మెమోరాండాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్‌లకు సమర్పించాల్సిందిగా సూచించింది. మెజార్టీ రాష్ట్రాల్లో రైతులు ర్యాలీ తీసుకుంటూ వెళ్లి మెమోరాండాలను గవర్నర్‌లకు సమర్పించారు. హర్యానా, పంజాబ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలలో నిరసన చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్‌కేఎం పేర్కొంది. పంజాబ్‌లోనైతే నిరసనకారులను రాజ్‌భవన్ వెళ్లకుండా పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారని, వాటర్ కెనాన్‌లనూ ప్రయోగించారు. కాగా, ఢిల్లీ సరిహద్దుల్లో ఏడు నెలలుగా ఆందోళన చేస్తు్న్న రైతుల డిమాండ్లను బీకేయూ నేత రాకేశ్ తికాయత్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తో ఆన్‌లైన్‌ మీటింగ్‌లో వివరించారు. తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కేంద్రానికి సూచించాల్సిందిగా రాష్ట్రపతిని ఆ మెమోరాండంలో కోరారు. దీంతో ఢిల్లీ మార్చ్‌ను ఉపసంహరించుకున్నారు. మూడు చట్టాల ఉపసంహరణ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీలు ఆ మెమోరాండంలో పేర్కొన్నట్టు బీకేయూ మీడియా ఇన్‌చార్జ్ ధర్మేంద్ర మాలిక్ వివరించారు.

పంజాబ్, హర్యానా రైతులను రాజ్‌భవన్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. హర్యానాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పంచకులలోని గురుద్వారా నాదా సాహిబ్‌ దగ్గర ఏకమయ్యారు. రాజ్‌భవన్ వెళ్తుండగా బారికేడ్లను ముందుంచి ప్రయాణాన్ని కఠినం చేశారు. ట్రక్కులు, వాటర్ కెనాన్‌లను మోహరించి మొత్తంగా అడ్డుకున్నారు. మెమోరాండాలను అందించడానికి వెళ్తున్న రైతులనూ అడ్డుకోవడమేమిటని ఎస్‌కేఎం ప్రశ్నించింది. నిరంకుశ పాలనా, అప్రకటిత ఎమర్జెన్సీనా అంటూ నిలదీసింది. పంజాబ్ రైతులు ఎట్టకేలకు రాజ్‌భవన్ చేరుకుని గవర్నర్‌కు మెమోరాండం అందించారు.

రైతుల సమస్యలు వినడానికి సిద్ధం..

రైతులందరూ తమ నిరసనలను ముగించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు ఈ చట్టాలకు అనుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ కొంతమందికి వీటిపై భిన్నాభిప్రాయాలున్నాయని వివరించారు. అయితే, వారి సమస్యలను వినడానికి, వారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తోమర్ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు కేంద్రం, రైతులు 11 సార్లు సమావేశాలైనా ఫలితాలనివ్వలేదు.


Next Story

Most Viewed