‘డబ్బులు అత్యవసరం ఉండి తక్కువ ధరకే అమ్ముకున్నాం’

by  |
cotton Farmers
X

దిశ, కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో తెల్ల బంగారం(పత్తి) ధర రోజురోజుకూ పాతాళంలోకి పడిపోతోంది. నవంబర్ నెల నుంచి పత్తి విక్రయాలు ప్రారంభం కాగా, ఈనెల 2వ తేదీన గరిష్ట ధర క్వింటాలుకు రూ.8711 పలికింది. దీంతో ధరలు అమాంతం పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం నాటికి గరిష్ట ధర క్వింటాలుకు రూ.7869, కనిష్ట ధర క్వింటాలుకు రూ. 4133కు పడిపోయింది. దీంతో ధరలు పెరిగి ఆనందంలో ఉన్న పత్తిరైతుల ఆశలు ఒక్కసారిగా అడియాశలయ్యాయి. రోజురోజుకూ పెరిగిపోయిన ధరలను చూసి ఆనందపడ్డ రైతులు, ధరలు తగ్గడంపై ఆందోళన చెందుతున్నారు.

రేటు తగ్గింది : బాణోత్ లాలూ, రైతు

మాది నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం గ్రామంలోని పెద్దతండా గ్రామపంచాయతీ. ఐదు క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకొని వచ్చాము. క్వింటాలుకు రూ. 5 వేలు పలికింది. డబ్బులు అత్యవసరం ఉండటంతో చేసేదేంలేక అమ్ముకున్నాము.

రైతులకు తీవ్రనష్టం : భీమ్లా నాయక్, రైతు

మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంఖానిపేట గ్రామం. ఐదు క్వింటాళ్ల పత్తిని అమ్మడానికి మార్కెట్‌కు తీసుకొచ్చాము. క్వింటాళు ధర రూ. 4133 పలికింది. ఒక్కసారిగా ధర తగ్గడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.



Next Story