కత్తి పదునుపై 'పత్తి'

by  |
కత్తి పదునుపై పత్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సుతి మెత్తని పత్తి రైతన్నను సూదిలా గుచ్చనుంది.. సీఎం కేసీఆర్​ చెప్పాడన్న ఆశతో రికార్డు స్థాయిలో సాగు చేసిన కర్షకుడికి ఆశానిపాతమే మిగిలేలా కనిపిస్తోంది.. ఎడతెరిపి లేని వర్షాలు ఇప్పటికే పంటకు తీవ్ర నష్టాన్ని కలిగించగా, తట్టుకుని నిలిచి దిగుబడి వచ్చే వేళ ఎవరు కొంటారో తెలియని అయోమయ పరిస్థితి కర్షకుడిని వేధిస్తోంది.. నియంత్రిత సాగుతో విస్తీర్ణం పెరగడం ఒకటైతే, సీసీఐ, ప్రైవేట్​ వ్యాపారులు ముందే చేతులెత్తేయడం రైతన్నల ఆందోళనను రెట్టింపు చేస్తోంది.

రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రైతులను పత్తి, వరి సాగు చేయాలని సూచించారు. కొనుగోళ్లకు ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు భారీగా పత్తి సాగు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలకు వేసిన పంటలో దాదాపు మూడున్నర లక్షల ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లే అవకాశమున్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేస్తోంది. ఇదే సమయంలో గతేడాది నష్టం చేసిన గులాబీ పురుగు కూడా మళ్లీ కనిపిస్తోంది. దీనిపై వ్యవసాయ శాఖ సూచనలు ఇస్తున్నా రైతులకు మాత్రం ఆందోళన తప్పడం లేదు.

గతంలో పత్తి సాగులో మహారాష్ట్ర, గుజరాత్ ల తర్వాత మనరాష్ర్టం ఉండేది. ఇప్పుడు మన రాష్ట్రం 60 లక్షల ఎకరాల్లో సాగుతో రికార్డు స్థాయికి చేరుకుంది. గతేడాది 31.25 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా 47.50 లక్షల బేళ్ల దిగుబడి రాగా, ఈ యేడు 95 లక్షల బేళ్ల ఉత్పత్తి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గత సంవత్సరం సీసీఐ కొనుగోలు చేసింది కేవలం 1.75 లక్షల క్వింటాళ్లు మాత్రమే. వాస్తవంగా పత్తి అమ్మకాలపై ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైనే నెపం పెడుతోంది. ఈ క్రమంలోనే కారణాలేమైనా కేంద్రం ఆధీనంలోని సీసీఐ ఈసారి ముందుగానే దిగుబడిలో కేవలం 25 శాతం మాత్రమే కొంటామని స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు సీసీఐ నుంచి రాష్ట్రాలకు నివేదికలు కూడా పంపినట్లు సీసీఐ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు కూడా ఈసారి కొనుగోళ్లపై ఆసక్తి చూపించడం లేదు. కరోనా కష్టాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బాకీలు పెండింగ్​లో ఉండడంతో మిల్లుల యజమానులు వ్యాపారాన్ని తగ్గించుకుంటున్నారు. ఆరేళ్ల నుంచి తెలంగాణ సర్కార్​ కాటన్ జిన్నింగ్ మిల్లుల యజమానులకు పారిశ్రామిక రాయితీ కింద రూ.480 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ విషయమై ఎన్నిసార్లు విన్నవించుకున్నా అతీగతీ లేకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం పోయిందని పలువురు అంటున్నారు. అయితే ఈసారి రాయితీ ఇప్పిస్తామని చెబుతున్నా కరోనా సాకుతో ఎగవేస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పత్తిని కొనలేమంటూ ఇప్పటి నుంచే చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ఎగుమతులు మొత్తంగా నిలిచిపోయాయి. మన దగ్గర నుంచి పత్తిని అత్యధికంగా చైనా, జపాన్, కొరియా దేశాలు కొంటుండగా ఈసారి దాదాపుగా నిలిపివేశారు. మళ్లీ ఎగుమతులు మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో అనే విషయమై స్పష్టత లేదు.

పత్తికి మద్దతు ధరపై ఏటా సమస్యగానే మారుతోంది. సీసీఐ ఎంతో కొంత మద్దతు ధర అందిస్తున్నా, వ్యాపారులు మాత్రం తక్కువకు కొంటున్నారు. గతేడాది మద్దతు ధర రూ. 4,320 ఉన్నా వ్యాపారులు రూ.2,400 నుంచి రూ.3600 వరకు మాత్రమే చెల్లించారు. ఈ ఏడాది కేంద్రం పత్తికి మద్దతు ధర పెంచింది. పొడుగు గింజల పత్తికి రూ.8,815, పొట్టి గింజల పత్తికి రూ.5,515 నిర్ధారించింది. అయితే సీసీఐ చేతులెత్తేసేలా ఉండటం, వ్యాపారులూ రాష్ట్ర ప్రభుత్వ బకాయిలపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో మద్దతు ధర ఏ మేరకు అందుతుందనే ఆందోళన రైతులను వెంటాడుతోంది.



Next Story

Most Viewed