పాలేరు పాత కాలువకు గండి.. పీకల్లోతు కష్టాల్లో రైతులు

by  |
పాలేరు పాత కాలువకు గండి.. పీకల్లోతు కష్టాల్లో రైతులు
X

దిశ, పాలేరు : కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి పాలేరు పాత కాలువకు సామర్ధ్యాన్ని మించి నీరు వచ్చి చేరింది. సోమవారం పలుచోట్ల గండ్లు పడటంతో పంట పొలాలు నీటమునిగాయి. దీంతో కాలువ చుట్టుపక్కల రైతుల పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఇసుక మేటలు వేసి పంట నష్టం వాటిల్లిందని రైతులకు ఆందోళన చెందుతున్నారు.

వివరాల్లోకివెళితే.. కూసుమంచి మండల పరిధిలో గల పాలేరు జలాశయం నుండి ఖరీఫ్ సీజన్‌కు పాత కాలువ నుంచి ఇరిగేషన్ అధికారులు 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.దీనితో హట్యా తండా, మల్లాయిగూడెం, గోరిల్లా పాడుతండా సమీపంలో కాలువకు గండిపడటంతో వరద ధాటికి పంట పొలాలు నీటి మునిగిపోయాయి. మల్లాయిగూడెం సమీపంలో 4వ తూము వద్ద గల సర్వే నెంబర్ 289/2 ,290,330లలో గల అప్పీశెట్టి వీరయ్య, అప్పీశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య బసు, భూక్య తూతాలు అనే రైతుల పొలాల్లోకి వరద నీరు చేరింది.

ఈ సందర్భంగా రైతులు ‘దిశ’తో మాట్లాడుతూ కాలువ పరివేక్షణ లేక నాచు వ్యర్థాలతో కాలువలో సామర్ధ్యానికి ఎక్కువై ఇలా తెగిపోతున్నయి అంటున్నారు.దీంతో కాలువకు గండ్లు పడి వరద తీవ్రతకు మేటలు వేసి తీవ్రంగా నష్టపోతున్నారని, జలాశయం నుంచి నీటి సామర్థ్యాన్ని తగ్గించి చర్యలు చేపట్టాలని పాలేరు నుండి గోరిల్లా పాడు తండా వరకు కాలువకు పూర్తిస్థాయిలో వ్యర్థాలను తొలగించాలన్నారు. అప్పటివరకు పాత కాలువకు నీటి విడుదలను తగ్గించాలని రైతులు కోరుతున్నారు.ఇదే విషయాన్ని అధికారులకు తెలిపినా పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు. రైతులు ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. పాలేరు రిజర్వాయర్ నుండి కెనాల్‌‌కు వచ్చే తూము లాకులు సహితం మొరాయించడంతో వాటిని క్లోజ్ చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్, మానిటరింగ్ అధికారులు అలెర్ట్ అయ్యి హుటాహుటిన ఈఈ సమ్మిరెడ్డి, నేలకొండపల్లి డీఈ మన్మధరావు, కూసుమంచి డీఈ రత్నకుమారి, లష్కర్లు మల్లాయిగూడెం వద్ద గండ్లు పడ్డ ప్రదేశాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది.

రత్నకుమారి ఇరిగేషన్ డీఈ..

మల్లాయిగూడెం వద్ద కాలువకు పలుచోట్ల గండి పడిందనే సమాచారం మేరకు ఈఈ సమ్మిరెడ్డి పర్యవేక్షణలో సందర్శించినట్టు తెలిపారు. జలాశయం నుంచి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. కానీ ఇన్ లెట్ ద్వారా ఇటీవల కురిసిన వర్షపు నీరు, రైతుల పొలాల్లో ఎక్కువైన వాటర్ మరో 20 క్యూసెక్కులు వచ్చి కాలువలోకి చేరడంతో కొంత ఉధృతి పెరిగినట్లు వివరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గేట్లు మొరాయించడం అనేది ఏమీ లేదని వెల్లడించారు.


Next Story

Most Viewed