17 శాతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు

by  |
17 శాతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రూ. 2.74 లక్షల కోట్లతో 16.88 శాతం వృద్ధి నమోదు చేసినట్టు వ్యవసాయ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతులు రూ. 2.31 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వ్యవసాయం, దాని అనుబంధ వస్తువుల దిగుమతులు 3 శాతం పెరిగి రూ. 1,41,034 కోట్లకు చేరుకున్నాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 1,37,014 కోట్లుగా ఉన్నట్టు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి సవాళ్లు ఉన్నప్పటికీ వాణిజ్య మిగులు సమీక్షించిన కాలంలో రూ. 93,907.76 కోట్ల నుంచి రూ. 1,32,579.69 కోట్లకు పెరిగింది.

‘భారత్ కొన్నేళ్లుగా వ్యవసాయ ఉత్పత్తుల్లో వాణిజ్య మిగులును స్థిరంగా నిర్వహిస్తోంది. మహమ్మారి లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థకు అడ్డంకులు లేకుండా భారత్ సరైన జాగ్రత్తలను తీసుకుని ఎగుమతులను నిర్వహించిందని’ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎగుమతి చేసిన వ్యవసాయ ఉత్పత్తుల్లో గోధుమ ఎగుమతుల విలువ రూ. 425 కోట్ల నుంచి రూ. 3,283 కోట్లకు పెరిగాయి. సుగంధ ద్రవ్యాలు, ముడిపత్తి, తాజా-ప్రాసెస్ చేసిన కూరగాయలు సానుకూల వృద్ధిని సాధించిన ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, సమీక్షించిన కాలంలో కొత్తగా ఎగుమతి దేశాల జాబితాలో బ్రెజిల్, చిలీ, పోర్టారికో వంటి కొత్త మార్కెట్లు ఉన్నాయి.


Next Story

Most Viewed