న్యూ ఆన్ నెట్‌ఫ్లిక్స్: ఎక్స్‌ట్రాక్షన్ రివ్యూ

by  |
న్యూ ఆన్ నెట్‌ఫ్లిక్స్: ఎక్స్‌ట్రాక్షన్ రివ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ నెలదాటుతున్న తరుణంలో ఇంకా చూడటానికి ఏం మిగల్లేదని అనుకుంటున్న సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో నిన్న కొత్త సినిమా రిలీజైంది. విడుదలవడమే ఆలస్యం అందరూ చూడటం మొదలెట్టేశారు. ఇందుకు ప్రధాన కారణాలు రెండు… ఒకటి హీరో క్రిస్ హెమ్స్‌వర్త్… అవెంజర్స్, థోర్ సినిమాలతో భారతీయ అభిమానులను దక్కించుకున్న క్రిస్‌కి ఇక్కడ చాలా ఫాలోయింగ్ ఉంది. ఇక రెండోది ఈ సినిమాను ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేయడం. ఏదేమైనా పూర్తిస్థాయి యాక్షన్ స్టంట్లతో ఉన్న ఈ సినిమా మంచి మార్కులనే కొట్టేసింది.

ఈ సినిమా కథ సింపుల్‌గా చెప్పాలంటే దుర్మార్గుల చెరలో చిక్కుకున్న ఓ కుర్రాడిని కాపాడమే… ట్రైలర్ చూసినపుడే ఈ విషయం అర్థమవుతుంది. కానీ సినిమా చూస్తున్నపుడు మాత్రం ఆ యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా మొత్తాన్ని యాక్షన్ స్టంట్లతో పాటు ముగ్గురు నిలబెట్టారు. ఒకటి క్రిస్ చేసిన టైలర్ రేక్, రెండోది రణ్‌దీప్ హుడా పోషించిన సజు, మూడోది ప్రియాంశు నటించిన ఆమిర్ పాత్రలు.

ముంబై డ్రగ్‌లార్డ్ ఓవి మహజన్ సీనియర్ (పంకజ్ త్రిపాఠి) కుమారుడు ఓవి మహజన్ (రుద్రాక్ష్ జైస్వల్)ని ఆమిర్ కిడ్నాప్ చేస్తాడు. అతని వారి బారి నుంచి తీసుకురావడానికి బ్లాక్ మార్కెట్ మెర్సినరీ టైలర్‌ని నియమించుకుంటారు. అయితే ఇందులో సంజు పాత్ర మాత్రం ఎవరివైపు ఉందో అర్థంకాక బుర్రలు చెడిపోయే పరిస్థితి ఎదురవుతుంది. సినిమా మొదలైన 30 నిమిషాలకే ట్రైలర్‌తో పోల్చినపుడు సినిమా భిన్నంగా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

ఈ లాక్‌డౌన్ సమయంలో పూర్తి స్థాయి యాక్షన్ కోరుకునేవారికి ఈ సినిమా ఒక పెద్ద ట్రీట్ అని చెప్పొచ్చు. నమ్మట్లేదా… అయితే చదవండి. ఈ సినిమాలో మొత్తం 69 మంది టైలర్ చేతిలో చనిపోతారు, అది కూడా పైట్ సీన్లలోనే. ఇక టైలర్, సజు కలిసి 446 బుల్లెట్లు పేలుస్తారు. ఇక వీవీ వినాయక్ సినిమాలో లాగ సుమోలు కాదు కానీ మొత్తంగా 45 వాహనాలు ఈ సినిమాలో నుజ్జునుజ్జు అవుతాయి. ఇక పబ్జీ ఆడేవారు గుర్తుపట్టగల 8 రకాల ఆయుధాలను ఈ సినిమాలో ఉపయోగిస్తారు. ఇంకా ఒక యాక్షన్ సినిమా ప్రియుడికి ఇంతకంటే ఏం కావాలి? అయితే విమర్శకులకు మాత్రం… ఇదంతా ఒక కుర్రాడిని కాపాడటం కోసమా అనిపిస్తుంది. అది తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌ట్రాక్షన్ సినిమా చూడాల్సిందే!

Tags: lockdown, Extraction, Netflix, Chris Hemsworth, Tyler, Pankaj Tripati



Next Story

Most Viewed