ఆనాడు పేదల ఆహారం.. ప్రజెంట్ ‘రిచ్ న్యూట్రిషన్ ఫుడ్’

by  |
ఆనాడు పేదల ఆహారం.. ప్రజెంట్ ‘రిచ్ న్యూట్రిషన్ ఫుడ్’
X

దిశ, ఫీచర్స్ : కోటి విద్యలు కూటి కొరకే అని ఊరకే అనలేదు. మంచి భోజనం తినడానికి వెండి స్పూన్ ఉండాల్సిన అవసరం లేదు. చేతినిండా డబ్బులుంటే చాలు. పోషకాహారం ఎప్పుడూ ‘ఆర్థిక స్థితి’తోనే ముడిపడి ఉంటుంది. నేటికీ పేదలు తినే తిండికి, ధనికులు భుజించే ఆహరానికి చాలా తేడా ఉంది. పేదలకు డబ్బుపెట్టి ఆహారం కొనుక్కునే స్థోమత లేక.. ప్రకృతిలో దొరికేవి తిని బతికేవారు ఇప్పటికీ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పొలం గట్టున దొరికే పీతలు, చేరువు గట్టున చేపలు, దుంపలే వారి ఆహారం. కానీ ఇక్కడ విచిత్రమేమంటే కాలక్రమేణా ఒకప్పుడు పేద ప్రజల ఆహారంగా భావించినవి.. నేడు ధనికులు రిచ్ ఫుడ్‌గా స్వీకరిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

ఎండ్రకాయలు (Lobster)

19వ శతాబ్దం మధ్యలో ఎండ్రకాయలను తెగుళ్ళుగా పరిగణించేవాళ్లు. చేపలతో పోల్చితే చాలామంది ఉన్నత కుటీంబీకులు వాటిని తినడానికి ఇష్టపడలేదు. వాటిని తినడం పేదరికానికి సంకేతంగా భావించేవాళ్లు. వీటిని ఖైదీలకు ఆహారంలో వడ్డించడం గమనార్హం. కానీ కాలానుగుణంగా అందరూ ఎండ్రకాయలను తినడం మొదలు పెట్టారు. ఆ తర్వాతి కాలంలో మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల్లో ఒకటిగా ఇవి మారడం విశేషం. ప్రస్తుతం ఇది చాలా ఖరీదైన, రుచికరమైన ఫుడ్‌గా పేరొందింది. ఎండ్రకాయలు అద్భుతమైన పోషకాహారామని న్యూట్రిషనిస్ట్‌లు కూడా చెబుతున్నారు. 145 గ్రాముల ఎండ్రకాయలు(బాయిల్డ్/స్టీమ్డ్) తింటే 129 కెలోరీలు శరీరానికి అందుతాయి. అంతేకాదు ప్రోటీన్ 27.6 గ్రాములు, సోడియం 705 గ్రాములు, ఫ్యాట్ 1.3 గ్రాముల న్యూట్రిషన్స్ మనకు అందుతాయి.

క్వినోవా :

గల్లీలోని కిరాణ షాపు నుంచి టాప్ సూపర్ మార్కెట్లు, మెడికల్ హాల్స్ వరకు ‘క్వినోవా’ దొరుకుతుంది. ప్రస్తుత కాలంలో సంపన్నులు, సెలబ్రిటీల డైట్‌లో భాగమైన న్యూట్రిషియన్ ఫుడ్ ఇది. కానీ 20 సంవత్సరాల క్రితం ‘క్వినోవా’ పేద పెరువియన్లకు చౌకైన ధాన్యంగా ఉంది. ఈ కారణంగానే ధనవంతులు దీనిని తినడానికి ఇష్టపడలేదు. వైద్యులు, న్యూట్రిషనిస్ట్‌లు దీనిలోని అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను సూచించిన తర్వాతే దాని విలువ పెరగడంతో పాటు మార్కెట్ కూడా పెరిగింది. ప్రస్తుతం ఫ్యాన్సీ సలాడ్లు, డెలిషీయస్ భోజనాల తయారీలో తప్పకుండా ఉండాల్సిన ఆహార పదార్థంగా మారిపోయింది.

ఎల్లిగడ్డ (గార్లిక్)..

ప్రస్తుత కరోనా సమయంలో ‘ఎల్లిగడ్డ’ ఉపయోగించనివారు లేరు. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడే ఈ చిట్టిపొట్టి ఎల్లిపాయను భారతీయులు ఎప్పటినుంచో వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే మనతో పాటు దాని ఔషధ గుణాల ప్రాధాన్యం తెలిసిన ప్రాచీన ఈజిప్షియన్లు కూడా మొదటి నుంచి వీటిని వినియోగించారు. అయితే ఈజిప్షియన్లు ఎల్లిగడ్డలను తమ బానిసలకు తినిపించి వారిని బలంగా తయారు చేస్తూ.. ఎక్కువ పని చేయడానికి ఉపయోగించుకున్నారు. ఇటలీ, జర్మనీ, పోలాండ్ నుంచి వలస వచ్చినవారు దాని రుచికి ఫిదా అయిపోగా.. వెల్లుల్లిని వాడటం ప్రారంభించారు. దాంతో ఎల్లిగడ్డ ప్రాచుర్యంలోకి రావడంతోపాటు దాని ద్రవ్య విలువ కూడా పెరగడం విశేషం.

ఓస్టర్స్..

గుల్లలు ఒకప్పుడు ప్రతిచోటా సమృద్ధిగా ఉండేవి. సముద్ర తీరాల్లో చాలా తేలికగా లభించేవి. తినడానికి ఆహారం లేని పేద ప్రజలు, కార్మికవర్గం కేవలం సముద్రంలోకి వెళ్లి బకెట్‌ఫుల్ ఓస్టర్స్(గుల్లలు) తెచ్చుకుని, వాటిని తమ ఆహారంలో భాగం చేసుకునేవాళ్లు. పారిశ్రామికీకరణ తరువాత, కర్మాగారాలు, పరిశ్రమలు పెరిగి విపరీతమైన కాలుష్యానికి కారణమయ్యాయి. దాంతో వీటి సంఖ్య తగ్గిపోయింది. తగ్గిన సరఫరా కారణంగా దాని ధర పెరిగింది. ప్రొటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి1, బి3, బి12, ఐరన్ వీటిల్లో సమృద్ధిగా ఉంటాయి.

సుశి :

‘సుశి’ ఒకప్పుడు పేద జపనీస్ మత్స్యకారులకు ఆహారంగా ఉండేది. వరల్డ్ వార్-2(WW-II) తరువాత, చెఫ్‌లు సుషీ వంటకాల్లో ఎక్సోటిక్ చేపలను ఉపయోగించడం ప్రారంభించించారు. దాంతో దాని ధర పెరిగి రిచ్‌ఫుడ్‌గా మారిపోయింది. జపనీయులే కాదు అక్కడికి వెళ్లిన అన్యదేశ ప్రజలు కూడా ‘సుశి’ టేస్ట్ తప్పకుండా చేస్తుంటారు.

కేవియర్ ఫిష్ :

ఈ రోజు ప్రపంచంలో అత్యంత లగ్జరీయస్ ఫుడ్‌లలో కేవియర్ ఒకటి. కానీ వంద సంవత్సరాల క్రితం ఇతర పదార్థాలతో, వీటిని ఉచితంగా వడ్డించేవాళ్లు. కాలానుగుణంగా ధనికులు దానిపై ఎక్కువ ఆసక్తి చూపడం ప్రారంభించడంతో.. దాని ధర పెరిగింది. ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్‌కు ఇందులో తగినంగా లభిస్తుంది. శరీరానికి అవసరమైన రోజువారీ ఐరన్ 10% ఉండగా.. సెలీనియం, మెగ్నీషియంను ఇది కలిగి ఉంటుంది.

నత్తలు, సాల్మన్ ఫిష్, బ్రిస్క్ కూడా ఒకప్పుడు పేదలు ఆహారంగా తీసుకున్న పదార్థాలే. అవే నేడు న్యూట్రిషన్ ఫుడ్‌గా సంపన్నులు తినే ఆహారంగా మారిపోయాయి. ఇక కొవిడ్ కాలంలో అత్యధిక మంది తింటున్న పీనట్-బటర్ కూడా ఆ జాబితాలోనిదే.


Next Story