కిక్కెక్కిస్తున్న బెల్టుషాపులు.. మత్తులో జనాలను వణికిస్తున్న మందుబాబులు

by  |
కిక్కెక్కిస్తున్న బెల్టుషాపులు.. మత్తులో జనాలను వణికిస్తున్న మందుబాబులు
X

దిశ, మేళ్లచెరువు : ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో మందుబాబులు నిత్యం మత్తులో రెచ్చిపోతున్నారు. పలు చోట్ల అల్లర్లుకు తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం మిన్నకుండి పోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధల ప్రకారం మండల కేంద్రంలో 3 మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మద్యం షాపులలో నిబంధనల ప్రకారమే మద్యం అమ్మకాలు కొనసాగించాలి. కానీ, అందుకు విరుద్ధంగా పలుచోట్ల విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో మద్యం ప్రియులు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. మద్యం ప్రియుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని గ్రామాలలో రోడ్ల వెంట దాబాలు సమీపంలోని చిన్నపాటి పాన్‌ షాప్‌లు, కూల్‌ డ్రింక్‌ షాపుల పేరుతో చట్ట విరుద్ధంగా బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు.

సాయంత్రం వేళ మద్యం ప్రియులకు వారికి కావలసిన విధంగా రాచ మర్యాదలతో మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ అధిక రేట్లతో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం ఎక్సైజ్‌ శాఖ వారికి తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదనేది అర్ధం కాని ప్రశ్నగా మిగిలింది. దీనిని ఆసరాగా తీసుకున్న మద్యం ప్రియులు రోడ్ల వెంట ద్విచక్ర వాహనాలు, లారీలు నిలిపి ఉంచడం, అర్ధరాత్రి వరకు మద్యం సేవించడమే కాకుండా అల్లర్లకు పాల్పడుతున్నారు. దీంతో ఆ మార్గం గుండా రాకపోకలు సాగించాలంటే జనాలు జంకుతున్నారు.

మద్యం మత్తులో వారు ఎంతటి దారుణానికి ఒడిగడతారో అన్న భయంతో వణుకుతున్నారు. అత్యవసరం అయితే తప్పా వెళ్లేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ దాబాల్లో, బహిరంగ ప్రదేశాల్లో పుట్టిన రోజు, పెండ్లిరోజు, ఇతర శుభకార్యాల పేర్లతో స్నేహితులతో కలిసి రోడ్ల పైనే మద్యం తాగుతున్నారని పలువురు వాపోతున్నారు. మద్యంతో పాటు యువత ఇతర చెడు అలవాట్లకు బానిసగా మారుతున్నా అధికారులు మాత్రం అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజుల కిందట తెల్లవారు జాము 3 గంటల సమయంలో ఒక బెల్ట్‌ షాపులో జరిగిన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారి ఇరువర్గాలు పోలీస్‌‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. ఇంత జరుగుతున్నా అధికారులు బహిరంగ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్యం, బెల్ట్‌ షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ పీపీ శ్యాంసుందర్‌ను బెల్టు షాపుల విషయమై వివరణ కోరగా.. అ సాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటామని, ఇలాంటి విషయాల్లో రాజీ పడేది లేదన్నారు. తక్షణమే బహిరంగ మద్యం సేవించి అల్లర్లు సృష్టించేవారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story

Most Viewed