త్వరలో అంతా సెట్ అవుతుంది… హుజురాబాద్ పై అధిష్టానం ధీమా

by  |
త్వరలో అంతా సెట్ అవుతుంది…  హుజురాబాద్ పై అధిష్టానం ధీమా
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన ఈటల పార్టీకి దూరమైతే ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి అన్న అంచనాలపై అధిష్టానం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈటల వ్యవహారంపై మొదటి నుండి ఆచూ తూచి అడుగేసిన టీఆర్ఎస్ అధినేత ముందుగా హుజురాబాద్ పరిస్థితులు ఏంటి అన్న విషయం తెలుసుకున్నట్టుగా సమాచారం. కొంతకాలం తరువాత హుజురాబాద్ పరిస్థితులు అన్ని కూడా పార్టీకే అనుకూలంగా మారుతాయన్న ధీమాతోనే అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యంత బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గాల్లో హుజురాబాద్ కూడా ఒకటని భావిస్తున్న అధిష్టానం ఈటల వెల్లిపోతే ఆయన బలమెంతా, పార్టీ బలమెంతా అన్న విషయాలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. పలురకాలుగా సమాచారం సేకరించిన అధిష్టానం రానున్న కాలంలో హుజురాబాద్ లో గులాబి జెండా రెపరెపలాడుతుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

వ్యతిరేకులకు అవకాశం…

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఈటల రాజేందర్ కు క్షేత్ర స్థాయిలో వ్యతిరేకులు కూడా ఉన్నారు. పార్టీకి చెందిన వారు కూడా ఆయనకు వ్యతిరేకంగా కొంతకాలంగా పావులు కదుపుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఈటలపై వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం వారితో అంటీముట్టనట్టుగా వ్యవహరించింది. ఈటలకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ తిరిగినా వారి గురించి పట్టించుకోని వైఖరితోనే వ్యవహరించింది. ఈటలకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది నాయకులు అధిష్టానం పెద్దలతో సన్నిహిత సంబందాలు కూడా ఉండేవి. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసిన అధిష్టానం కొన్ని సంవత్సరాలుగా హుజురాబాద్ పై సునిశిత దృష్టి సారించిందని స్పష్టం అయింది.

హుజురాబాద్ కు ’కెప్టెన్‘ ఫ్యామిలీ…

హుజురాబాద్ నియోజకవర్గంపై అధిష్టానం కెప్టెన్ ఫ్యామిలీని రంగంలోకి దింపాలన్న యోచనలో కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వారి సొంత నియోజకవర్గం కూడా హుజురాబాదే కావడంతో ఆ కుటుంబానికి ప్రాధాన్యత కల్పిస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. 2004లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇక్కడి నుండే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆ తరువాత డీలిమిటేషన్ కారణంగా సమీకరణాలు మార్చి కెప్టెన్ తనయుడు సతీష్ బాబుకు హుస్నాబాద్ లో అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు ఈటల పార్టీకి దూరం అవడం ఖాయం కావడంతో రానున్న కాలంలో హుజురాబాద్ నుండి సతీష్ బాబుకు అవకాశం కల్పించడమో లేక మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు వొడితెల రాజేశ్వర్ రావు మనవడు ప్రణయ్ బాబు పేరు ను తెరపైకి తీసుకవస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హుస్నాబాద్ నండి సతీష్ బాబును హుజురాబాద్ కు పంపించి, హుస్నాబాద్ నుండి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందోనన్న చర్చ సాగుతోంది. ముల్కనూరు బ్యాంకు ఛైర్మన్ కూడా అయిన అల్గిరెడ్డికి హుస్నాబాద్ నుండి అవకాశం కల్పిస్తే ఈ సీటు గెలవడం ఖాయమని అనుకుంటున్నారు. ఇదే సమయంలో సిద్దిపేట నుండి హరీష్ రావును హుస్నాబాద్ కు పంపించి, ఎమ్మెల్సీ కవితను సిద్దిపేట నుండి పోటీ చేయించాలన్న ఆలోచనలో కూడ పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా చర్చ సాగుతోంది.

Next Story