ప్రజల సంక్షేమం కోసం అందరూ సమనత్వంతో పని చేయాలి : బాల్క సుమన్

by  |
ప్రజల సంక్షేమం కోసం అందరూ సమనత్వంతో పని చేయాలి : బాల్క సుమన్
X

దిశ, మంచిర్యాల: ప్రజల సంక్షేమం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. జిల్లాలోని సీసీసీ నస్పూర్ లో గల సింగరేణి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళి కేరి, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, కాళేశ్వరం ఈఎన్సీ ఎన్. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల పై జిల్లా అధికార యంత్రాంగం పని తీరు అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌళిక సదుపాయాలను జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సైతం అందించడం, సమస్య ఉత్పన్నమైనప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సత్వరం పరిష్కరించడంతో పాటు ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేయాలని తెలిపారు. జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వ్యవస్థ, పంటలను వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్ సంబంధిత శాఖల అధికారులతో 3 బృందాలు ఏర్పాటు చేసి జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక తయారు చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో భవిష్యత్తులో ఎలాంటి నష్టం వాటిల్లకుండా శాశ్వత పరిష్కారాలను రూపొందించి అందించాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ శాఖ పరిధిలో సమీక్షిస్తూ సుమారు 6 వేల ఎకరాలలో సాగు చేసిన వివిధ రకాల పంటలు నష్టం జరిగిందని, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాల శాఖ పరిధిలో దెబ్బతిన్న రహదారులు, అంతర్గత రహదారులపై నివేదిక తయారు చేసి మరమ్మత్తు పనులు చేపట్టాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకురావాలని, వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు, విషజ్వరాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, గ్రామ స్థాయిలో ఆశ, అంగన్ వాడీ కార్యకర్తలతో జిల్లాలో ఇప్పటి వరకు 134 వైద్య శిబిరాలు, జ్వర సర్వే చేయడం జరిగిందని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున గర్భిణులను వారికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా పంచాయతీ శాఖ ద్వారా అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యంతో పాటు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా వారానికి రెండు సార్లు దోమల మందు పిచికారీ చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో మొబలైజేషన్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.

ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర సేవలు అందించడంలో భాగంగా అధికారులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని, జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య వ్యవస్థను మరింత మెరుగు పర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాణహితతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాలో వచ్చే వరద నీటికి అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించడం జరిగిందని, 40 లక్షల ఎకరాలకు పై చిలుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు తెలంగాణకే వరప్రదాయని అని, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధి 1500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు డి, పి.ఆర్, నివేదికల ఆధారంగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీని వల్ల రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి డిస్కవరీ ఛానల్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై డాక్యుమెంట్ పై ప్రసారం చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి దూర దృష్టికి అనుగుణంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి. ఉదయ్ కుమార్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed