సూయజ్ స్ట్రగుల్స్.. ఎట్టకేలకు నీటిపై తేలిన ‘ఎవర్ గివెన్’

by  |
సూయజ్ స్ట్రగుల్స్.. ఎట్టకేలకు నీటిపై తేలిన ‘ఎవర్ గివెన్’
X

న్యూఢిల్లీ: వారం రోజులుగా సూయజ్ కెనాల్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. భారీ నౌక ‘ఎవర్ గివెన్’ ఈ కాలువకు అడ్డంగా ఒక చోట నిలిచిపోవడంతో ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేసింది. 12శాతం గ్లోబల్ ట్రేడ్ ఈ రూట్‌ గుండానే సాగుతుంది. సోమవారం ఉదయం నౌకా సేవలందించే ఇంచ్‌కేప్ ప్రకటించిన వార్తతో ప్రపంచ వాణిజ్య సంస్థలు ఊపిరిపీల్చుకున్నాయి.

సూయన్ కెనాల్‌కు ఒక వైపున ఒడ్డులో కూరుకుపోయిన ఎవర్ గివెన్ నౌక భాగాన్ని రెస్క్యూ టీమ్ విజయవంతంగా పూర్తి చేసిందని ఇంచ్‌కేప్ ప్రకటించింది. ప్రస్తుతం ఎవర్ గివెన్ తిరిగి నీటిపై తేలియాడుతున్నదని వెల్లడించింది. అయితే, ఈ కెనాల్‌లో ఇతర షిప్పుల ప్రయాణానికి ఎప్పుడు దారి తెరుచుకుంటుందా? అనేదానిపై స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఇప్పటికే ఈ దారి గుండా వెళ్లడానికి సుమారు 450 నౌకలు క్యూ కట్టి ఉన్నాయి. కాగా, కొన్ని షిప్పులు అధిక వ్యయాన్నీ భరించడానికి సిద్ధపడి ఆఫ్రికా చుట్టూ ప్రయాణాన్ని ప్రారంభించాయి.

ఎవర్ గివెన్ నౌకను తొలగించే పని మంగళవారంనాటికి పురోగతి సాధించకుంటే షిప్‌ను అన్‌లోడ్ చేస్తామని ఈజిప్ట్ ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టింది. కానీ, ఆ డెడ్‌లైన్ లోపే రెస్క్యూ టీం ఎవర్ గివెన్ షిప్‌ను మళ్లీ నీటిపై తేలియాడేలా చేయగలిగింది. ఎవర్ గివెన్ నౌకను మళ్లీ నీటిపై తేలియాడటానికి దాని మొదలులో సుమారు 27వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వితీసేశారు. కనీసం 18 మీటర్ల లోతుకు తవ్వారు.



Next Story

Most Viewed