కృష్ణమ్మ తీరాన కొలువైన ఏలేశ్వరుడు

by  |
కృష్ణమ్మ తీరాన కొలువైన ఏలేశ్వరుడు
X

దిశ, నాగార్జునసాగర్ : సజీవ సాక్ష్యంగా నీటి మధ్యలో మిగిలిన ఏలేశ్వరం గుట్టపైన కాత్యాయనీ సహిత మల్లికార్జునస్వామి ఆలయాలు.. సాగరం మధ్యలో కాకతీయుల నాటి చారిత్రక ఆలయం శాతవాహనులు, ఇక్ష్వాకుల ఆనవాళ్లకు నిలువెత్తు రూపం. ప్రాజెక్టులో మునిగిపోవడంతో పురావస్తుశాఖ తవ్వకాల్లో భాగంగా
మ్యూజియాల్లో భద్రంగా చారిత్రక శాసనాలు, విగ్రహాలు నాగార్జునసాగర్ ఘనమైన గత చరిత్రకు సజీవ సాక్ష్యం.

సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగానే..

ముంపు పరిధిలో ఉన్న నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ కృష్ణా నది మధ్యలో ఏలేశ్వరంలో పురావస్తు శాఖ 1962లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టింది. అప్పటికే అక్కడ ఎన్నో చారిత్రకమైన ఆనవాళ్లు లభించడంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి తవ్వకాలు చేపట్టారు. చారిత్రక పూర్వ యుగం నుంచి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు అనేక కాలాలు, రాజుల పాలనకు అద్దంపట్టే ఆనవాళ్లు ఇక్కడ లభించాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దం శాతవాహనుల కాలంలో వాడిన అనేక రకాల పూసలు, గాజులు, టెర్రాకోటా రకానికి చెందిన స్త్రీ, పురుష ప్రతిమలు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇక్కడ లభించిన పూసల్లో చెర్ట్, ఎగేట్, లాసిట్ లాజిలీ, కార్నేలియన్ వంటి అనేక రకాలకు చెందినవి ఉన్నాయి.

ఆ కాలం నాటి వివిధ రకాల ఆటబొమ్మలు సైతం ఏలేశ్వరం తవ్వకాల్లో లభించగా.. అవన్నీ ఇప్పటికీ నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్లు సహా హైదరాబాద్, సాగర్ మ్యూజియాల్లోనూ భద్రంగా ఉన్నాయి. 3, 4 శతాబ్దాల కాలంలో పరిపాలన చేపట్టిన ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన సంగతి తెలిసిందే. ఈ విజయపురితోపాటు అంతకు ముందే శ్రీపర్వతంపై శాతవాహనుల కాలంలో నాగార్జునుడు స్థాపించిన బౌద్ధ విశ్వవిద్యాలయం సైతం ఏలేశ్వరానికి అతి సమీపంలోనే ఉండేది. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లతోపాటు.. వేలాది రకాల నాపరాతి దేవతా విగ్రహాలు ఇక్కడ లభించాయి. కాకతీయుల కాలంలో గణపతిదేవుడి వంటి ఎందరో మహారాజులు ఏలేశ్వర దేవాలయం గురించి వేయించిన శాసనాలు సైతం ఇక్కడి తవ్వకాల్లోనే వెలుగు చూశాయి. విష్ణు కుండీనులు, పశ్చిమ చాళుక్యులు, కందూరు చోళుల కాలానికి చెందిన శాసనాలు సైతం లభించాయి. పురావస్తు శాఖ రికార్డుల్లోనూ అవి భద్రపరచబడ్డాయి. నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా చారిత్రక ఆనవాళ్లు వెలుగు చూసిన ప్రాంతంగా ఏలేశ్వరం ఖ్యాతిగాంచింది.

త్రేతాయుగంలోనే దేవదేవేరులు వెలిసినట్లు ప్రతీతి..

ఘనమైన చారిత్రక ఆనవాళ్లకు మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ ఆధ్యాత్మిక నేపథ్యం సైతం ఇక్కడి ఏలేశ్వరం గుట్టపై ఉన్న ఆలయాల వెనుక దాగి ఉంది. 1962 ముంపునకు ముందు ప్రతి ఏటా తొలి ఏకాదశి, శివరాత్రి సందర్భంగా ఇక్కడ 21రోజులపాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగేవని ప్రతీతి. త్రేతాయుగంలో రావణబ్రహ్మ సోదరి అయిన ఏలె తపస్సు మేరకు ఈ గుట్టపై ఈశ్వరుడు ప్రత్యక్షమైనందునే.. ఏలేశ్వరం అనే పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. చరిత్రకు నిలువెత్తు సజీవ సాక్ష్యం అత్యంత అరుదైన కాత్యాయనీ సహిత మల్లికార్జున స్వామి ఆలయాలు కొలువై ఉన్న కొండ అది. చారిత్రక పూర్వయుగం నుంచి శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు వరకు ఘనమైన రాజ్యాల రాచరికపు ఆనవాళ్లకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన గుట్ట

నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో.. నాగార్జున కొండకు సమీపాన ఉన్న ఏకైక కొండ ఏలేశ్వరం. సాగర్ రిజర్వాయర్‌లోకి కృష్ణమ్మ పరవళ్లను ఆహ్వానిస్తున్నట్లు నదీ ముఖంగా.. అత్యద్భుత ప్రకృతి సౌందర్యాన్ని కలిగిన రెండు శిఖరాలు కలిగి ఏకైక గుట్టగా విరాజిల్లుతోంది. గుట్ట పైన స్థానం లేక వేల ఏళ్ల క్రితం ఈ కొండ పాదాల చెంతనే నూటొక్క గుళ్లు.. ముక్కోటి దేవతల విగ్రహాలు, చెక్కిన కోటొక్క శిలలు ఉండేవని స్థానిక స్థల పురాణం చెప్తోంది. సాగర్ జలాశయ నిర్మాణానికి ముందు 1962 వరకు నిత్య పూజలు అందుకున్న ఇక్కడి కొండ.. ప్రాజెక్టు నిర్మాణంతో ఒంటరయ్యింది. ముంపునకు ముందు చేపట్టిన తవ్వకాల్లో ఏలేశ్వరం వద్ద లభించిన వందలాది చారిత్రక శాసనాలు, వేలకొలది దేవతా విగ్రహాలు ఇప్పటికీ పలు జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ పురావస్తు శాఖ మ్యూజియాల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వేళ ఏళ్లనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

అత్యద్భుత ప్రకృతి ఒడిలో ఒదిగి ఉన్న ఏలేశ్వరం కొండ

నేటి రెండు తెలుగు రాష్ర్టాలను అన్నపూర్ణగా మార్చిన సాగర్ ప్రాజెక్టు నిర్మాణం 60ఏళ్ల క్రితమే ప్రారంభం కాగా.. ఈ బృహత్ జలాశయం విస్తీర్ణం అంతా ఇంతా కాదు. వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 4మండలాల మేర కృష్ణా నీటి పరవళ్లను నందికొండ వద్ద బంధించిన నిర్మాణమే.. నేడు మనం చూస్తున్న నాగార్జున సాగరం. ఈ జలాశయం మధ్యలోనే అలనాటి బౌద్ధ విశ్వవిద్యాలయ ఆనవాళ్లు పొందుపర్చుకున్న నాగార్జున కొండ ఉన్న విషయం తెలిసిందే. కానీ దానికి కొద్ది దూరంలోనే అంతకంటే ఎక్కువ చారిత్రక నేపథ్యం, విస్తృతమైన ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన ఏలేశ్వరం గుట్ట ఉందన్న సంగతి ఎవరికీ తెలియకపోవడమే విచారకరం.

కాత్యాయనీ సహిత మల్లికార్జునస్వామి వార్ల ఆలయాలతో కూడిన ఏలేశ్వరం మల్లన్న గుట్ట.. సాగర్ ఆనకట్టకు సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉంది. చందంపేట మండలం బుగ్గతండా, పొగిళ్ల గ్రామాలకు సమాన దూరంలో ఉంటుంది. జలాశయంలో తొలిసారి నీటిని నింపిన నాటి నుంచి ఈ గుట్టకు రాకపోకలు బంద్ అయ్యాయి. నాగార్జున కొండలో బుద్ధుడు, నాగార్జునుడి ఆనవాళ్లను పొందుపరిచి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చిన నాటి సమైక్య ప్రభుత్వాలు.. అంతకు మించిన చారిత్రక ప్రాముఖ్యతను.. వేల ఏళ్ల క్రితమే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఏలేశ్వరాన్ని విస్మరించాయి.

తమిళనాడులో రామేశ్వరం తరహాలో అరుదైన కాత్యాయనీదేవి సహిత మల్లికార్జునుడిగా ఇక్కడ ఈశ్వరుడు వెలిసినట్లు చెప్పుకుంటారు. ఇప్పటికీ గుట్టపైన దిగువన కాత్యాయనీదేవి ఆలయం, ఎగువన మల్లికార్జునుడి ఆలయాలు కాకతీయుల కాలంలో ఘనమైన పూజలు అందుకున్నట్లు ఏలేశ్వరంలో లభించిన అనేక శాసనాలు చెప్తున్నాయి. గణపతి దేవుడు సహా ఎందరో రాజులు ఇక్కడికి సమీపంలోని గ్రామాలకు గ్రామాలనే ఏలేశ్వర దేవుడికి పూజల నిమిత్తం ధారాదత్తం చేసినట్లు పలు శాసనాల్లో పేర్కొని ఉంది.

ఏటా రెండుసార్లు మాత్రమే లాంచీలు

ఏలేశ్వరం గుట్టపైన సరిపడా స్థలం లేనందున కింద 101 ఆలయాలు.. ముక్కోటి దేవతల విగ్రహాలు చెక్కిన కోటొక్క శిలలు ఉండేవని చెప్తుంటారు. పురావస్తు శాఖ తవ్వకాల్లో లభించిన వేలాది విగ్రహాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శ్రీశైలానికి సరైన రహదారి మార్గం లేక.. అక్కడికి వెళ్లలేని ఎక్కువ మంది భక్తులు ఏలేశ్వరంను సందర్శించేవారని.. అప్పట్లోనే దక్షిణ కాశీగా ఏలేశ్వరం ప్రసిద్ధి చెందిందని ముంపు గ్రామాల ప్రజలు నేటికీ చెప్పుకుంటుంటారు.

ఇప్పటికీ మూల విరాట్ విగ్రహాలు ఏలేశ్వరం గుట్టపై ఉన్న ఆలయాల్లోనే ఉండగా.. ముంపు తర్వాత నాగార్జున సాగర్ హిల్‌కాలనీలోని సత్యనారాయణస్వామి గుడి పక్కన ఏలేశ్వరం మాధవస్వామి, కాత్యాయనీ దేవి నిర్మించారు. 1962 తర్వాత ఇక్కడి ఆలయాల్లో అన్ని పూజలు ఆగిపోగా.. ముంపు నిర్వాసిత గ్రామాలకు చెందిన కొందరు ఆసక్తితో 2006 నుంచి మళ్లీ ఇక్కడ వార్షిక ఉత్సవాలు చేపడుతున్నారు. ప్రతి ఏటా ఏకాదశి, శివరాత్రి సందర్భంగా రెండు, మూడు రోజులపాటు ప్రత్యేకంగా లాంచీలు ఏర్పాటు చేయడంతో భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కార్తీక పౌర్ణమి, శ్రావణ మాసంలోనూ లాంచీలు నడిపేందుకు అనుమతి లభించినా.. ప్రస్తుతం అవి చేపట్టడం లేదు. మిగిలిన సమయాల్లో మాత్రం ఇక్కడికి వెళ్లాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకుని.. ప్రైవేటు పడవల్లో వెళ్లాల్సిందే.

దక్షణ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న ఏలేశ్వరం గ్రామం చరిత్ర ప్రసిద్ధి పొందింది. ఇక్కడ పర్వతం మీద కాత్యాయని సమేత ఏలేశ్వరస్వామి దేవాలయం నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో చరిత్రక ఏలేశ్వరస్వామి క్షేత్రం, శివరాత్రినాడు మాత్రమే ప్రత్యేక లాంచీలు, సంతనస్వామి చెంతకు చేరుకునే అరుదైన అవకాశం. ప్రకృతి అందాల నడుమ జూలు విప్పిపడుకున్న సింహం ఆకారంలో కొండగట్టు ఉంటుంది.

ఆలయ విశిష్ట

నాగార్జునసాగర్ జలాశయం మధ్యలోనికి కాత్యాయనీ ఏలేశ్వరస్వామిక్షేత్రం ఎంతో మహిమానిత్యం గలదని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజున ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 1962కు ముందు ప్రతి ఏడాది తొలి ఏకదశి, మహాశివరాత్రి సందర్భంగా 21రోజులపాటు వైభవంగా ఉత్సావాలు జరిగేవని ప్రతీతి. ఇప్పటికి గుట్టపై కాత్యాయని దేవి ఆలయం, ఎగువన మల్లిఖార్జున ఆలయాలు కాకతీయుల కాలంలో ఘనమైన పూజలు అందుకున్నట్లు ఏలేశ్వరంలో లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. గణపతి దేవుడితో సహా ఎందరో రాజులు ఇక్కడ సమీపంలోని గ్రామాలకు గ్రామాలనే ఏలేశ్వరస్వామికి పూజల నిమిత్తం భూములులను ధారధత్తం చేసినట్లు తెలుస్తుంది. ఇతిహాసయుగంలోనే ఏలేశ్వరస్వామి వెలసిననట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది. కుశాద్వాజుని కుమారై “ఏల” తపస్సు చేసి శివసాక్షత్సరం పొందడం వల్లనే ఈ క్షేత్రం ఏలేశ్వరంగా పేరు గాచిందని శ్రీశైలం స్ధల పురాణంలో ఉంది. ఏలేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో మాధవస్వామి, ఆంజనేయస్వామి, మలమ్మ, మాధవస్వామి ఆలయాలు ఉన్నాయి.

కోర్కెలు తీర్చెదైవంగా భక్తుల నమ్మకం, హరిహర మల్లన్న, సంతన మల్లన్న, సాక్షిమల్లన్నగా కొలుస్తారు. ఈ క్షేత్రంలో 101 గుడి, కోటొక్క, శిలా, వేయికవ్వములు ఆడినట్లు పెద్దలు చెబుతారు. సంతానంలేని వారు నదిలో స్నానం చేసి నోటిలో నువ్వులు పెట్టుకుని కొండపై ఉన్న బండపై ఉమ్మితే ఎన్నినువ్వులు పూస్తే అంతమంది పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం శ్రీ ఈశాన్య ద్వారంగా, దక్షిణకాశీగా పేరొందింది.
పలనాటి బ్రహ్మనాయుడు యుద్ధం చేసి తలదాచుకోవడానికి ఇక్కడికి వచ్చాడనీ, అప్పుడు మొసలి బారిన పడినప్పుడు తన ప్రాణాల్ని కాపాడమని ఈశ్వరుని వేడుకుంటాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై మొసలి బారి నుంచి కాపాడాడు. ఆ కృతజ్ఞతతో ‘’పలనాటిబ్రహ్మనాయుడు’’ భక్తితో కొండ పైకి ఆలయం వరకు మెట్లు కట్టించాడని చరిత్ర చెబుతోంది.

1962 వరకు ఇక్కడ ఉత్సవాలు జరిగేవని ఆలయ పూజారి చెప్పారు. కృష్ణానది పై నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఈ ప్రాంతం జలాశయంలో మునిగి ఇక్కడ ఆలయాలు శిధిలావస్థలో ఉన్నాయని, 47 ఏళ్లుగా దూప దీప నైవేద్యాలకు నోచుకోలేదని, 2006నుంచి 12 ఏళ్లుగా మహాశివరాత్రికి ఉత్సవాలు జరుతున్నారని ఆయన తెలిపారు.

ఆలయం పురాణం..

ఘనమైన గత కీర్తికి నిలువెత్తు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ… సముద్రాన్నితలపించే జలాశయం మధ్యలో నిట్ట నిలువుగా నిలబడ్డ ఏలేశ్వరం ఖ్యాతి గొప్పది. ఏలేశ్వరస్వామిక్షేత్రం శతాబ్దలపాటు ఒక వెలుగువెలిగింది. దీనికి క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు వేల ఏడ్ల చరిత్ర ఉంది. శాతవహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాల్లుక్యులు, పలనాటి కథలతో కూడా ఏలేశ్వరానికి సంబంధం ఉంది. ఎందరెందరో మహామహులు ఏలేశ్వరంలో వెలిసిన కాత్యాయనీ సహిత మల్లికార్జునుడిని దర్శించి, ఉపాసించి తరించారు. పలువురు పీఠాధీపతులు ఇక్కడ మఠాలు, ఆలయాలు స్ధాపించారు. పలువురు రాజులు అనేక మాన్యాలు సమర్పించుకున్నారు.
ఈ ఆలయానికి ఏటా 11 రోజులు తిరునాళ్ళు జరిగేది. ఏలేశ్వరంలో వేదవేదాంగాలు అభ్యసించిన పండితులు ఉండేవారు. ఆలయంతో పాటే ఇక్కడ ఒక మహోన్నత విద్యాపీఠం వెలుగొందింది. ఇక్కడ వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, షడ్దర్శనాలు, కావ్య నాటకలంకర వ్యాకరణ శాస్త్రాలు, వేదాంత, తత్వ, మీమాంస శాస్త్రాల భోధనలు జరిగాయి. ఆ ఫీఠం పరంపర వందల ఏండ్లు వర్దిల్లింది. తర్వాత కాలంలో ఆ ప్రభ కోల్పోయినా గత చరిత్రకు తార్కాణంగా ఆ నిర్మాణాలు ఉండేవి.

ఏలేశ్వరం శైవక్షేత్రంగా తీర్ధయత్ర స్ధలిగా కొనసాగింది. నాగార్జునసాగర్ నిర్మాణం చేపట్టడంతో వందలాది గ్రామాలతో పాటు ఈ గ్రామం జలాశయంలో ముంపునకు గురైంది. సాగర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాక చాలా కాలం తర్వాతే ఇక్కడున్న కొద్దిపాటి చారిత్రక శిధిలాలను హైదరాబాద్, నల్లగొండ నిలువెత్తు రూపంగా .. సాగర్ మధ్యలో సజీవ సాక్షంగా దర్శినమిస్తుంది.
అయితే దాచినంత మాత్రాన చరిత్ర దాగిపోదు. ఎందుకంటే ఒక వైభవం తాలుకు వెలుగు ఆ ప్రాంతానికే పరిమితం కావు. జానపదాల్లో కావచ్చు, శిలా శాసనల్లో కావచ్చు. కవులు, పండితుల రచనల్లో కావచ్చు ఎక్కడో ఒక చోట నమోదయ్యో ఉంటాయి. ఏలేశ్వరం చరిత్ర కుడా అక్కడక్కడా కొన్ని రాజ్యాల చరిత్రలో నమోదైంది. పురాణనామ చంద్రికలో ఏలేశ్వరం మహాపద్యాయిని ప్రశంస ఉన్నది. బ్రిటిష్ పాలనలో ఇండియాకు సర్వేయార్ జనరల్ గా పనిచేసిన కల్నల్ కోలిన్ మెకంజీ బృందంలోని ఒకే తెలుగు ఉద్యోగి ఈ విశేషాలను తెలుసుకున్నారు. ఈ చరిత్రకు సంబంధించిన రాత ప్రతులను పరిశీలించారు. మెకంజీ మరణానంతరం 1830లో తను రాసిన దక్షిణ దేశ కవి పండితుల సృతుల గ్రంధంలో ఏలేశ్వరం విద్యాపీఠము చరిత్రను విపులంగా పేర్కొన్నారు. అలాగే వేములవాడ చాళుక్యులు వేయించిన విజయ, దాన శాసనాల్లో ఏలేశ్వరం వైభవాన్ని ప్రస్తావించారు.

పురావస్తు శాఖ పరిశోధనలు

1961-62లో పురావస్తుశాఖ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ వహీద్ ఖాన్ ఆధ్వర్యంలో పురావస్తుశాఖ ఇక్కడ తవ్వకాలు జరిపింది. రోమన్ చక్రవర్తి సేప్తిమన్ సెర్వరస్‌కు చెందిన నాణేలతో పాటు అనేక విశేషాలు బయటపడ్డాయి. మహామండపలతో కూడిన పెద్ద స్నాన ఘట్టాలు, చైతాన్యాలు, స్ధూపాలు, నాలుగు రకాల శ్మశానాలు, టెర్రకోట బొమ్మలు, ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండినుల పాలనా మొదలైందని తెలిసింది. అంతకు ముందు ఇక్ష్వాకుల అనంతరం పల్లవులు పాలించారనే భావన ఉండేది. 1947లో మరోసారి పురావస్తు శాఖా ప్రస్తుత ఆలయ మండపానికి అభిముఖంగా.. జరిగిన తవకాల్లో చిన్న చిన్న ఆలయాలు నిర్మంచినట్లు అక్కడ పురాతన శాసనాల వల్ల తెలిసింది. కాగా సాగర నిర్మాణంలో వేలాది విగ్రహాలు దొరికినా కొన్నింటిని మాత్రమే హైదరాబాద్ గన్ ఫౌండ్రీలోని పురావస్తు మ్యూజియం, నల్లగొండ వద్ద పానగల్ మ్యూజియంలో ఈ గ్రామం నుంచి సేకరించిన కొన్ని శిల్పాలు, ఆవశేషాలు ఈ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి.

నాగార్జునసాగర్ నుండి ఏలేశ్వరం కొండకు లాంచీల ఏర్పాటు

నాగార్జునసాగర్ నుండి జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో నడిపే లాంచీలను మహాశివరాత్రిని పురస్కరించుకొని వచ్చే 11,12 వ తేదీన లాంచీలను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. ఇందుకుగాను నాగార్జునకొండకు వెళ్లే లాంచీలను రద్దు చేసి ఏలేశ్వరం కొండకు ఏర్పాటు చేస్తున్నామని పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.150 టికెట్ ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. శివరాత్రి రోజు ఉదయం 6గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు లాంచీల రాకపోకలకు ప్రతి రెండు గంటలకొకసారి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏలేశ్వరం మల్లయ్య గట్టు జాతర మార్చి 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు దేవాలయ పూర్వవైభవ వ్యవస్థాపక ఛైర్మన్‌ చంద్రవంక చిన్నరాములు తెలిపారు. మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed