ఈటల ఔట్.. ఆయనతో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలపై కేసీఆర్​ ఫోకస్

by  |
Etala Kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. సీఎం కేసీఆర్‌ సిఫారసు మేరకు ఈటలను బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. రాజ్​భవన్​ నుంచి గవర్నర్​ సెక్రెటరీ కె.సురేంద్ర మోహన్​ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈటలను మంత్రివర్గంలో ఉంచుతారా… బర్తరఫ్​ చేస్తారా అంటూ మూడు రోజుల నుంచి సాగుతున్న ఉత్కంఠకు ఆదివారం రాత్రి తెరపడింది.

నివేదిక అందగానే ఔట్​

మెదక్​ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల పరిధిలో అసైన్​మెంట్​ భూ కబ్జా చేశారంటూ ఈటలపై విచారణకు ఆదేశించిన విషయం తెలిసింది. దీనిపై శనివారం ఉదయం నుంచి సర్వే చేశారు. మొత్తం 20 బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఇక్కడ 66 ఎకరాల అసైన్డ్​ భూమిని కబ్జా చేసినట్లు విచారణలో తేల్చారు. ఈ నివేదికను ఆదివారం మధ్యాహ్నం మెదక్​ జిల్లా కలెక్టర్​ హరీష్​… సీఎస్​కు అందించారు. రెవెన్యూ, విజిలెన్స్​ రెండు విభాగాల నివేదికను సీఎస్​కు అందించగా… దీన్ని సీఎం కేసీఆర్​కు పంపించారు. దీంతో మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్​ చేసేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. ఈటలను బర్తరఫ్​ చేయాలంటూ సీఎం కేసీఆర్​ గవర్నర్​కు నివేదించారు. అసైన్డ్​ ల్యాండ్​ కబ్జా నివేదికలతో పాటు బర్తరఫ్​ చేయాలంటూ సిఫారసు చేశారు. ఆదివారం రాత్రి 8 గంటలకు ఫైల్​ను గవర్నర్​కు పంపించగా… రాత్రి 8.40 ​గంటల వరకు ఆమోదం తెలిపారు. అనంతరం రాజ్​భవన్​ నుంచి అధికారికంగా ధృవీకరిస్తూ విడుదల చేశారు.

కొత్త మంత్రి ఎవరో..?

రాష్ట్ర కేబినెట్​లో ఈటల పోస్టును ఎవరితో భర్తీ చేస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది. బీసీ వర్గానికి చెందిన వారినే మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లాబీయింగ్​ మొదలుపెట్టారు. మంత్రివర్గంలోకి తీసుకునే అంశం సీఎం కేసీఆర్​ నిర్ణయమే అయినా… కొందరు మాత్రం మంత్రి కేటీఆర్​ దగ్గర విన్నవించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్, మహబూబ్​నగర్​జిల్లాల నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ఇప్పటికే టాక్. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి కోసం గులాబీ పెద్దలకు విన్నవించుకుంటున్నట్లు సమాచారం. కొత్త మంత్రిని తీసుకుంటారా… తీసుకుంటే ఎవరికి అవకాశం ఇస్తారనేది నేడో, రేపో తేలనుంది.

ఎవరెవరు టచ్​లో ఉన్నారు..?

మరోవైపు ఈటల రాజేందర్​తో ఇప్పటి వరకు ఎవరెవరు టచ్​లో ఉన్నారనే పరిశీలన కూడా మొదలైంది. ఉమ్మడి కరీంనగర్​జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటుగా మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఈటలతో పలుమార్లు భేటీ అయినట్లు నిఘా వర్గాలు నివేదించినట్లు సమాచారం. కొంతకాలంగా పార్టీపై, ప్రభుత్వంపై వ్యతిరేక విమర్శలు చేస్తున్న ఈటలతో ఈ ఎమ్మెల్యేలు నిత్యం టచ్​లో ఉంటున్నారని, రాజకీయపరమైన పరిణామాలపై చర్చిస్తున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ సీఎంకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలను ఇప్పటికే ఈటల నుంచి వేరు చేసినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో రాజేందర్​ను వేరు చేయడంలో ఇప్పటికే గులాబీ బాస్​ ప్రయత్నాలు చేశారని, అందులో సక్సెస్​ కూడా అయ్యాడని చర్చ సాగుతోంది. మరోవైపు ఇప్పటి వరకు ఈటలతో టచ్​లో ఉన్న ఎమ్మెల్యేల్లో కొంత భయం కూడా పట్టుకుంది. ఇప్పుడు వారంతా ఈటలతో జత కట్టుతారా… లేక అనుకుంటున్నట్టుగానే ఒంటరి చేస్తారా అనేది కొద్దిరోజుల్లోనే తేలనుంది.



Next Story

Most Viewed