జూన్‌లో కీలక రంగాల ఉత్పత్తి 9 శాతం వృద్ధి!

by  |
Core-Sector
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక వృద్ధిని సూచించే ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి జూన్ నెలలో 8.9 శాతం పెరిగింది. తక్కువ బేస్ ప్రభావంతో సహజవాయువు, ఉక్కు, బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి మెరుగ్గా ఉన్న కారణంగా పెరుగుదల నమోదైందని శుక్రవారం అధికారిక డేటా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో కరోనా మహమ్మారి పరిణామాలతో బొగ్గు, ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు సహా అన్ని రంగాలు 12.4 శాతం క్షీణించాయి. ఈ ఏడాది మేలో ఎనిమిది కీలక రంగాలు 16.3 శాతం వృద్ధి నమోదు చేయగా, ఏప్రిల్‌లో 60.9 శాతంగా నమోదైంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. సమీక్షించిన నెలలో బొగ్గు 7.4 శాతం, సహజవాయువు 20.6 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 2.4 శాతం, ఉక్కు 25 శాతం, సిమెంట్ 4.3 శాత, విద్యుత్ ఉత్పత్తి 7.2 శాతం పెరిగాయి. సమీక్షించిన నెలలో ముడి చమురు ఉత్పత్తి 1.8 శాతం క్షీణించగా, గతేడాది ఇదే నెలలో 6 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. ఎరువుల ఉత్పత్తి 2 శాతం పెరిగింది. ఇక, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఎనిమిది రంగాల ఉత్పత్తి 25.3 శాతం వృద్ధి నమోదు చేయగా, గతేడాది ఇదే కాలంలో 23.8 శాతంగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడించాయి.


Next Story

Most Viewed