తెలంగాణ పునర్నిర్మాణం కల ఫలించేనా?

by Disha edit |
తెలంగాణ పునర్నిర్మాణం కల ఫలించేనా?
X

తెలంగాణ పునర్నిర్మాణం ఆరు దశాబ్దాల ప్రజల కల. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష.తెలంగాణ పునర్నిర్మాణం అంటే కోల్పోయిన వాటిని తిరిగి సాధించుకోవడం, కావలసిన వాటిని నిర్మించుకోవడం కానీ దశాబ్ద కాలం తర్వాత కూడా ఇది ఎజెండాగానే మిగిలింది. విద్యా, వైద్యం, వ్యవసాయం, సాంస్కృతిక వైభవం, స్వేచ్ఛ- సౌభ్రాతృత్వం, ప్రజాస్వామిక వాతావరణం స్వపరిపాలనలో సాధించుకోగలవనే నమ్మకంతో, త్యాగాలతో నడిచిన ఉద్యమం. సుదీర్ఘకాలం, వివిధ రూపాల్లో పోరాడిన చరిత్ర యావత్ తెలంగాణ ప్రజలది.

ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన పోరాడిన ఉద్యమకారుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి అమలు చేయగల రాజకీయ నాయకత్వం పునర్ నిర్మాణానికి ఎంతైనా అవసరం. త్యాగాల గాయాలతో తల్లడిల్లిన తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం పాలకుల ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. పదవుల కోసం, అధికారం కోసం, సంపాదన కోసం ఎగబడుతున్న నాయకులు పునర్మాణంపై శ్రద్ధ పెడతారు అనేది భ్రమగానే మిగిలిపోవచ్చు ఏమో. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో కొనసాగిన ఉద్యమమిది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం అనేక పాయలుగా సాగింది. ప్రధానంగా ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, బహుజన తెలంగాణ ఇలా పలు జెండాలతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమ జ్వాల అది.

తాగునీటికే కటకట

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం ఎలా ఉండాలి, ఎలా ఉంది అనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ భారతదేశంలో పెద్ద నదులు గోదావరి కృష్ణలు తెలంగాణలో ప్రవేశిస్తున్నా తాగు, సాగునీటి సమస్య, సమస్యగానే మిగిలి ఉంది. పాలకుల దృష్టి లోపం, సాచివేత ధోరణి ఇందుకు ప్రధాన కారణం. సకాలంలో సరైన ప్రాజెక్టుల నిర్మాణం, జల వనరుల సక్రమ వినియోగంపై శాస్త్రీయ అవగాహన లోపం కారణంగానే ఈ దుస్థితికి కారణం. భవిష్యత్తులో తెలంగాణలో నీటి సమస్య, కరెంటు సమస్య ప్రధానం కాబోతున్నాయి. సాగునీటి మాట అటు ఉంచితే, తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులు కనపడుతున్నాయి.

వణికిస్తున్న వర్షాభావం

రైతు సమస్యల మీద, విద్యారంగ సమస్యల మీద దృష్టి సారిస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. రైతు సమస్యలు అంటే విద్యుత్ సమస్య, గిట్టుబాటు ధర, కల్తీ పురుగు మందులు, విత్తనాలు. అన్నింటికంటే ప్రధానమైనవి, సాగునీటి సమస్య, కౌలు రైతుల సమస్య, పోడు భూముల సమస్య, అన్యాక్రాంతమైన భూముల సమస్య. వీటిపై ఎలాంటి కార్యాచరణ ఉంటుందో స్పష్టం చేయలేదు. ఈసారి వర్షాభావం అధికంగా ఉండడం, మేడిగడ్డ సాకుగా నీటి విడుదలను ఆపేయడం మరో కొత్త సమస్యకు తెరలేపాయి. సమస్యను చేశాయి. అసలే తాగునీటి సమస్య పైగా ఎండాకాలం అంతా ముందే ఉంది. విద్యుత్ పంపిణీ సంక్షోభం తప్పదు. వీటిని పరిష్కరించే కార్యాచరణ కానరావడం లేదు.

సంక్షేమంతోటే సంక్షోభం

సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా సంక్షోభంలో కూలిపోయింది. ఉద్యోగుల మెప్పు కోసం మొదటి తారీకు జీతాలు మాత్రమే అమలవుతున్నాయి. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేం. విద్యారంగ అభివృద్ధి కోసం 500 కోట్లతో ప్రతి మండలంలో ఒక భవనం ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పటికే భవనాల సంఖ్య ఇబ్బంది లేకున్నా, ఉపాధ్యాయుల కొరత, మౌలిక వనరుల కోసం తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు కొత్త భవనాల నిర్మాణం అవసరం ఏమున్నట్లు కొత్త ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణలు, కొత్త భవనాలు, కొత్త నిర్మాణాలు ఇప్పటికిప్పుడు ప్రధాన అంశాలు కావు.

మాటలే తప్ప చేతలు లేవు

తెలంగాణలో ఉద్యమకారుల ఊసేలేదు. ఉద్యమకారులతో చర్చలు లేవు. నిర్బంధం విషయానికొస్తే ఉపా కేసులు ఎత్తివేయలేదు. ఫార్మాసిటీ రద్దు చేయలేదు. మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపేయలేదు. ఉత్తర తెలంగాణలో విస్తరించి ఉన్న సింగరేణి భవిష్యత్తు పైన హామీ లేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్ కాగిత పరిశ్రమ, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు, సింగరేణిలో ఓపెన్ ఓపెన్ కాస్ట్ మైన్స్ రద్దు, ఎన్నికల వాగ్దానాలు గానే మిగిలాయి. హామీల అమలు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. అరుణోదయ సంస్థను నిషేధ సంస్థగా ప్రకటించారు. దీనిపై ఎలాంటి ప్రభుత్వ అభిప్రాయం లేదు. భువనగిరిలో ఇద్దరు హాస్టల్ విద్యార్థులను బాలికల అనుమానాస్పద మరణంపై నిరసన అడ్డుకున్నారు. పౌర హక్కుల సంఘం సభల ర్యాలీ అనుమతించలేదు. సాంస్కృతిక పునరుజ్జీవనంపై చర్చకు సమయమే ఇవ్వడం లేదు.

ఆకలినైనా సహిస్తాం కానీ...

తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు గానీ, స్వేచ్ఛపైన దాడి జరిగితే మాత్రం సహించరు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు తెలిసింది. ఒక రకంగా దీనిని ఆయన మాటలలో వచ్చిన గణనీయ మార్పుగా గుర్తించాలి. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కువ పెట్టి, తెలంగాణ ఉద్యమాన్ని అతి క్రూరంగా అణచివేసిన తెలుగుదేశం పార్టీలో ఇటీవలి కాలం వరకు కొనసాగిన మనిషి ఇలా మాట్లాడడం కొంత ఆశ్చర్యం కలిగించక మానదు. అయినా కాంగ్రెస్ పార్టీలో చేరడం ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. అధికారం దక్కించుకోవడానికి, దీర్ఘకాలం పదవిలో ఉండాలంటే పౌర సమాజం ముందు ఇలాంటి పదాలు వాడడం రాజకీయ పార్టీలకు, నేతలకు అవసరమే. దేనికైనా ఆచరణే గీటు రాయి అని అర్థం చేసుకోవాలి.

వాగ్దానాల వలలో చిక్కొద్దు

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు కోసం పౌర ప్రజాస్వామికవాదులు గళం ఎత్తాల్సిన సమయం ఇది. ఇప్పటికే ఇచ్చిన హామీల అమలు కోసం, ప్రజాస్వామిక వాతావరణ ఏర్పాటు కోసం, రాజకీయ పార్టీలను నిలదీయాల్సిన సమయమిది. మౌలిక సమస్యలపై చర్చించకుండా, పరిష్కారం కోసం కృషి చేయకుండా పాలకుల వాగ్దానాల వలలో చిక్కితే పులి -బంగారు కంకణం కథ పునరావృతం అవుతుంది పౌర ప్రజాస్వామిక వాదులారా! బుద్ధిజీవులారా! ప్రజలారా పారాహుషార్ ! తస్మాత్ జాగ్రత్త!

రమణాచారి

99898 63039



Next Story