వందేళ్లుగా వారిని ప్రభుత్వం నేరస్థులుగానే పరిగణించిందా?ఇంతకీ ఎవరు వారు

by Disha edit |
వందేళ్లుగా వారిని ప్రభుత్వం నేరస్థులుగానే పరిగణించిందా?ఇంతకీ ఎవరు వారు
X

ఈ కులాల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని జస్టిస్ వెంకటాచలయ్య 2002లో సూచించడంతో కేంద్రం 2006లో బాలకృష్ణ రేణుకే కమిషన్ వేసింది. ఈ కమిటీ 2008లో 72 ప్రతిపాదనలతో రిపోర్టు ఇచ్చినా దాన్ని పార్లమెంటులో చర్చకు సైతం రానివ్వకుండా చేశారు. తెలంగాణ రాష్ట్రం 21 కులాలను గుర్తించి సర్టిఫికెట్లు జారీ చేసింది. సంచార జాతులు ఆత్మగౌరవంతో బతకాలని ఉప్పల్ భగాయత్‌లో కులాలవారీగా స్థలాలు కేటాయించి భవనాలు కట్టిస్తున్నది. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసింది. వృత్తి కులాలకు సహకార సంఘాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడమే కాక ఉపాధి అవకాశాలు ఇస్తున్నది. ఈ జాతి నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సంచార జాతుల బతుకుల బాగుకు కృషి చేయాలి.

వేల ఏండ్ల బానిసత్వం పోవాలన్న కల. బహుజనుల బతుకులలో వెలుగులు నిండాలనే ఆశ. దళితులు, గిరిజనులు, మైనారిటీలు కూడా దేశాన్ని ఏలవచ్చనే ఆకాంక్ష నెరవేరుతున్న సందర్భమిది. ఓ ఆదివాసీ మహిళ తొలిసారిగా దేశ అత్యున్నత పీఠాన్ని అధిష్టించారు. బతుకు భారంగా మారి రేపు ఎలా గడుస్తుందో తెలియక, తమ హక్కులు ఏమిటో తెలియక కునారిల్లుతున్న బాధితులకు ఇది ఒక ఊరట. స్వాతంత్ర్యం తరువాత దేశంలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు అందుతున్నాయి. కానీ, వారికంటే దీనంగా బతుకుతున్న సంచారజాతుల గురించి రాజ్యాంగంలో రాయలేదు. వారి ఆచారాలు, సంస్కృతులు, కట్టుబొట్టు భిన్నంగా ఉంటాయి. అనాగరిక జీవితాలే అయినా వారు హిందూ ధర్మ ప్రచారక్‌లు.

భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ రాకముందు సైనిక శిక్షణకూ ఉపయోగపడ్డారు. కుల వృత్తితో పాటు ఆయుధాల తయారీలోనూ నేర్పరులుగా ఉన్నారు. రాజులకు విశ్వాసపాత్రులుగా నిలిచారు. గూఢచారులుగా శత్రువుల నుంచి కాపాడేవారు. ఆంగ్లేయులు దేశాన్ని ఆక్రమించుకున్న తరువాత జనాభా లెక్కల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సైనిక శిక్షణ ఇచ్చే కులాలు దాదాపు 500 వరకు ఉన్నాయని గ్రహించారు. వీరిని నాశనం చేయకుండా దేశాన్ని దీర్ఘకాలం పాలించలేమని గుర్తించి వారిని అణిచివేసేందుకు పూనుకున్నారు. క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ 1871 పేరుతో చట్టం తీసుకొచ్చి ఆ కులాల వారందరిని 'బార్న్ క్రిమినల్స్'గా ముద్రవేసి, ఎక్కడ కనపడితే అక్కడే వారిని జైలులో పెట్టారు. దీంతో వారంతా చెల్లాచెదురు అయిపోయి సంచార జీవితాలు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1897,1908,1911,1924లోనూ నూతన చట్టాలు తెచ్చి వారిని మరింతగా వేధించారు. భార్యపిల్లలు, బంధువులు, స్నేహితుల వివరాలను సేకరించి, వారు కూడా నేరస్తులే అని ముద్ర వేశారు. చివరకు పసి పిల్లలను కూడా వదిలిపెట్టలేదు.

అనేకానేక చట్టాలతో

ఈ పద్ధతిని సాహో మహారాజ్ తన రాజ్యంలో రద్దు చేశారు. ఆ తర్వాత ఐపీసీ 1860, పోలీస్ యాక్ట్ 1851, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్, రైల్వే యాక్ట్, ఎక్సయిజ్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇలా రకరకాల చట్టాలు తెచ్చి వీరిని దొంగలుగా చిత్రీకరించారు. దీంతో పారిపోయిన కొందరు తమ కులాల పేర్లు చెప్పుకోలేక ఇతర కులాల పేర్లు చెప్పుకోవడం, మతాలు మారడం చేశారు. మిగిలినవారు ఊరూరా తిరుగుతూ కళలు, పురాణాల కథలను చెప్పుకుంటూ కుటుంబాలను పోషించుకున్నారు.

ఊరి బయట గుడిసెలు వేసుకొని తమను 'పరదేశీలుగా' పరిచయం చేసుకున్నారు. గంగిరెద్దుల, జంగం, కాటిపాపల, మేదరి, పంబాల, పెద్దమ్మలవాళ్లు, ముత్యాలమ్మలవాళ్లు, మందుల, కూనపులి, పట్రా, రాజన్నల, గోత్రాల,వీరముష్టి, పూసల / దాసరి / కృష్ణ బలిజలతో కలిసి ఉండేవారు. నిజమైన దేశభక్తులుగా ఉన్న వీరిని 1885లో ఏర్పడిన కాంగ్రెస్‌గానీ, 1924లో ఏర్పడిన స్వరాజ్య పార్టీగానీ పట్టించుకోలేదు. చివరికి 1946 రాజ్యాంగ రచనలోనూ వీరికి స్థానం దక్కలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా వీరు మాత్రం ఇంకా బ్రిటిష్ చట్టాలతోనే బాధితులుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంచార జాతుల బతుకుల మీద అనేక అధ్యయనాలు, కమిషన్‌లు సానుకూల నివేదికలిచ్చినా కేంద్రంలోనున్న ఏ ప్రభుత్వమూ వీరికి న్యాయం చేయలేదు. రికార్డుల ప్రకారం వీరు 47,32,000 మందిగా ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలుపుకుంటే దాదాపు రెండు కోట్ల వరకు ఉంటారు.

ఆదివాసీ బిడ్డగా

1871 నుంచి 1924 వరకు ఉన్న చట్టాలను రద్దు చేయాలని అయ్యంగార్ కమిటీ సూచించింది. దానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. సంచార జాతుల అభ్యున్నతికి కేంద్రం, రాష్ట్రం చెరో 50 శాతం బడ్జెట్ 10 సంవత్సరాల వరకు కేటాయించాలని, రిజర్వేషన్లు కల్పించాలనీ నివేదించింది. కమిషన్ సిఫారసుల ప్రకారం 1952 ఆగస్టు 31 న కేంద్రం ఈ జాతులను డీ నోటిఫైడ్‌గా ప్రకటించింది. 1936లోనే నెహ్రూ నెల్లూరు బహిరంగ సభలో 'క్రిమినల్ ట్రైబ్స్' అనే పదం అన్నింటి నుంచి తొలగించాలని అన్నారు. పట్టాభి సీతారామయ్య, వెన్నెలకంటి రాఘవయ్య, ఎంవీ సుబ్బారావు వంటి మేధావులు చట్టాల రద్దుకు అవిశ్రాంతంగా పోరాడారు. సంచార, అర్ధ సంచార జాతులకు కలిపి డీ‌ఎన్‌టీ, ఎన్‌టీ, ఎస్‌ఎన్‌టీ సర్టిఫికేట్ ఇచ్చి విద్యలో అవకాశం కల్పించారు. ట్రైబల్ వెల్ఫేర్ నుంచి బడ్జెట్ ఇచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపణలు రావడంతో వెనక్కి తగ్గారు. 1953లో బీసీ కులాల అధ్యాయానికి కేంద్రం కాలేల్కర్ కమిషన్ వేసింది.

'క్రిమినల్ ట్రైబ్స్' అనే పదం నిషిద్ధం అని ఆ కమిషన్ సూచించింది. ఏపీ ప్రభుత్వం 1968లో అనంతరామన్ కమిషన్ ఏర్పాటు చేసి గతంలో వీరికిచ్చిన సర్టిఫికెట్లు రద్దు చేసి, వీరందరినీ బీసీలలో కలిపి వర్గీకరించింది. కానీ, వీరు అభివృద్ధి చెందిన కేటగిరీలలో ఉండటం వలన వాటి ఫలాలు అందుకోలేకపోయారు. ఈ కులాల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని జస్టిస్ వెంకటాచలయ్య 2002లో సూచించడంతో కేంద్రం 2006లో బాలకృష్ణ రేణుకే కమిషన్ వేసింది. ఈ కమిటీ 2008లో 72 ప్రతిపాదనలతో రిపోర్టు ఇచ్చినా దాన్ని పార్లమెంటులో చర్చకు సైతం రానివ్వకుండా చేశారు. తెలంగాణ రాష్ట్రం 21 కులాలను గుర్తించి సర్టిఫికెట్లు జారీ చేసింది. సంచార జాతులు ఆత్మగౌరవంతో బతకాలని ఉప్పల్ భగాయత్‌లో కులాలవారీగా స్థలాలు కేటాయించి భవనాలు కట్టిస్తున్నది. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసింది. వృత్తి కులాలకు సహకార సంఘాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడమే కాక ఉపాధి అవకాశాలు ఇస్తున్నది. ఈ జాతి నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సంచార జాతుల బతుకుల బాగుకు కృషి చేయాలి.

గుంటిపల్లి వెంకట్

సంచార జాతులు, ఎంబీసీ

జాతీయ కన్వీనర్

94949 41001



Next Story

Most Viewed