ముంజేతి కంకణానికి అద్దమేల?!

by Disha edit |
ముంజేతి కంకణానికి అద్దమేల?!
X

ప్రజాస్వామ్య పాలనలో భావప్రకటనా స్వేచ్ఛ ఎంతో ప్రధానం. అది పౌరులకు రాజ్యాంగ పర హక్కు. ప్రభుత్వ లోటుపాట్ల మీద పౌరులు సలహాలు, సూచనలు ఇవ్వడం సంప్రదాయకంగా వస్తున్నదే. పోలీసు శాఖను ప్రభుత్వ దర్శనీయ ప్రతినిధిగా పౌర సమాజం భావిస్తుంది. అందువలన ఆ శాఖ సైతం పౌర స్పందనకు, విమర్శలకు, ప్రతి విమర్శలకు అతీతమైనది కాదు. కాకపోతే, విమర్శల విధానాలు నేటి కాలంలో ఎంతో జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వాటిని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవడం అవసరం.

ఒక ప్రయాణికుడు రైల్వే విచారణ కేంద్రం వద్దకు వెళ్లి ఢిల్లీ వెళ్లే రైళ్ల సమయం గురించి వాకబు చేసినప్పుడు గుమస్తా వాటి వివరాలు తెలియజేస్తాడు. రైలు సమయాల పట్టికను రైల్వే శాఖవారు ప్రయాణికుల సౌకర్యార్థం అంతకు ముందుగానే ప్రకటించి ఉన్నారు. దానికి భిన్నంగా మార్పులున్నచో ఆ ప్రయాణికుడు కారణాలు అడగడం సహజం. ఒక వినియోగదారు కిరాణ దుకాణంలో ఒక కిలో వంటనూనె కొన్నాడనుకుందాం. ఆ నూనె తూకంలో గానీ, శుద్ధతలో గానీ తేడా ఉన్నచో ప్రశ్నించు హక్కు అతనికి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి బట్టల దుకాణంలో రెండు మీటర్ల అంగీ బట్ట కొన్నాడనుకుందాం. టైలర్ అది రెండు మీటర్లకు తక్కువగా ఉందని చెప్పినప్పుడు ఆ దుకాణం యజమాని అందుకు బాధ్యుడవుతాడు. ఈ ఉదాహరణలన్నింటికి సమయాలు, కొలతలు, కొలమానాలు నిర్దేశించబడినాయి. అమ్మిన, కొన్న వ్యక్తుల మధ్య వివాదం ఆ నిర్దేశిత కొలతలు, కొలమానాల ఆధారంగానే ఉండగలదు. అదే పద్ధతిని పోలీసు శాఖకు అన్వయించుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం.

విధానాల ఆధారంగా

పౌరుల ధన, మాన, ప్రాణాలకు భద్రత కల్పిస్తూ, శాంతి భద్రతలను అదుపులో ఉంచవలసిన బాధ్యత పోలీసు శాఖకుంటుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పన క్రిమినల్ ప్రోసీజరు కోడు, పోలీసు శాఖ ప్రచురించిన నిర్దేశిక గ్రంథం ద్వారా ప్రకటితమై ఉన్నది. బాధ్యతల పర్యవేక్షణకు ఉన్నతాధికారులుంటారు. నియమాల అనుసారం అలసత్వానికి తావీయక, ధైర్యంతో, సహచరులు, పౌరుల సహకారంతో పరిశోధనను కొనసాగించి, దోషులను బంధించి న్యాయస్థానం ముందుంచాలి. పరిశోధన విధానంలో తేడాలున్నచో పోలీసులను ప్రభుత్వాన్ని ప్రశ్నించి, విమర్శించు హక్కు పౌరులకు, రాజకీయ నాయకులకు ఉండటం సహజం.

అలాంటి పరిస్థితిలో పోలీసులు పరిశోధనలో అనుసరించిన విధానాల పై చర్చ కొనసాగాలే గానీ, ఫలితాలపై కాదు. నేడు పలు విమర్శకులు సాధించని ఫలితాలపైనే విమర్శలను గుప్పిస్తున్నారు. అది జుగుప్సాకరంగా ఉండడం ఎంతో విచారకరం. అందుకు కారణాలను పరీక్షించినప్పుడు ముందుకు రాగల విషయాలు రెండు. అందులో ఒకటి పోలీసు విధి విధానాలపై బురద జల్లి, అప్రతిష్ఠపాలు జేయడం. అధికారాన్ని చేజిక్కించుకొనుటకు చేయు తీవ్ర ప్రయత్నం. ప్రకటిత చట్టాలు ఆదేశిక సూత్రాలు, కార్యకారక కౌశలాలను విశ్లేషణ పరంగా పరిశీలించినపుడు క్లుప్తంగా ద్యోతక పరచగల విషయాలు ఇలా ఉంటాయి.

కార్యకారక కౌశలాలు

1. వృత్తిపర, నీతిపర ప్రమాణాలు పాటించడం, బాధ్యతల నిర్వహణలో నిష్కపటంగా, నిజాయితీగా వ్యవహరించడం. ప్రజాసేవలో సకారాత్మక దృక్పథాన్ని ప్రదర్శించడం, పనిలో ఉచ్ఛ స్థితికి చేరిన అనుభూతి, సమయపాలన, సూచిత వస్త్రధారణ, శారీరక దృఢత్వం, వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి. ఉత్తమ ప్రమాణాల సాధకుడుగా కనిపించడమే కాకుండా పౌరుల హక్కులు, అవసరాలు,భద్రతా పర బాధ్యతల నిర్వహణలో చట్టానికి లోబడి సేవలందించాలి. 2. సంవాదంలో గానీ, సంభాషనలోగానీ ఎదుటివారి అభిప్రాయాన్ని శ్రద్ధగా వినడం అలవరచుకోవాలి. తద్వారా పౌరులు, సహోద్యోగులు, తదితరుల మానసిక పరిస్థితులను, వారి భావావేశాలను ఆకళింపు చేసుకొనగలుగుతాడు.మౌఖికంగా గానీ, రాతపూర్వకంగా గానీ నెరపు సంప్రదింపుల క్రియ ద్వారా వారిలో ఆమోదయోగ్య ముద్రను వేయగలుగుతాడు. అట్టి కళను పోలీసు అధికారి సొంతం చేసుకొనగలగాలి.

3. బాధ్యతల నిర్వహణతో పాటుగా రాగల అవరోధాలు, ఆపత్కర పరిస్థితులను దూరదృష్టితో పసిగట్టాలి. పనుల నిర్వహణలో తనకు తానే సాటిగా ఎంచబడాలి. 4. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ఎవరు నేరస్థుడు? ఎవరు కాదు? అను విషయాలను తేల్చుకోవడం చిక్కు సమస్యే! నేరాలను నిరోధించుట, పరిశోధించుట, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసు శాఖకు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. కార్యసాఫల్యత అనునది పోలీసు అధికారి అనుభవం, కార్యశీలత, పట్టుదల, అంకితభావం, ప్రజా సంబంధాలు తదితర గుణశీలతలు, వ్యక్తిగత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. పోలీసు అధికారి ప్రతిభను అతడి చర్యల ద్వారా అంచనా వేయబడుతుంది. 5. నిరంతర అభివృద్ధి కాంక్షతో పనిచేయడం మొదలిడి, సృజనాత్మకంగా ఆలోచిస్తూ పోలీసు అధికారి ముందుకు సాగుతుంటాడు. సంప్రదింపుల ద్వారా తగు సలహాలను పంచుకుంటూ, వాటిని అమలు పరచుటలో తన సమర్థతను చాటాలి. అట్టి గుణశీలత ప్రతి పోలీసు అధికారిలో ఒక స్వాభావికాంశంగా ఉండాలి.

పనితీరు

రాచరికం అయినా, ప్రజాస్వామ్యం అయినా ప్రపంచ దేశాలన్నింటా పోలీసుల ప్రవర్తనా శైలి ఒక చర్చనీయంగానే కొనసాగుతూ వస్తున్నది. భారతదేశంలోనూ పరాయి పాలకులు పీడీత ప్రజానీకం అణిచివేతకు పోలీసు శాఖను వాడుకున్నారు. అప్పుడు, ఇప్పుడు క్షేత్ర స్థాయి పోలీసులు స్థానికులే. అయినా, నేటి పోలీసులు స్వతంత్ర రాజ్యాంగనుసారంగా ప్రజాస్వామ్యయుత వాతావరణంలోనికి రాలేకున్నారు. పోలీసుల కార్యకలాపాలన్నీ ప్రజల నడవడికలతో ముడిపడి ఉంటాయి కనుక పోలీసులు తీసుకునే చర్యలన్నింటిని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. వాటి ఆధారంగానే తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు.ఆ క్రమంలో వారు పోలీసులను శ్లాఘించడం లేదా విమర్శించడం జరుగుతుంది.

పోలీసులు ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించారను అభియోగాలు వస్తూనే ఉన్నాయి. ఇందుకు గల కారణాలేమిటి? దాని మూలలెక్కడున్నాయి? అనే విషయాలను నిష్ణాతులు చర్చిస్తూనే ఉన్నారు. .ప్రజలు మారితే పోలీసులు మారుతారనేది వారి వాదన అది సాధ్యామా? అనునది అధిక శాతం మంది మేధావుల అభిప్రాయం. పోలీసులనలా వదిలేస్తే తాము ఎన్నికలలో గెలిచేదెట్లా? అనేది పాలకుల వాదన. చివరకు అదోక విష వలయంగా తయారై కూర్చుందనునది నగ్నసత్యం. తత్కారణంగా పోలీసు శాఖ ప్రజల ముందు విశ్వసనీయతతో నిలబడలేకున్నది. ఇవి అన్నియూ ప్రభుత్వానికి తెలిసిన విషయాలేనని పౌరులందరికీ తెలిసిందే. అయిననూ తెలియనట్లుగా నటిస్తున్న ప్రభుత్వానికి పరిష్కార మార్గాలు సూచించాల్సిన అవసరం ఉందా? ముంజేతి కంకణానికి అద్దమేల?!

పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

విశ్రాంత పోలీసు అధికారి

94400 11170

Next Story

Most Viewed