రాజకీయాలేనా.. బాధ్యతగా వ్యవహరించరా?

by Disha edit |
రాజకీయాలేనా.. బాధ్యతగా వ్యవహరించరా?
X

ఆంధ్రప్ర‌దేశ్‌లో సామాజిక పెన్ష‌న్ల పంపిణీపై ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. వాలంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాలంటూ స‌ర్కుల‌ర్ ఇచ్చిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం, వారిని పెన్ష‌న్ల పంపిణీకి కూడా దూరంగా పెట్టాల‌ని ఆదేశించింది. ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాల‌కు కూడా వాలంటీర్ల చేత న‌గ‌దు పంపిణీ చేయించ‌వ‌ద్ద‌ని ఆదేశాలిచ్చింది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిషన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీశాయి. పెన్ష‌న్ల పంపిణీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల‌ని సీఈసీ సూచించింది.

ఓ వైపు లబ్ధిదారుల్లో పెన్షన్ టెన్షన్ నెలకొన్న వేళ.. మరోవైపు రాజకీయ రగడ రాజుకుంది. వాలంటీర్లు లేకపోవడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈసీ ఆంక్షలు విధించేందుకు ప్రతిపక్ష పార్టీలే కారణమని అధికార పక్షం ఆరోపిస్తుంది. అయితే ఈ విమర్శలకు ప్రతిపక్ష నాయకులు సైతం ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని రాజకీయం చేస్తోందని మండిపడుతున్నారు. పెన్షన్ల పంపిణీ అని ప్రకటించి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఈ కారణంగానే పెన్షన్ల ఆలస్యం..

పెన్షన్ల పంపిణీ ముసుగులో వ‌లంటీర్లు అధికార పక్షానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు అన్న మిషతో సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ సంస్థ ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్ళింది. ఈ విషయాన్ని పరిశీలించి క్షేత్ర స్థాయిలో నివేదికలు తెప్పించుకున్న ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేశారు. సీఈసీ ఆదేశాల వెనుక తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులే కార‌ణ‌మంటూ అధికార వైసీపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది తప్ప వాలంటీర్లు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించటం లేదని చెప్పలేకపోతోంది. అదే సమయంలో స్వయంకృత అపరాధాలు విజయ సోపానానికి అవరోధాలు కాకుండా కూటమిలోని పార్టీలు జాగ్రత్తపడాలి.

రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ ద్వారా సచివాలయాలకు పెన్షన్ల సొమ్ము జమ చేస్తుంది. వాటిని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బ్యాంకు నుంచి తీసుకుని వాలంటీర్లకు అందిస్తారు. వారు తమ పరిధిలోని పింఛనుదారులకు ఇంటింటికీ వెళ్లి పంచేవారు. కానీ, ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా పంపిణీని నిలిపివేశారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని మినహాయించి మిగిలిన వారికి సచివాలయం వద్దే పెన్షన్ల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధుల విడుదలపై జాప్యం, అలసత్వం ఈ గందరగోళానికి కారణం. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఈ విషయంపై ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయలేదనే చెప్పాలి. తటస్థంగా వ్యవహరించాల్సిన అధికారులు, వ్యవస్ద ప్రేక్షక పాత్రను వహించడమే ఈ మొత్తం సమస్యకు, గందరగోళానికి కారణం.

వృద్ధుల మరణాలకు కారకులెవ్వరు?

వ్యక్తులు కాదు వ్యవస్థ సక్రమంగా పని చేయాలి అన్న ప్రాథమిక పరిపాలన సూత్రాన్ని మరిచి వ్యవహరిస్తే వ్యవస్థ సక్రమంగా మనలేదు. పెన్షన్ల పంపిణీ నేరుగా లబ్దిదారులకు చేరేలా వ్యవస్థను రూపొందించాలి. ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది కాబట్టి పెన్షన్ల పంపిణీలో నగదు బట్వాడా జరుగుతుందని తెలిసినా ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో ముందస్తు సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుపకపోవడమే సమస్యకు నాంది పలికింది. దీనిపై ఎలా వ్యవహరించాలి అనే విధివిధానాల రూపకల్పన సకాలంలో స్పందించకపోవడం ముందస్తు అనుమతులను పొందటం విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా వైఫల్యం చెందిందనే చెప్పాలి. దీని పర్యవసానంగా కొంతమంది వృద్దులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.

ఇక్కడా రాజకీయమేనా?

పార్టీలకు రాజకీయ ప్రయోజనాలే తప్ప వృద్ధుల సమస్యను పట్టించుకోవడం లేదు. పెన్షన్ల విషయంలో కొద్ది రోజులుగా జరుగుతున్న, జరుగుతూ వచ్చిన పరిణామాలు నిజంగానే బాధాకరం. ప్రత్యామ్నాయ విధానాలు చూసి పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహారం సాగుతోంది. ఈసీ ఆదేశం కారణంగా వృద్ధులు సచివాలయాలకు పింఛన్ కోసం రావడంలో ఇబ్బంది పడితే వారికి అవతలి పార్టీపై కోపం పెరుగుతుందని ఒక పార్టీ, వృద్ధులు ఇబ్బంది పడితే వాళ్లు నిజంగానే తామే బాధ్యులం అనుకుంటారేమో అని ఇంకో పార్టీ ఆందోళన చెందుతున్నట్టుగా ఉంది. అన్ని వైపులా కేవలం రాజకీయమే ఉంది. ఎక్కడా వృద్ధుల పట్ల దయ కనిపించడం లేదు. మానవత్వంతో కూడిన బాధ్యతతో వ్యవహరించాల్సిన రాజకీయపార్టీలు ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా దీనిని వాడుకుంటున్నాయి. ప్రభుత్వం తీరు చూస్తుంటే సమస్య పరిష్కారం కన్నా ఎన్నికల ప్రయోజనాలను ఆశించడమే ముఖ్యంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story

Most Viewed