రాజధాని చిరునామా ఏది?

by Disha edit |
రాజధాని చిరునామా ఏది?
X

రాష్ట్ర రాజధాని కోసం అమరావతిలో నిర్మించిన అనేక భవనాలు వదిలేసి వెళ్తామని చెప్పడం చూస్తే హృదయం ద్రవిస్తోందని హైకోర్టు జడ్జి రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకువస్తున్నాయి. అమరావతిని తరలిస్తామని చెప్పడం ప్రభుత్వ మతిలేని చర్యగాక మరేమిటని ఆయన ఘాటైన వ్యాఖ్యలే చేశారు. దేశంలో ఆరు దశాబ్దాల తర్వాత ఒక అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఏర్పడే అవకాశాలను కాలరాస్తూ మూడు రాజధానులంటూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పిచ్చి తుగ్లక్ చర్యగా ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా సైతం అభివర్ణించారు. రాజధాని అమరావతిని నిలిపివేయడం జాతీయ విషాదమని ఆయన వ్యాఖ్యానించారు.

మొండిగా విశాఖకు..

కేవలం అమరావతిని నాశనం చేయాలన్న ఏకైక లక్ష్యంతో నిన్నటి వరకు మూడు రాజధానుల పేరుతో కాలం వెళ్లబుచ్చారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబాటు ముసుగులో రాజధానిని విశాఖకు తరలించేందుకు నడుం బిగించారు. ఎవరికి తోచినట్లు వారు రాజధానిని మార్చుకుంటూ పోతే రాష్ట్ర పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. సమీక్షలు, పర్యవేక్షణ చేయడానికి విశాఖలో ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి సీఎం క్యాంపు ఆఫీస్, అధికారులకు వసతుల పేరిట ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఉందా? ఉత్తరాంధ్రలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు అన్నింటికి కలిపి ఖర్చుపెట్టిన దానికంటే.. రుషికొండపై ముఖ్యమంత్రి కోసం నిర్మించిన విలాసమైన భవనానికే ఎక్కువ ఖర్చు చేశారు. రాత్రి బస చేయడానికి టూరిజం భవనాలను సీఎం క్యాంపు ఆఫీసుగా గుర్తించామని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మొదటి నుంచి రుషికొండపై నిర్మిస్తున్న భవనాలు సీఎం కోసమేనన్నది జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు పెడితే.. వారికి వసతి, ఆఫీసుల కొరకు ఇంకా అనేక భవనాలను గుర్తించారు. అందులో ప్రధానమైనవి ఐటీ ఇండస్ట్రీ కోసం నిర్మించిన మిలీనియం టవర్స్. అందుకే హడావుడిగా ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. ఓ వైపు విశాఖలో పరిశ్రమల కోసం పారిశ్రామిక సదస్సులు పెడుతూ.. మరోవైపు ఉన్న పరిశ్రమలను తన్ని తరిమేస్తున్నారు. మిలీనియం టవర్స్‌లో 18వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాటన్నింటినీ ఖాళీ చేయించారు. విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను, రోగులను, వైద్యులను కూడా ఖాళీ చేయించి అధికారుల వసతి కోసం కేటాయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, ఫైర్ ఆఫీసులో హోం డిపార్ట్‌మెంట్ పెడుతున్నారు. విశాఖలో ఉన్న కల్యాణ మండపాలు, ఇతర అతిథి గృహాలు అన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములన్ని జగన్ అండ్ కో కబ్జా చేయగా.. మిగిలిన ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇక కబ్జా చేయడానికి, అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి అక్కడ మిగిలిందేమీ లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్న అంశాలను ధిక్కరిస్తూ మూర్ఖంగా, మొండిగా విశాఖకు వెళ్తున్నామని చెప్పడం కోర్టు ధిక్కరణ కాదా?

అమరావతిని పాడుబెట్టి..

అభివృద్ధి, పాలనపై జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మూడు రాజధానులు అంటూ వివాదం సృష్టించారు. మూడు ప్రాంతాల అభివృద్ధి ముసుగులో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. రైతులు రాజధానికి భూములు ఇచ్చి ఎనిమిదేళ్లు దాటింది. కానీ ఇంతవరకు రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు. రైతులకు, భూమికి ఉన్న బంధం విడదీయరానిది. రైతులు తమ న్యాయమైన హక్కుల కోసం నినదిస్తే 144 సెక్షన్, పోలీస్ చట్టం 30 లాంటివి పెట్టి వారిని స్వేచ్ఛగా తిరగనీయకుండా నిర్బంధాలకు గురిచేశారు. వారి పాదయాత్రలకు సైతం అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. భూమిని నమ్ముకున్న రైతుల జీవనాధారం కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. వారి జీవించే హక్కును కాలరాశారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై నాలుగేళ్లు దాటింది. అప్పటి నుంచి మహిళలు, రైతులు ఉద్యమిస్తుంటే.. వారి మొర ఆలకించలేదు. అమరావతి రాజధానిని కడతామని నమ్మబలికి బ్యాంకుల నుంచి ప్రభుత్వం రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చింది. ఆ అప్పులకు వడ్డీలు కూడా కట్టలేదు. అభివృద్ధి చేయకపోగా రాజధాని ప్రాంతాన్ని పాడుబెట్టి అక్కడ ఉన్న సామాగ్రిని, ఇసుక, ఇనుము చివరకు రోడ్లను సైతం తవ్వి గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు. రాజధాని ప్రాంతంలో 10 ప్రధానమైన రహదారులను పర్యవేక్షిస్తున్న లీ అసోసియేట్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం తరిమేసింది.

ప్రపంచంలోనే ఆరు అద్భుత భవిష్యత్ నగరాల జాబితాలో అమరావతికి చోటుదక్కిందనే వార్త తెలుగువారిలో ఆనందాన్ని కలిగించక మానదు. రాబోయే 50 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో అనేదానికి అమరావతి అద్దం పడుతుందని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే పత్రిక ప్రచురించింది. న్యూయార్క్ కేంద్రంగా కొన్ని దశాబ్దాల నుంచి ఈ పత్రిక నడుస్తోంది. ముందుచూపుతో భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అప్పటి ప్రపంచాన్ని ఇప్పుడే గత ప్రభుత్వం ఆవిష్కరించింది. 6 మోస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ బీయింగ్ బిల్డ్ అరౌండ్ ది వరల్డ్ శీర్షికతో ఆ మ్యాగజైన్ నగరాల నమూనాలతో సహా వెల్లడించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచస్థాయి నగరంగా అవతరించబోతున్న ఆంధ్రుల కలల రాజధానిని ఉద్దేశపూర్వకంగా పాడుబెట్టారు. ప్రజల ఆశలు, ఆనందాన్ని ఆవిరి చేశారు.

రాజధానిపై తీర్పు వెలువడటానికి ఏడాది ముందే హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఉన్నత పదవులను అధిరోహించి ప్రజాస్వామ్యాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటారనే హైకోర్టు వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. విభజన చట్టానికి లోబడి అమరావతి రాజధాని ఏర్పడిందని, మూడు రాజధానుల అంశం అసలు కేంద్ర ప్రభుత్వ దృష్టిలో లేదని రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. నాడు పాలనను చూశాం, నేడు పీడన చూస్తున్నామనే ప్రజల వేదన అర్థం చేసుకోవాలి.

రాజధాని లేకుండా పాలనా?

అసలు రాజధాని ఎవరి కోసం? ప్రజల కోసమా, జగన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమా? విశాఖపై కపట ప్రేమ చూపిస్తున్నారు. రాజధాని ముసుగులో ధ్వంస రచన చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎవరూ రాజధాని కావాలని కోరుకోవడం లేదు. వికేంద్రీకరించాల్సింది అభివృద్ధిని కానీ పాలన కాదు. జగన్ రెడ్డి ఇసుకను, మద్యాన్ని కేంద్రీకృతం చేసి ఇష్టానుసారంగా దోచుకుంటూ వినియోగదారులను కష్టాల్లోకి నెట్టారు. విశాఖను ఆర్థిక రాజధాని చేయాలని గత ప్రభుత్వం కృషి చేసింది. ఇప్పుడు విలువైన భూములు దోచుకోవడానికి కుట్ర పన్నారు. ఇప్పటికే విశాఖలో రూ.40వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడేళ్ల నుంటి కార్మికులు పోరాడుతున్నారు. జగన్ రెడ్డి మాత్రం స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు అదానీకి ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు. రైల్వే జోన్ ను నిర్లక్ష్యం చేశారు, గిరిజన యూనివర్సిటీ ఊసే లేదు. విభజన హామీల్లో భాగంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు రావాల్సిన నిధుల విషయంలో ఎలాంటి ప్రయత్నం చేయకపోగా... ఇప్పడు రాజధాని అంటూ ఆ ప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారు.

న్యాయస్థానాల తీర్పులను గౌరవించకుండా రాజధాని విశాఖకు తరలించే ప్రయత్నాలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కేసు నమోదు చేయాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో జగన్ రెడ్డి చేస్తున్న వికృత చేష్టలు, కుట్రలు, కుతంత్రాలు దేశవ్యాప్తంగా బహిర్గతమయ్యాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభాలతో అధికారం చేజారిపోతుందనే అభద్రతా భావంతో ముఖ్యమంత్రి ఉన్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసుల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి విశాఖ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్ర రాజధాని ఎక్కడో తెలియకుండానే పాలన పూర్తైంది. చివరకు రాజధాని లేకుండానే పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. రాజధానిపై జగన్ రెడ్డి కపట నాటకాలు కప్పిపెట్టాలి. ఇప్పటికే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలి చేశారు. ఇంకా మీ మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

మన్నవ సుబ్బారావు

99497 77727

Next Story

Most Viewed