భాషాపండితుల వెతలు తీరేదెప్పుడో?

by Disha edit |
భాషాపండితుల వెతలు తీరేదెప్పుడో?
X

పాఠశాలలో భాషలను బోధిస్తున్న పండితుల ఆత్మగౌరవ పోరాటానికి ఎప్పుడు ముగింపు పలుకుతుందో అర్థం కాని పరిస్థితి? ఎన్నో దశాబ్దాలుగా శ్రమ దోపిడీకి గురవుతున్న భాషా పండితుల బాధలు వర్ణనాతీతం. స్కూల్ అసిస్టెంట్‌తో సమానమైన విద్యార్హతలు కలిగి ఉండి, వారితో సమానమైన పనిచేస్తూ, కేవలం సెకండరీ గ్రేడ్ హోదా, వేతనం పొందుతున్న దీన పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలోని భాషా పండితులది. ఇదేనా భాషా బోధకులకు ఇస్తున్నటువంటి మర్యాద ? ఇది చిత్రవిచిత్రంగా కానవస్తుంది.

ఎలాంటి పదోన్నతి పొందకుండా..

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. దానిని ఏమాత్రం పట్టించుకోకుండా భాషా పండితుల పట్ల మెతక వైఖరి ప్రదర్శించడం, చిన్న చూపు చూడడం నిజంగా ఆక్షేపణీయం. అధికారులకు ప్రభుత్వానికి భాషల పట్ల మమకారం ఉందనీ చెబుతూ, వాటిని బోధించే వారి బాధలు మాత్రం తీర్చడం లేదు. ఉద్యోగం పొందిన ప్రతివారు తప్పనిసరిగా రెండు ప్రమోషన్లు తీసుకుని రిటైర్మెంట్ కావాలి. కానీ ఇది భాషాపండితుల విషయంలో నిజం కావడం లేదు. 30 సంవత్సరాల సర్వీసు ఉన్న పండితుడు కూడా ఎలాంటి పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ చేస్తున్నాడు. ఇది భాషా పండితుల పట్ల ప్రదర్శిస్తున్న వివక్షతకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. భాష పండితుల దగ్గర చదువు నేర్చుకున్న విద్యార్థి తనకంటే పై స్థాయిలో ప్రమోషన్లు తీసుకుని విధులు నిర్వర్తిస్తుంటే, ఇది వారిని అవమానించినట్టు కాదా?

డిగ్రీ స్థాయిలో ఆప్షనల్ సబ్జెక్టుగా భాషలు, ఓరియంటల్ లాంగ్వేజెస్ చదివి పండిత శిక్షణ పొంది, పూర్తిస్థాయిలో భాషపైన పట్టు ఉన్నటువంటి పండితులను పక్కనపెట్టి, కేవలం ప్రమోషన్ల కోసం పీజీలో భాషలు చేసిన వారికి పదోన్నతులు ఇవ్వడం వారిని చిన్నచూపు చూడడమే. డిగ్రీ స్థాయి నుండి వ్యాకరణం, సాహిత్యం, గద్య పద్యాలలో నిష్ణాతులైనటువంటి పండితులు డీఎస్సీ ద్వారా పండితులుగా నియామకమై, చివరికి పండితులుగానే పదవీ విరమణ చేస్తున్నారు. భాషేతర సబ్జెక్టులలో డిగ్రీస్థాయిలోనే ఆప్షనల్ సబ్జెక్టు ఉంటే స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇస్తున్నారు. కానీ కేవలం భాషల విషయంలో మాత్రం పీజీని నిర్ణయించడం భాషలను వారిని బోధించేవారిని చులకనగా చూడడమే అవుతుంది.

అధికారుల చిత్తశుద్ధి లోపంతో..

ఒకప్పుడు కేవలం స్కూల్ అసిస్టెంట్ తెలుగు మాత్రమే ఉండేది. కానీ కొంతమంది సోదర సంఘాల ప్రాతినిధ్యం వలన పండితుల స్థాయి సెకండరీ గ్రేడ్ హోదాకు తగ్గింది. నాటి నుండి నేటి వరకు దశలవారీగా పండితులు పోరాటం చేస్తూనే ఉన్నా, ఈ సమస్యను ప్రభుత్వం తీర్చలేదు. దీంతో ఇది మరింత జటిలమయ్యింది. ఈ సమస్య కొన్ని సంవత్సరాలుగా పరిష్కరించకపోవడంతో పండితులు ఆత్మన్యూనతా భావానికి లోనై, ఇతర ఉపాధ్యాయులు చిన్న చూపు చూస్తున్నారు. అందుకే భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా గుర్తించడం అనేది న్యాయబద్ధమైనటువంటి కోరిక.

భాషా పండితుల స్థాయిని స్కూల్ అసిస్టెంట్ స్థాయికి పెంచుతామని 15 రోజుల్లో వారి సమస్యలు తీరుస్తామని ప్రపంచ మహాసభల ముందు కేసీఆర్ ప్రకటించినా, దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్నట్లు అధికారుల చిత్తశుద్ధి లోపించడంతో ఈ సమస్య అలానే మిగిలిపోయింది. గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ సమస్య ముందుకు తెచ్చినా, వారి స్థాయిని పెంచుతున్నట్లు ప్రకటనలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మొండిచేయి చూపటం పరిపాటి అయింది. ఈ సమస్యను ప్రధాన సంఘాలు కూడా ప్రధాన ఎజెండాగా రూపొందించుకోకపోవడం వారికి ఒక శాపంగా భావించవచ్చు. ఇటీవల విడుదలైన ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల షెడ్యూల్లో భాషా పండితుల పోస్టులు అప్‌గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇస్తామని చెప్పలేదు. ఇది భాషా పండితులను నిరాశ నిస్పృహలను కలిగించింది. అందుకే ఇకనైనా భాషా పండితులందరూ ఐక్యంగా ఉండి స్థాయి పెంచితేనే ఓట్లు వేస్తామని ఉద్యమించాలి. న్యాయబద్ధంగా భాషా పండితుల సమస్యను తీర్చాలని సమస్త పండిత వర్గం కోరుకుంటుంది.

యాడవరం చంద్రకాంత్ గౌడ్

భాషోపాధ్యాయులు.

94417 62105



Next Story

Most Viewed