కమ్యూనిస్టుల దారి ఎటు?

by Disha edit |
కమ్యూనిస్టుల దారి ఎటు?
X

ఏ సిద్ధాంతానికైనా ఒక్కోసారి కాలం కలిసిరాదు. ప్రజలపై ఏ భావజాలం స్వారీ చేస్తుందో దానిదే పై చేయి ఉంటుంది. వివిధ కారణాల వల్ల కమ్యూనిజం ప్రజలకు దూరమైనా దాని చేవ మాత్రం తగ్గదు. అయితే దాన్ని మనసా వాచా కర్మణా నమ్మినవారిపై దాని గౌరవం కాపాడవలసిన బాధ్యత కూడా ఉంది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం, ఉనికి చాటుకోవడం కోసం పాలకులకు వత్తాసు పలికే తీరులో మాట్లాడి సిద్ధాంతాన్ని తగ్గించకూడదు. కమ్యూనిస్టులు నలుగురైనా నిలబడి కొట్లాడడానికి రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. సంఘటిత ఉద్యమ ప్రణాళికతో ఉన్నంతలో ఈ దిశగా పట్టు వదలని కార్యక్రమాల్ని నిర్మించవచ్చు.

మ్యూనిస్టు పార్టీలకు ప్రజాదరణ తగ్గిపోతోంది. వాటితో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి ఇప్పుడు ఎవరు ఆసక్తి చూపడం లేదని స్వయానా మన సీపీఐ నారాయణ సారు అన్నట్లు ఓ టీవీ స్క్రోలింగులో కనబడింది. బయ్యారం ఉక్కు గని సాధన కొరకు ఈ నెల తొమ్మదిన ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్షలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చినట్లు పత్రికల్లో వచ్చింది. ఆ దీక్ష జరిగినట్లు ఎక్కడా వార్తలలో కనబడలేదు. కేసీఆర్ బీజేపీపై చేసే పోరాటాన్ని స్వాగతిస్తామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఓ సభలో అన్నారు. అదే సమయంలో ఎన్నికల హామీల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కూడా ఆయన విమర్శించారు. ఈ స్వాగతం, విమర్శల వైరుధ్యానికి స్పష్టత అవసరం.

కమ్యూనిజం సిద్ధాంతం విషయానికొస్తే ఈ మానవ సమాజంలో కష్టజీవికి గుర్తింపు తెచ్చింది అదే అని అంగీకరించవలసిందే. శ్రామిక శ్రేయో రాజ్యాన్ని కోరేవాళ్లే ఈ భూమ్మీద సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నేల మీద ఉన్న అన్ని దేశాలపై దాని ప్రభావం కొద్దో గొప్పో తప్పకుండా ఉండి తీరుతుంది. 'ప్రపంచ కార్మికులారా ఏకం కండి' అని నినాదాన్ని, అరుణ పతాకాన్ని అందించి ఉద్యమాల ద్వారా కమ్యూనిజం సామాన్యులకు సాధించి పెట్టిన విజయాలు, ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. కార్మికులు, ఉద్యోగులు అనుభవిస్తున్న పని గంటలు, వేతన విధానం, ఉద్యోగ విరమణ చెల్లింపులు ఇలా ఎన్నో ఫలాలు కమ్యూనిజం బాటలో నడిచి కొత్తగా తెచ్చుకున్నవే.

పుట్టుక నుంచి

మన దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో క్రిస్టమస్ రోజున పుట్టింది. 96 ఏళ్ల సుదీర్ఘ కాలంలో సైద్ధాంతిక విభేదాలతో దీనిలో ఎన్నో చీలికలు వచ్చాయి. వీటిలో ఉనికి కోల్పోయినవి, మరో దాంట్లో విలీనమైనవే ఎక్కువ. ప్రస్తుతం సీపీఐ, సీపీఎం దేశవ్యాప్తంగా కనీస పట్టుగల పార్టీలుగా కనబడుతున్నాయి. రాజకీయపరంగా వీటిని చూసుకుంటే 1952 లో జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల సమయంలో దేశంలోని ఓటర్ల సంఖ్య 17.3 కోట్లు. ఆ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి 16 , సోషలిస్టు పార్టీకి 12 సీట్లు వచ్చాయి. వాటికి 3 .3 శాతం ఓట్లు దక్కాయి. 2019 లో సాధారణ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఫలితాలు చూస్తే సీపీఐ 2, సీపీఎం 3 సీట్లను గెలుచుకున్నాయి.

దేశంలోని 91.2 కోట్ల ఓట్లలో అవి అరశాతం పొందడం దగ్గరే ఆగిపోయాయి. దీని వల్ల ఆ పార్టీలు ఎన్నికల గుర్తు కేటాయింపు, జాతీయ పార్టీ హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. కనీసం రెండు పార్టీలు కలిసైనా ఆ హోదాలను కాపాడుకోవాలని నేతలు ఆలోచించే అగత్యం ఏర్పడింది. మన దేశంలో రాజకీయ క్షేత్రంలో కమ్యూనిజం ఎలా కానరాకుండా పోతుందో ఈ లెక్కలు చెబుతున్నాయి. అయితే మధ్యలో పశ్చిమ బెంగాల్‌లో అప్రతిహతంగా 34 ఏళ్ల పాలన ఓ చారిత్రక విజయమే. అదే రకంగా కేరళ, త్రిపుర రాష్ట్రాలు కూడా చాలా కాలం వామపక్షాల పాలనలో ఉన్నాయి. ప్రస్తుతం కేరళ మినహా ఎక్కడ వారి పాలన లేదు.


క్రమంగా బలహీనపడి

కమ్యూనిస్టు పార్టీలకు ప్రతి చోట కొందరు ఓటర్లైనా ఉంటారు. అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు నిలబడనందున ఆ ఓట్లు వేరే పార్టీకి పడుతుంటాయి. ఈ కారణంగా పోలైన ఓట్లలో వీరి శాతం అసలు సంఖ్య కన్నా తక్కువ కనబడే అవకాశముంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఓట్లు, గెలుపు ద్వారా కాకుండా కమ్యూనిస్టు పార్టీల ఉనికిని అవి చేపట్టే ఉద్యమాలు, కార్యక్రమాలు, వాటిలో హాజరయ్యే జనాన్ని బట్టి అంచనా వేయాలని ఆయా పార్టీల నేతలు అంటుంటారు. వారి వాదన పూర్తిగా వాస్తవమే. కమ్యూనిస్టు పార్టీలకు స్థిరమైన, నిబద్ధత గల అనుచరులున్నారు కాబట్టే పార్టీ ఆందోళనల్లో ఎర్రజెండాలు వీధుల్లో, మైదానాల్లో రెపరెపలాడుతుంటాయి.

ఓట్లు, సీట్లు కాకుండా శ్రామికుడికి, సాధారణ ఉద్యోగికి కార్మిక చట్టాల అమలు ద్వారా రక్షణ, యాజమాన్యాల అతి చర్యల కట్టడి కమ్యూనిస్టుల కార్మిక ఉద్యమాలే సాధించాయి. ప్రతిఫలంగా ఉద్యోగుల, కార్మికుల, సానుభూతిపరుల సభ్యత్వ రుసుము ద్వారా లభించే సొమ్ము తో కార్మిక సంఘాలు, ఆపైన కమ్యూనిస్టు పార్టీలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకొంటాయి. భుజాన ఎర్ర సంచి తగిలేసుకొని ఫుల్ టైమ్ కార్యకర్తగా తిరిగే వారి వ్యక్తిగత, కుటుంబ ఖర్చులను పార్టీ కొద్ది మేరకు భరిస్తుంది. ఇప్పుడు రాజకీయపరంగానూ, ఉద్యమాల విషయంలోనూ కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడటానికి చాలా కారణాలున్నాయి. ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగి ఏ కమ్యూనిస్టు అభ్యర్థి దాన్ని తట్టుకొనే పరిస్థితి లేదు. డబ్బున్న వాళ్లు కూడా సిద్ధాంతాన్ని పక్కనపెట్టి గెలుపుకోసం పార్టీలు మారుతున్నారు. సైద్ధాంతిక భావజాలం, దాని పట్ల సానుభూతి వేరు, రాజకీయం, ఎదుగుదల వేరు అన్నట్లుగా నేటి రాజకీయ పరిస్థితి ఉంది.

పార్టీలకు అనుబంధంగా

ఇక ఉద్యమాల, ఉద్యోగ, కార్మిక సంఘాల పరిస్థితి కూడా ఏ మాత్రం అనుకూలంగా లేదు. ప్రయివేటీకరణ, యాంత్రీకరణ రెండు కలిసి శ్రమ శక్తిని, కార్మిక ఐక్యతని దెబ్బ తీశాయి. కాంట్రాక్టు ఉద్యోగులు యాజమాన్యాల దయా దాక్షిణ్యాలపై బతకవలసి వస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో యూనియన్ కల్చరే లేదు. ప్రాంతీయ రాజకీయ పార్టీలు సొంత కార్మిక సంఘాలను నెలకొల్పి సంఘ నాయకులను తమవైపు తిప్పుకొని కార్మికుల ఉద్యమాలను నీరుకార్చుతున్నాయి. రాజకీయ ఎదుగుదల కోసం కార్మిక నాయకులు సైతం ప్రాంతీయ పార్టీల వైపు ఆకర్షితులవుతున్నారు. 2019లో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల చరిత్రాత్మక సమ్మె తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్రంలో కార్మికోద్యమాల ఊసు లేకుండా చేశాయి. చివరికి కనికరించిన సీఎం కార్మిక సంఘం స్థానంలో డిపోకు నలుగురిని ఎంపిక చేసి పిలిచి కమ్మని భోజనం పెట్టి, భుజం తట్టి ఉద్యోగుల్లో ఉద్యమ స్ఫూర్తిని తొక్కి వేశారు. సింగరేణి బొగ్గు గనుల్లో కూడా టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమే రాజ్యమేలుతోంది.

ఇలా క్రమంగా కార్మికుల మీద కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిపోతోంది. కార్మికుల సంఖ్య, సంఘాల్లో వారి సభ్యత్వం తగ్గిపోవడం వల్ల కమ్యూనిస్టుల కార్యకలాపాలు కూడా ఆర్థిక వనరులు లేమితో సన్నగిల్లుతున్నాయి. యాంత్రీకరణ వల్ల ఇరవై మంది కూలీలు ఒక రోజులో చేసే పనిని యంత్రం గంటలో చేసేస్తుంది. భారీ నిర్మాణాలకు కాంట్రాక్టర్లు సొంత, కిరాయి మెషిన్ లతో కానిస్తున్నారు. మానవ శ్రమకు డిమాండు తగ్గింది. నోరెత్తితే ఉన్న పని పోతుందనే భయంలో కార్మికులు ఉన్నారు. చదువులు కూడా ఇంజనీరింగ్ బాట పట్టడం వల్ల విద్యార్థులు సామాజిక బాధ్యత, రాజకీయ సిద్ధాంతాల వైపు చూసే తీరిక లేకుండా ఉన్నారు. విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక పోరాటాలు నామమాత్రమైపోతున్నాయి. ఉద్యమ నిర్మాణానికి సరిపడే సభ్యులు, సానుభూతిపరుల సంఖ్య మరియు సభలు, ఊరేగింపులు, ధర్నాల నిర్వహణకు సరిపోయే ఆర్థిక దన్నులేక పార్టీ నేతలు పత్రికాప్రకటనలకు, టీవీ డిబేట్లకు పరిమితం కాక తప్పడం లేదు.

పాలకులకు వత్తాసు పలకకుండా

ఏ సిద్ధాంతానికైనా ఒక్కోసారి కాలం కలిసి రాదు. ప్రజలపై ఏ భావజాలం స్వారీ చేస్తుందో దానిదే పై చేయి ఉంటుంది. వివిధ కారణాల వల్ల కమ్యూనిజం ప్రజలకు దూరమైనా దాని చేవ మాత్రం తగ్గదు. అయితే దాన్ని మనసా వాచా కర్మణా నమ్మినవారిపై దాని గౌరవం కాపాడవలసిన బాధ్యత కూడా ఉంది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం, ఉనికి చాటుకోవడం కోసం పాలకులకు వత్తాసు పలికే తీరులో మాట్లాడి సిద్ధాంతాన్ని తగ్గించకూడదు. కమ్యూనిస్టులు నలుగురైనా నిలబడి కొట్లాడడానికి రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. సంఘటిత ఉద్యమ ప్రణాళికతో ఉన్నంతలో ఈ దిశగా పట్టు వదలని కార్యక్రమాల్ని నిర్మించవచ్చు. రాజకీయ పార్టీల ముందు ఉనికి నిరూపణ కోసం స్వాగతిస్తాం, విమర్శిస్తాం అనే కన్నా సైద్ధాంతిక భూమిక గల చిరు కార్యాచరణ అయినా కమ్యూనిజానికి ఊతమే.

- బి.నర్సన్

9440128169

Next Story

Most Viewed