వరల్డ్ టుడే:నీరే ప్రగతికి మూలాధారం

by Disha edit |
వరల్డ్ టుడే:నీరే ప్రగతికి మూలాధారం
X

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం, అననుకూల ఆర్ధిక పరిస్థితులు, ప్రణాళికల రూపకల్పనలో అలసత్వం కారణంగా దాదాపు 80 శాతం వ్యర్థ జలాలు పునర్వినియోగ ప్రక్రియకు నోచుకోకుండా పోతున్నాయి. పెరుగుతున్న జనాభాతో పాటు పారిశ్రామిక ప్రగతి కూడా కాలుష్యానికి హేతువుగా నిలుస్తున్నాయి. పరిశ్రమలు తమ ఆవరణలోనే నీటి శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కాలుష్యరహిత నీటిని బయటకు వదలాలి. తలసరి నీటి వినియోగం పెరగడంతో కూడా పరిశుభ్రమైన నీటికి డిమాండ్ పెరుగుతున్నది. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దేశాలు ఇజ్రాయిల్ అవలంబిస్తున్న పద్ధతులను నేర్చుకోవడం ద్వారా సమస్య తీవ్రతను గణనీయంగా కట్టడి చేయవచ్చు.

నీరే మానవ నాగరికతకు, ప్రగతికి మూలం. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల నుండే నాగరికత రూపుదిద్దుకుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ వనరును సంరక్షించాల్సిన బాధ్యతను గుర్తెరిగిన ఐక్య రాజ్య సమితి ఏటా మార్చి 22 వ తేదీన 'ప్రపంచ నీటి దినోత్సవం' నిర్వహించాలని 1993 లో తీర్మానించింది. ఈ భూగోళం మీద 70 శాతం నీరు ఉన్నప్పటికీ, ఇందులో మానవ వినియోగానికి అవసరమైన శుభ్రమైన నీరు దాదాపు 2.7 శాతం మాత్రమే. అందులో 75.2 శాతం ధృవప్రాంతాలలో మంచు రూపంలో ఘనీభవించి ఉండగా, మరో 22.6 శాతం నీరు భూగర్భంలో నిక్షిప్తమై వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో కలిసిపోయి ఉంటుంది.

సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో ఉండే నీటి పరిమాణంలో మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు ఉపయోగపడగలిగింది అత్యల్పం. ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే పరిశుభ్రమైన నీటిలో, 0.007 శాతం మాత్రమే మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతి నిత్యం సగటున ఒక మనిషికి కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 88.4 కోట్ల మంది ప్రజలకు సురక్షిత నీరు అందుబాటులో లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా ప్రపంచంలో 500కు పైగా మంచి నీటి నదులు కాలుష్య కాసారాలయ్యాయి. యుద్ధాలలో కన్నా కలుషిత నీటి వల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు.

ప్రపంచ నీటి దినోత్సవం ప్రాముఖ్యత

పచ్చని చెట్లు, సెలయేళ్లు, జీవ నదులు, మహా సముద్రాలు లేక రాళ్ళురప్పలతో నిండి ఉండే భూమిపై క్షణమైనా జీవించగలమా? ఈ సృష్టి ఏర్పడిన నాడు భూమిపై ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది. ఆ నీటిని వాడుకునేవారే కాక, వృథా చేసే వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర మంచి నీటి ఎద్దడి ఏర్పడుతోంది. భూమ్మీద ఉన్న నీరు ఎండకు ఆవిరై, మేఘాలుగా మారి, వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉండటం సహజ ప్రక్రియ. నీటిని పునర్వినియోగం, పునరుత్పత్తి చేసుకునే నైపుణ్యాన్ని ఆవిష్కరించుకున్న నాడు ఈ భూగోళం భూతల స్వర్గంగా మారుతుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 1,500 ఘన కిలోమీటర్ల పరిమాణంలో ఉత్పత్తయ్యే వ్యర్థ నీటిని పునర్వినియోగ ప్రక్రియ ద్వారా ఇంధనోత్పత్తికి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు.

ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం, అననుకూల ఆర్ధిక పరిస్థితులు, ప్రణాళికల రూపకల్పనలో అలసత్వం కారణంగా దాదాపు 80 శాతం వ్యర్థ జలాలు పునర్వినియోగ ప్రక్రియకు నోచుకోకుండా పోతున్నాయి. పెరుగుతున్న జనాభాతో పాటు పారిశ్రామిక ప్రగతి కూడా కాలుష్యానికి హేతువుగా నిలుస్తున్నాయి. పరిశ్రమలు తమ ఆవరణలోనే నీటి శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కాలుష్యరహిత నీటిని బయటకు వదలాలి. తలసరి నీటి వినియోగం పెరగడంతో కూడా పరిశుభ్రమైన నీటికి డిమాండ్ పెరుగుతున్నది. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దేశాలు ఇజ్రాయిల్ అవలంభిస్తున్న పద్ధతులను నేర్చుకోవడం ద్వారా సమస్య తీవ్రతను గణనీయంగా కట్టడి చేయవచ్చు.

నీటి వినియోగం ఎక్కువే

భారత్ వ్యవసాయాధారిత దేశం కావడంతో సహజంగానే నీటి వినియోగం ఎక్కువగానే ఉంటుంది. అతి తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది ఇజ్రాయిల్. తీవ్ర వర్షాభావ పరిస్థితులు గల ఈ దేశంలోని 66 శాతం భూమి ఎడారి ప్రాంతం. మంచి నీటికి కూడా సముద్రపు నీటిని పై ఆధార పడాల్సిన పరిస్థితి వీరిది. గృహావసరాలకు వాడే 60 శాతం, పరిశ్రమలకు వాడే 85 శాతం నీరు సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసినదే. 97 శాతం మురుగు నీటిని శుభ్రపరచి దేశంలోని 50 శాతం వ్యవసాయానికి నీరందిస్తారు.

మనలాంటి దేశాలు మురుగు నీటిని నదులలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసి పవిత్ర నదీ జలాలను కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయి. ప్రపంచంలోని దాదాపు 80 దేశాలు రక్షిత మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2025 నాటికి 48 దేశాలలో తీవ్రమైన నీటికొరత ఏర్పడుతుందని చికాగోలోని జాన్‌ హాప్కిన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ చేసిన హెచ్చరిక మనకు వెన్నులో వణుకు పుట్టించక మానదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 36 లక్షల మంది నీటి సంబంధిత వ్యాధులతో మరణిస్తుండగా అందులో 43 శాతం మందిని అతిసారవ్యాధి బలిగొంటున్నది.

ఇంకుడు గుంతలు

బోరు బావులు తవ్వడం తో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. తారు, సిమెంటు రోడ్ల కారణంగా వర్షం నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోతోంది. ఇంకుడు గుంతల ఏర్పాటు, నిర్వహణ పై ప్రజలను చైతన్య పరచడం, పర్యవేక్షించడం లాంటి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో చేయకపోవడం శోచనీయం. 1990 మధ్య దశకంలో హైదరాబాద్ అంతటా తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్న సమయంలో కూడా పద్మశాలి కాలనీలో ఆ ప్రభావం ఏమాత్రం కానరాలేదు. అందుకు కారణం ఆ కాలనీవాసులు దాదాపు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడమే. వాటర్ మాన్ రాజేంద్రసింగ్ కృషితో రాజస్థాన్‌లో నిర్మించిన చెరువులు/చెలమలు కారణంగా దాదాపు వెయ్యి గ్రామాలకు నీరందుతోంది. పానీ మాతా సహకారంతో అక్కడి రైతులు సాలీనా మూడు పంటలు సాగు చేస్తున్నారు.

ప్రముఖ రచయిత, కార్టూనిస్ట్ ఆబిద్ సూర్తి 2007 సంవత్సరం నుండి ముంబై నగరంలో ప్రతి ఆదివారం ఒక ప్లంబర్‌ను వెంటపెట్టుకుని కుళాయిలు లీక్ అవుతున్న ప్రతి ఇంటికి వెళ్లి తన స్వంత ఖర్చులతో మరమ్మత్తు చేయిస్తూ ప్రజలను నీటి సంరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి కరపత్రాలు పంచుతారు. వాటర్‌ గాంధీగా పిలవబడే అయ్యప్ప మసగి దేశవ్యాప్తంగా 700 కృత్రిమ చెరువులు నిర్మించి 'లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్' సాధించాడు. పదకొండు రాష్ట్రాలలో వేలకొద్ది జల సంరక్షణ ప్రాజెక్టులు అభివృద్ధి చేయడంతోపాటు వట్టిపోయిన 1000 బోరు బావులను పునరుజ్జీవింపచేసాడు.

సగటు పౌరుల బాధ్యత

కుళాయి నీరు వృధాగా పోకుండా ఎప్పటికప్పుడు లీకేజీలను మరమ్మతు చేయించడం ద్వారా దాదాపు 300 గ్యాలన్ల నీరు ఆదా చేయవచ్చు. షవర్‌తో కాక బకెట్‌ నీళ్లతో స్నానం చేస్తే రోజుకు 150 లీటర్ల నీరు ఆదా అవుతుంది. పళ్లు తోముకున్నంత సేపూ కుళాయిని తెరిచి ఉంచడం వల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది. తక్కువ నీరు వినియోగించే స్లిమ్ ఫ్లష్ లు వాడండి. అక్వేరియంలో నీరు మొక్కలకు పోయండి. మీ ఇంటి ఆవరణలో, పాఠశాలల్లో, కార్యాలయాలలోని ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు. ప్రతి నీటి చుక్క ఎంతో అమూల్యమైనది.

ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 లీటర్లు, అరకిలో కాఫీకి 11,000 లీటర్లు, వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను సైతం అధిగమించిన మన దేశంలోని ప్రతి పౌరుడు నీటి సంరక్షణను ఒక యజ్ఞంగా చేపట్టిన నాడు "సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, సస్యశ్యామలాం" అని మన వందే మాతర గీతం లో అన్నట్లు మారడానికి ఎంతో సమయం పట్టదు.

(నేడు ప్రపంచ నీటి దినోత్సవం)

యేచన్ చంద్ర శేఖర్

హైదరాబాద్

8885050822



Next Story

Most Viewed