రాజకీయాల చిక్కులతో సతమతమౌతున్న విశాఖ ఉక్కు..

by Disha Web Desk 20 |
రాజకీయాల చిక్కులతో సతమతమౌతున్న విశాఖ ఉక్కు..
X

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అంటూ యావదాంధ్రప్రదేశ్‌ లోని ప్రజానీకం ఏకకంఠంతో నినదించిన అపురూపమైన సన్నివేశమది. ఢిల్లీ పాలకులు చేసిన కుటిల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయటానికి తమ ప్రాణత్యాగం చేసి అమరులైన విషాద ఘట్టమది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన పిదప మన రాష్ట్రంలో ప్రభంజనంలా సాగిన తొలి పోరాటమది. విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చ జరుగుతుండటంతో ప్రజల్లో దీనిపై అంచనాలు పెరిగాయి. ఒక భారీ కర్మాగారం ఏర్పాటైతే లభించే ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి గురించిన ఆశలు మొలకెత్తాయి.

ప్రజల బలిదానం వృధా కారాదు

ఆంధ్రప్రదేశ్ అర్దికరంగానికి కొత్త ఊపిరి. ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి విశాఖ ఉక్కు కర్మాగారం. తెన్నేటి విశ్వనాధం పూరించిన ఉద్యమ నినాదం 32 మంది ప్రాణాలు బలిదానం వల్ల 1987 డిసెంబరు నాటికి కర్మాగారం నిర్మాణం పూర్తయ్యింది. 1990 సెప్టెంబరులో ఉత్పత్తి ప్రారంభమైంది.1992 ఆగస్టు 8న అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశాడు. కానీ, కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణ చేయదలచిన నేపధ్యంలో మళ్లీ విశాఖ ఉక్కు తెరపైకి వచ్చింది. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు నేడు రాజకీయ గూడులో చిక్కుకుంది.


పవన్ మాట చెల్లుబాటయ్యేనా

విశాఖ ఉక్కు కేంద్రం ఆధీనంలోనే ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్త శుద్ధి లేదన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు వారి భావోద్వేగాలపై ముడిపడి ఉందని, విశాఖ శాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ఆవకాశం వచ్చిన ప్రతిసారి తాను బీజేపీ అగ్రనాయకత్వానికి విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న భావోద్వేగ బంధాన్ని తెలియజేసి ప్రత్యేకంగా చూడాలని కోరడం జరిగిందన్నారు. జనసేన పార్టీ ప్రతి సందర్భంలో కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులతో చర్చించినప్పుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలని బలంగా చెప్పిందని తెలిపారు. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలవడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించి ఉద్యమానికి మద్దత్తు తెలిపామన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదని లేదన్న కేంద్ర మంత్రి ప్రకటన.. కొత్త ఆశలు రేపింది.

కేంద్రం నిజంగానే వెనకడుగేసిందా

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణ నేపధ్యంలో ఈ చర్యకు వ్యతిరేకంగా మెదటినుంచి తమవాణిని బలంగా వినిపించామన్నది జనసేనాని మాట. విశాఖ ఉక్కు ప్రవేటీకరణ నుంచి కేంద్రం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. ఇందుకు కారణం బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనేందుకు సిద్దపడటమే కారణమనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ, విపక్ష టీడీపీ కానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి నామమాత్రపు ప్రకటనలు హడావిడి అర్బాటాలు తప్ప, చిత్తశుద్ధితో పోరాటం చేసింది శూన్యం. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని, అంతకంటే ముందు ఆర్ఎన్ఐఎల్‌ను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించడం తెలిసిందే. పూర్తిస్థాయి సామర్థ్యంలో స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలు సాగిస్తుందని, స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై ఆర్ఎన్ఐఎల్ యాజమాన్యంతోనూ, కార్మిక సంఘాలతోనూ చర్చిస్తామని కేంద్రమంత్రి తెలిపారు.

మొదట్లో ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మొదటగా నిలిచింది విశాఖ ఉక్కు ప్లాంట్. కానీ సొంతగా ఇనుప ఖనిజం గనులు లేకపోవటంతో తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిర్మాణం కోసం నిధులు లేకపోవడంతో ఇతర సంస్థలపై ఆధారపడటంతో 1998-2000 సంవత్సరంలో ఖాయిలా పరిశ్రమగా మిగిలింది. వీటిని సాకుగా చూపించి విశాఖ ఉక్కును అస్మదీయులకు ఆందించాలన్న పధకం బెడిసి కొట్టింది

ఈ ద్వంద్వ నాలుక వైఖరి ఎందుకు

అదానీ వ్యవహారంతో సతమతమౌతున్న బి.జె.పి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల ముందు ప్రజాగ్రహానికి గురి కావద్దు అన్న కారణంతో కేంద్ర మంత్రిచే ఓ ప్రకటన చేయించింది. మరి ఆ దిశగా కార్యాచరణ చేపడుతుందా లేదా కంటి తుడుపు చర్యగా భావిస్తుందా అనేది వేచి చూడాలి. అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీ నుంచి మరొక ప్రకటన చేయడంతో ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజా బృందాలు సంయుక్తంగా పోరాడితే తప్ప విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గండం నుంచి తప్పించుకోలేదని స్పష్టమవుతోంది.

రాజకీయ చిక్కులు వీడేనా

ఏది ఎమైనా ఎంతో మందికి నేరుగా ఉపాధి మరెంతో మందికి పరోక్షంగా ఆండగా నిలిస్తూ దేశ ప్రగతికి దోహదం చేస్తున్న కర్మాగారాన్ని దాని ఖర్మకు వదిలేయకుండా ప్రత్యేక ఇనుపఖనిజ వనరులను కేటాయించి, అర్థిక చేయూతనిచ్చి, మౌలిక సదుపాయాల రూపకల్పన అభివృద్దిచేసి అండుబాటులోఉన్న విశాఖ ఓడరేవును వినియోగించుకుని వర్తక వాణిజ్యాలు జరపాలి. ఈదిశగా అన్ని వర్గాలు రాజకీయ పార్టీలు సమైఖ్య కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆభివృద్ధి ఆ ప్రాంత ఆభివృద్ధికి ప్రాముఖ్యం ఇవ్వాలి అలా చేసిన నాడు విశాఖ ఉక్కు రాజకీయ చిక్కులను వీడి రత్నమై తప్పక వెలుగులీనుతుంది.

శ్రీధర్ వాడవల్లి

99898 55445


Next Story

Most Viewed