దేశ సంపద రక్షకులను... ఇంతగా అవమానిస్తారా?

by Disha edit |
దేశ సంపద రక్షకులను... ఇంతగా అవమానిస్తారా?
X

ణిపూర్ మారణకాండ గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన సిగ్గుపడే ఘట్టాలు వీటన్నింటి మీద ప్రధానమంత్రి 80 రోజులు నోరు విప్పక పోవడానికి కారణం ఏమిటని ప్రతిపక్షాలు నిలదీయడమే కాక పార్లమెంట్‌లో ఈ విషయంలో అవిశ్వాస తీర్మానం పెట్టేవరకు వెళ్లాయి. ముఖ్యంగా ప్రపంచమంతా ఈ ఆఘాయిత్యాలను జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్వారా వీక్షించింది. మరీ ముఖ్యంగా మణిపూర్ ఘటనలో ముఖ్య పాత్ర వహించిన ఆ రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని, మణిపూర్ పోలీస్ డైరెక్టర్ జనరల్‌ను స్వయంగా తన ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఎందుకు జాప్యం చేశారనే దాని గురించి సుప్రీంకోర్టు అడిగింది. అనేక విషయాల్లో ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తిగా నడుస్తుందని సుప్రీంకోర్టు గత కొంత కాలంగా హెచ్చరిస్తూ వస్తోంది.

ఎవరినీ వదలని మతోన్మాదం

క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం నాలుగో శతాబ్దం వరకు అంటే భారతదేశంలో 10 శతాబ్దాలపాటు వర్ధిల్లిన బౌద్ధాన్ని కర్కశంగా అణచివేసిన హిందూ మతోన్మాదమే ఇప్పుడు క్రైస్తవుల్ని అన్యమతంగా పేర్కొంటూ వారి మీద దాడులు చేస్తుంది. బౌద్ధుల్ని, జైనుల్ని, ముస్లింలను, క్రైస్తవులను అణచివేయడం ద్వారా, హత్యలు చేయడం ద్వారా, భయభ్రాంతులను చేయడం ద్వారా మతవ్యాప్తిని చేసుకోవాలనేది ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహం. కుకీల అటవి భూముల్ని మెయితీలకు కట్టబెట్టి అడవిపై ఆధిపత్యం వహించాలనేది కూడా మరొక వ్యూహం. ముఖ్యంగా కుకీలు అడవి సంపదనంతా రక్షిస్తూ వచ్చారు. అడవి సంపదలో ప్రధానంగా గ్రానైట్, ప్లాటినం మెటల్స్, ఎలిమెంట్స్, నికెల్, కాపర్, బొగ్గు, పెట్రోలియం, సిమెంట్ ఇంకా ఎంతో విలువైన ఖనిజ సంపదను వారు భారతదేశానికి ఒక ఘన నిక్షేపంగా కాపాడుతూ వచ్చారు. ఇంతేగాక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు చట్టపరమైన, రాజ్యాంగ పరమైన హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల ప్రకారం అక్కడ మైనింగ్‌ను దోపిడి చేయడానికి కార్పొరేట్ శక్తులకు అవకాశం లేదు. అందుకే వాళ్ళు విధ్వంసానికి పూనుకున్నారు. ఈ విధ్వంసం వెనుక మత భావాలతో పాటు, మతోన్మాదుల, కార్పోరేట్ శక్తుల ఐక్య దోపిడీ విధానం ఉంది. ఈ రోజున ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి ఆయువులు. ఈశాన్య రాష్ట్రాల్లో భారత ఉపఖండం మూలాలు ఉన్నాయి. భారతదేశాన్ని జయించిన ఆర్యులు, కుషానులు, అరబ్బులు, తురుష్కులు ఎవరూ కూడా ఈశాన్యాన్ని ముట్టుకోలేకపోయారు. తాకట్టులోకి భారతదేశం వెళుతున్నప్పుడు కూడా ఈశాన్యం తన్నుతాను కాపాడుకుంది. గిరిజనుల పోరాటాలు దేశ అమూల్య సంపదను కాపాడుతూ వచ్చాయి.

మణిపూర్ హింస గురించి బీజేపీ పార్టీలోనే వ్యతిరేకత పెల్లుబికింది. బీజేపీ ఎమ్మెల్యే పోలిన్ లాల్ హోకిప్ మహిళలను నగ్నంగా ఊరేగించడం మీద తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో చెలరేగుతున్న హింస కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, దీని వెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌లాల్ హోకిప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల నగ్న వీడియో బయటకు రాకుంటే ప్రధానమంత్రి మోదీ అసలు మాట్లాడేవారే కాదన్నారు. హింస మొదలైనప్పుడే సమస్యను చెప్పుకునేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్ అడిగామని, ఇప్పటికీ కలిసేందుకు ఆయన అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు మెయితీ మిలిషియాతో పాటు పోలీసులూ కారణమని విమర్శించారు. మణిపూర్‌లో ఏం జరుగుతున్నదో ప్రధానికి గానీ, కేంద్ర హోంమంత్రికి గానీ తెలియదని ఒక మీడియా సంస్థకు ఆయన తెలిపారు. కుకీలపై మెయితే మిలిషియా గ్యాంగ్ లతోపాటు పోలీసులు కూడా దాడులు చేస్తున్నారని హోకిప్ వెల్లడించారు. మణిపూర్ హింసా కాండను నిశితంగా పరిశీలిస్తే, ఆర్ఎస్ఎస్ దేశంలోని మూలవాసుల పునాదులు కూల్చే పెద్ద ప్రయత్నంలో వుందని అర్థమవుతుంది. రాజ్యాంగాన్ని ప్రతి నిమిషం ఉల్లంఘించి రాజ్యాంగేతర శక్తిగా అవతరిస్తోంది. ఈ సందర్భంగా అంబేద్కర్ గిరిజనుల స్థితి గురించి, పాలకవర్గాల వైఖరి గురించి ఆనాడే ఇలా చెప్పారు.

ఆదివాసీల వెనుకబాటుతనం సిగ్గుచేటు

''తమ నాగరికత కొన్ని వేల సంవత్సరాల నాటిదని గొప్పలు చెప్పుకొనే ఈ దేశంలో ఈ ఆదిమవాసులు ఈనాటికీ ప్రాచీన కాలం నాటి దుర్భర అనాగరిక పరిస్థితిలోనే నివసిస్తున్నారంటే ఏమనాలి? కాని ఇది మాత్రం నగ్న సత్యం. ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ దురదృష్టవంతులు నాగరికులు కాలేకపోవడం ఒక్కటే కాక ఇందులో కొందరు దుష్ట వృత్తుల నవలంబించే దుస్థితికి దిగజారి నేరస్త జాతులుగా పరిగణించబడుతున్నారు. కోటి ముప్పై లక్షల మంది, నాగరికత మధ్య బ్రతుకుతూ అనాగరిక ఘోర దుస్థితిలో ఉండిపోవడం! పైగా వంశ పరంపరగా నేరస్తులుగా బ్రతకడం! దీనికి హిందువులు సిగ్గయినా పడకపోవడం! ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి ఇది. ఈ లజ్జాకరమైన పరిస్థితికి ఏమిటి కారణం? ఈ ఆదిమవాసుల్ని నాగరికులుగా మార్చడానికి, గౌరవప్రదమైన వృత్తులు చేపట్టేలాగ చేయడానికి అసలు ప్రయత్నమే జరగలేదు. ఎందువల్ల?

బహుశా, వాళ్ళ అనాగరిక స్థితికి జన్మ సిద్ధమైన బుద్ధిమాంద్యమే కారణమని చెప్పడానికి హిందువులు ప్రయత్నించవచ్చు. ఆదిమవాసులు తరతరాలుగా అనాగరికులుగానే ఉండిపోవడానికి కారణం తామేననీ ఒప్పుకోకపోవచ్చు. వాళ్లకు నాగరికత నేర్పడానికి గాని, వైద్య సహాయం మొదలైన వాటిద్వారా వాళ్ళను సరిదిద్దడానికి గాని, వాళ్ళను సంస్కరించి మంచి పౌరులుగా తయారు చేయడానికి గాని తాము ఏ మాత్రమూ ప్రయత్నించకపోవడమే ఆదిమవాసుల అనాగరిక స్థితికి కారణమని హిందువులు అంగీకరించకపోవచ్చు. ఈనాడు ఈ ఆదిమవాసుల కోసం ఒక క్రైస్తవ మిషనరీ ఏమి చేస్తున్నదో అదే ఒక హిందువుడు చెయ్యదలచాడనుకొందాం. అయితే అలా చెయ్యగల్గి ఉండేవాడా? చెయ్యగల్గి ఉండేవాడు కాదనే నా ఉద్దేశం. ఆదిమవాసుల్ని నాగరికుల్ని చెయ్యడం అంటే వాళ్ళను నీవాళ్ళుగానే భావించడం. వాళ్ళ మధ్య నివసించడం, వాళ్ళలో ఒక సహానుభూతిని పెంపొందించడం, క్లుప్తంగా చెప్పాలంటే, వాళ్ళను ప్రేమించడం, హిందువుకి ఇది అంతా ఎలా సాధ్యమవుతుంది?

హిందువు జీవిత పరమార్థం అంతా, తాపత్రయం అంతా, తన కులాన్ని భద్రంగా కాపాడుకోవడం. కులం హిందువులకి అమూల్య సంపద. ఏది ఏమైనా సరే తన కులాన్ని కాపాడుకోవడమే హిందువుల పరమలక్ష్యం. వేదకాలంనాటి అనార్యుల అవశేషాలైన ఆదిమవాసులతో సంపర్కం పెట్టుకోవడమంటే హిందువు తన కులాధిక్యతను పోగొట్టుకోవడమే కదా! పతిత మానవజాతి పట్ల తన బాధ్యత ఎటువంటిదో హిందువుడికి బోధించడం సాధ్యం కాదని కాదు. కానీ పతిత మానవజాతిపట్ల తనకెంత బాధ్యత ఉన్నదనుకొన్నా తన కులాన్ని నిలుపుకోవడంలో తనకున్న బాధ్యతను మాత్రం అధిగమించలేదు. ఎట్టి పశ్చాత్తాపము, సిగ్గూ, చింతా లేకుండా హిందువు తన నాగరికత మధ్యలో అనాగరికులను అనాగరికులుగానే ఉండిపోనిస్తున్నాడంటే అందుకు నిజమైన కారణం కులమే."

మౌన మహాముని చిద్విలాసం

ఒకనాడు కులాధిపత్యంతో విర్రవీగిన ఈ శ్రేణులు ఇప్పుడు మాకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అని అర్రులు చాస్తున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం చేసినవారే దళితుల గిరిజనుల హక్కులు కాలరాయాలని చూస్తున్నారు. అంబేద్కర్ ఎస్.సీలకు, ఎస్.టి.లకు కల్పించిన రాజ్యాంగ హక్కుల మీద రిజర్వేషన్ వ్యతిరేక హిందూ మతోన్మాదులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఇంతవరకు మణిపూర్ గడ్డమీద అడుగు పెట్టకపోవడం పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను ఎగతాళి చేస్తూ మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది. ఎందుకు? ప్రధానమంత్రి సమస్య మీద మాట్లాడకుండా తప్పించుకుంటున్నారనే విషయంలో విస్తుపోతున్నారు. ఇప్పుడు భారతదేశాన్ని రక్షించుకోవడానికి డా॥బి.ఆర్.అంబేద్కర్ చెప్పిన మార్గం శిరోధార్యం. అంబేద్కర్ ఆనాడే ఇలా అన్నారు. ‘‘బడా వ్యాపార సంస్థలు రాజకీయాలలో ప్రవేశించి, ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. వీరి ద్వారా ఎన్నికైన ప్రతినిధులు, ఆయా వ్యాపార సంస్థలకు లాభాలను సంపాదించడానికే పాటుపడుతున్నారు. భీష్ముడు, ద్రోణుడు కౌరవుల ఉప్పు తిన్నందుకు యుద్ధం ఎవరి పక్షాన చేశారో మనకు బాగా తెలుసు. భారతదేశంలోని అంటరాని వారి సహాయంతోనే బ్రిటీష్ వారు అధికారంలోకి వచ్చారు. కానీ అధికార పదవులన్నీ అగ్రకుల హిందువులకు ఇచ్చి, అంటరాని వారికి ఏ విధమైన జీవనోపాధి లేకుండా చేశారు. అంటరాని వారికి ఆంగ్లేయులు ఎంతో ద్రోహం చేశారు.’’

ఆ క్రమంలో అంబేద్కర్ ఈ దేశ స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకొన్నాడు. ఈ దేశాన్ని పాలించిన అన్ని పాలక వర్గాలు దళిత గిరిజనులను అణగదొక్కాయి. ఈనాడు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో భారతదేశాన్ని తిరిగి నిర్మించే స్ఫూర్తితో ముందడుగు వేద్దాం. చరిత్రలో నడవడం కాదు, చరిత్రను మారుద్దాం. ఈ క్రమంలోనే డా॥బి.ఆర్.అంబేడ్కర్ మార్గంలో దళితుల, ఆదివాసీల, స్త్రీల రక్షణ కోసం ప్రజాస్వామ్య లౌకికవాద సోషలిస్టు భావజాలంతో వున్న వారందరం కలసి ఏక కంఠంతో పోరాటం చేయడమే ఈ యుగ సంకేతం.

డాక్టర్ కత్తి పద్మారావు

దళిత ఉద్యమనేత

98497 41695


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed