అలా చేస్తే.. అంబేద్కర్‌ని అవమానించినట్టే

by Disha edit |
అలా చేస్తే.. అంబేద్కర్‌ని అవమానించినట్టే
X

నేడు విజయవాడ స్వరాజ్య మైదానంలో సీఎం జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ మహా శిల్పం ఆవిష్కరణ జరగనుంది. అయితే మత మౌఢ్యాన్ని జీవితాంతం వ్యతిరేకించిన అంబేద్కర్ స్మృతిలో జరిగే కార్యక్రమంలో బ్రాహ్మణీక వైదిక తంతులేవి ఉండడానికి వీల్లేదు. ఆ వైదిక తంతులనే కొనసాగిస్తే అంబేద్కర్ ని అవమానించినట్టే అవుతుంది.

అంబేద్కర్ స్వయంగా విగ్రహారాధనకు, వ్యక్తి పూజకూ వ్యతిరేకం. నేను విగ్రహ ఆరాధకున్ని కాదు. నిజానికి నేను విగ్రహ విధ్వంసకుడిని అని ఏనాడో తెల్చి చెప్పాడు. 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభ చర్చలలో భాగంగా.. రాజకీయ ప్రజాస్వామ్యం అనేది సామాజిక ప్రజాస్వామ్యానికి దారి తీయాలని, అది జరగాలంటే.. కుల వ్యవస్థ, విగ్రహారాధన, మతపరమైన తంతులనూ సమాజం వదిలించుకోవాలని తేల్చి చెప్పాడు అంబేద్కర్. విగ్రహ సంస్కృతిని వ్యతిరేకించిన అంబేద్కర్ పేరిట పొడుగు విగ్రహాలు కట్టినంత మాత్రాన అంబేద్కర్ వారసులు సంబరపడాల్సిందంటూ ఏమీ లేదు. ఎగ్జిబిషనిస్టు సంస్కృతి ఎల్లెడలా వ్యాపించిన నేటి కాలంలో విగ్రహాలు కడతామంటే అడ్డుకునేది లేదు.

విగ్రహపూజలు వద్దు

అయితే.. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ పెద్దలు ఏ పద్ధతిలో చేయబోతున్నారనేదే నేడు తేలాల్సిఉన్నది. అంబేద్కర్ అవలంబించిన బహుజన సంస్కృతికి అనుగుణంగానే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఖచ్చితంగా జరగాలని నేడు రాష్ట్రంతో పాటు దేశంలోని అంబేడ్కరిస్టులు కోరుతున్నారు. మనువాదాన్ని, బ్రాహ్మణీయ సంస్కృతిని, వైదిక తంతులనూ జీవితాంతం నిరసించిన వ్యక్తి అంబేద్కర్. హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించే ముందు సైతం బ్రాహ్మణీకపు పెత్తందారి పోకడలు వదిలించుకుంటే హిందూమతం బాగుపడుతుందని మత పెద్దలకు ఆయన హితవు పలికేవారు.

బ్రాహ్మణీకపు జాడ్యాన్ని హిందూ మత పెద్దలు వదిలించుకునేట్టు లేరని నిర్ధారించుకున్న తర్వాతనే.. హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించారు. హిందూ మతం నుండి ఆయన దూరం కావడానికి ప్రధాన కారణం బ్రాహ్మణీయ పెత్తందారీతనమే. 1956 అక్టోబర్ 14న నాగపూర్‌లో బౌద్ధ దమ్మ దీక్ష తీసుకుంటున్న సందర్భంలో అంబేద్కర్ 22 ప్రమాణాలను తాను స్వయంగా స్వీకరించి, తనతో పాటు బౌద్ధ మతంలో చేరుతున్న తన సహచరులతోనూ పలికించాడు. అందులోని 8వ ప్రమాణంగా.. బ్రాహ్మణీకపు తంతులను నేను అనుసరించను అని ఆయన తేల్చి చెప్పాడు.

మతమౌఢ్యానికి ఇంత ప్రోత్సాహమా?

ప్రజల్లో క్రమక్రమంగా హేతువాద ధోరణిని పెంపొందించాలని రాజ్యాంగం ఆర్టికల్ 51A ద్వారా ప్రబోధిస్తుంటే.. మన పాలకులు మాత్రం మతమౌఢ్యాన్ని అడుగడుగునా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ బ్రాహ్మణికపు తంతులతోనే మొదలవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలదయితే మరీ విపరీతపు ధోరణి. అయ్యగార్ల కాళ్లకు సాష్టాంగ దండాలు పెడుతూ సమస్త ప్రభుత్వ యంత్రాంగాన్ని సైతం వాళ్ళ ముందు మోకరిల్లేలా చేస్తున్నారు. మత మౌఢ్యాన్ని జీవితాంతం వ్యతిరేకించిన అంబేద్కర్ స్మృతిలో జరిగే కార్యక్రమంలో బ్రాహ్మణీక వైదిక తంతులేవి ఉండడానికి వీల్లేదు. వైదిక తంతులను వ్యతిరేకించిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో.. ఆ వైదిక తంతులనే కొనసాగిస్తే అంబేద్కర్ ని అవమానించినట్టే అవుతుంది. అంబేద్కర్ స్వయంగా బౌద్ధమతావలంబి కాబట్టి బౌద్ధ పద్ధతిలో.. పంచశీల జండా ఆవిష్కరించి, బుద్ధవందనంతో చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు.

అంబేద్కర్ ఆదర్శాన్ని పాటిద్దాం

నేడు జరగనున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో ఆ వేదికపై ఎలాంటి వైదిక తంతులు నిర్వహించకూడదని.. అంబేద్కర్ ఆదర్శాలను గౌరవించాలని.. అంబేడ్కరిస్టు, బహుజనవాద సంఘాల తరఫున ఏపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్ర రాష్ట్ర బహుజన, ప్రజాస్వామిక వాదులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అంబేద్కర్ అందించిన ప్రత్యామ్నాయ పంథాని గౌరవించే రాజకీయ పార్టీలు సైతం ఈ డిమాండుకు మద్దతుగా నిలవాలని కోరుతున్నాము. అంబేద్కర్ కార్యక్రమాన్ని అంబేడ్కరిస్టు పంథాలోనే నడపాలంటూ ఉద్యమించాలని బహుజన వాద సంఘాలకు పిలుపునిస్తున్నాము.

- ఆర్. రాజేశమ్,

కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక.

94404 43183


Next Story

Most Viewed