సాయుధ పోరాటంలో కోయ బెబ్బులి

by Disha edit |
సాయుధ పోరాటంలో కోయ బెబ్బులి
X

రిత్రలో ఆదివాసీల పోరాటాలు అనన్య సామాన్యం. భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీదారుల నుంచి విముక్తి కోసం వారు చేసిన ఉద్యమాలను చరిత్ర విస్మరించడం విచారకరం. అలా అనామకంగా మిగిలిన ఆదివాసీ వీరులలో సోయం గంగులు దొర ఒకరు. ఖమ్మం జిల్లాలోని బంజర అనే కోయగూడెంలో జన్మించాడు. గంగులు ఉద్యమ జీవితం మూడు దశలలో కొనసాగినట్లు తెలుస్తోంది. మొదటి దశలో దళనాయకుడిగా కీలక బాధ్యతలు. రెండో దశలో పాల్వంచ అటవీ ప్రాంతాన్ని కమ్యూనిస్టుల కంచు కోటగా మార్చడం. మూడవ దశలో జలియన్ వాలాబాగ్ దురంతం లాంటి పోలీసు చర్యలను ఎదిరించి యూనియన్ సైన్యంపై పక్కా ప్రణాళికతో మెరుపు దాడులు. రజాకారులను ముప్పుతిప్పలు పెట్టి వారి అకృత్యాలకు అడ్డుకట్ట వేశాడు. ఆయన నిండు యవ్వనంలోనే ఉద్యమం ప్రారంభించాడు. ఆదివాసీలకు ఆశ్రమం ఏర్పాటు చేసి చదువు చెప్పి, తిండి పెట్టి నిజాం నియంతృత్వాన్ని ప్రశ్నించడానికి సైన్యాన్ని తయారు చేశాడు.

వారి చరిత్ర వెలుగులోకి తేవాలి

1948లో నిజాం గద్దె దిగాక యూనియన్ సైనికులు ఇల్లందు, పాల్వంచ, దమ్మపేట, బూర్గంపాడు, వేలేరుపాడు ప్రాంతాలలోని విప్లవకారులను, సానుభూతిపరులను, సామాన్యులను చిత్రహింసలు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఎగిసిపడిన ఉద్యమానికి సోయం గంగులు నాయకత్వం వహించాడు. భూస్వాములను, సర్కారును ముప్పు తిప్పలు పెట్టాడు. అతడిని మట్టుబెడితేనే తప్ప మనుగడ సాధించలేమని సైనికులు, భూస్వాములు, రాజకీయ నాయకులు, పోలీసులు భావించారు. గంగులు సమీప బంధువును పావుగా వాడుకుని కల్లులో మత్తు మందు కలిపి అతని చేత తాగించారు. స్పృహ కోల్పోయిన తర్వాత గంగులును బంధించి పార్టీ కార్యకలాపాల గురించి చెప్పమని ఒత్తిడి చేశారు. అయినా చెప్పకపోవడంతో 1951 మే 12 న కాల్చి చంపి ఎదురు కాల్పులుగా చిత్రీకరించారు.

ఆయన గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. పెత్తందారుల మీద, నిజాం పాలన మీద పోరాడుతూ 32 సంవత్సరాల వయసులో చనిపోయాడు. గంగులు దొర జీవిత చరిత్రను వెలుగులోకి తేవాలి. నేడు అభివృద్ధి పేరిట పాలక ప్రభుత్వాలు అడవి బిడ్డలపై నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి పోలవరం, కంతనపల్లి ప్రాజెక్టులు, టైగర్ జోన్‌లు, ఓపెన్ కాస్ట్‌ల వలన కోయ గిరిజనులు నిర్వాసితులు కాకుండా, యురేనియం తవ్వకాల వలన చెంచులు సంక్షోభంలో చిక్కుకోకుండా ఆదివాసీ సమాజం ఉద్యమించాలి. అప్పుడు మహాజ్వాల సమాజాన్ని స్వప్నించిన మహాయోధుడు సోయం గంగులు దొరకు ఘన నివాళి అర్పించినట్లవుతుంది.

(నేడు సోయం గంగులు దొర 71 వ వర్ధంతి)

వంకా వరాలబాబు

ఎంఫిల్ ,పరిశోధక విద్యార్థి

మద్రాస్ యూనివర్సిటీ

99488 98639



Next Story