డాక్టర్ బిఆర్ అంబేద్కర్.. సామాజిక పునర్నిర్మాణ శాస్త్రవేత్త

by Disha Web Desk 13 |
డాక్టర్ బిఆర్ అంబేద్కర్.. సామాజిక పునర్నిర్మాణ శాస్త్రవేత్త
X

భారతదేశంలో నేడు రాజకీయ సంక్షోభం నడుస్తూ ఉంది. ఒక వైపు బిజెపి, విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయాలు. మరో వైపున కాంగ్రెస్ వంశపారంపర్య నాయకత్వం, ఆయా రాష్ట్రాల అగ్రకుల పెత్తందారి నాయకత్వం ఘర్షణ పడుతున్నాయి. మోడీ, ఆదానీల మతోన్మాద పెట్టుబడిదారీ కార్పోరేట్ వ్యవస్థల మిత్రుత్వాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్లో గద్దించి అడగడం ఈ ఘర్షణలకు మూలమైంది. మరో పక్క అమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అధినేత కేజ్రీవాల్ వారి మంత్రి మండలి కొందరు, తెలంగాణ అధినేత కెసిఆర్ కుమార్తె కవిత, పశ్చిమ బెంగాల్ అధినేత మమతా బెనర్జీ మేనల్లుడు, ఆంధ్రప్రదేశ్ అధినేత జగన్మోహన్ రెడ్డి బంధువు శ్రీనివాసరెడ్డి వీళ్లంతా కూడా మామూళ్లు వసూళ్లు చేశారనే అభియోగాన్ని మోడీ మోపుతున్నారు. ఇక గౌతమ్ అదాని మోడీ ఐక్యత ఈనాటిది కాదు. ఎంతో కాలం నుంచి కొనసాగుతుంది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి బలపడిన ఐక్యత ఇది.

రాజకీయ పక్షవాతం..

నిజానికి ఇప్పుడు పరిపాలనలో ఉన్న బిజెపి గ్రూప్ గాని, ఇటు కాంగ్రెస్, ఆయా రాష్ట్రాలలోని అగ్రకుల ఆధిపత్య రాజకీయ శ్రేణులు గాని సమ సమాజ నిర్మాణ ఎజెండాతో లేరు. భారత దేశ రాజకీయాల్లో శాసించిన వారిలో బ్రాహ్మణులు, కాయస్తులు, వైశ్యులు, క్షత్రియులు ముఖ్యపాత్రలో ఉన్నారు. అయితే వారి కుటుంబాల్లో అస్పశ్యత ఆచరణ, కులాన్ని ఆచరించటం వలన వాళ్లు బయటకు సంస్కర్తలుగా కనబడినా కుల భావం వారిలో పోలేదు.

ముఖ్యంగా వాళ్లు జాతీయ ఉద్యమంలో ఎక్కువమంది సాంప్రదాయక హిందూ కుటుంబాల నుంచి వచ్చినవాళ్లు. వాళ్లు పెరిగిన వాతావరణం, వాళ్ల తల్లిదండ్రులు, తాత ముత్తాతల ప్రభావం వీళ్ళ మీద బలంగా ఉంటుంది. ఈ అగ్రకులాల రాజ్యాధికారం వల్ల భారత దేశానికి రాజకీయ పక్షవాతం వచ్చిందని ఆనాడే రామ్ మనోహర్ లోహియా చెప్పారు. నిజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్టు రాజ్యాధికారం భారత రాజ్యాంగ సూత్రాలను అనుసరించి సమస్త సమాజ సామాజిక సమతుల మార్గంలో నిర్మించవలసి ఉంది.

సమానత్వ భావన ఏది!

భారతదేశ నిర్మాణానికి లౌకికవాద భావజాలం కావాలి. ముందు మానవులందరూ సమానం అనే భావన కాంగ్రెస్, బిజెపీ రాజకీయ శ్రేణులకు లేదు. బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చే విషయంలోనూ ఈ రెండు శ్రేణులు ఒకటిగానే ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాదు, ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనూ దళితులపై దాడులు జరుగుతున్నాయి. బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లోనూ బీజేపియేతర రాష్ట్రాల్లోనూ దళితులపై దాడులు జరుగుతున్నాయి. దళితులకు బీజేపీ వారు భూములు పంచడం లేదు. ఇతర రాష్ట్రాల్లో పాలిస్తున్న పార్టీల వారు భూమిని పంచడం లేదు. ఏ రాష్ట్రంలోనూ దళితులకు భూములు పంచడం లేదు.

రాజ్యమేలుతున్న వివక్ష..

దళిత బహుజనుల సామాజిక ఆర్థిక రాజకీయ అభివద్ధి పట్ల దేశంలోని అన్ని పార్టీ శ్రేణులు వివక్షతతోనే ఉన్నాయి. అసలు భారత పార్లమెంట్ లోనే కులం ఉంది. మంత్రి మండలి రూపొందించడంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కుల తత్వాన్ని ప్రదర్శించారు. భారత రాజకీయాల పైన వర్ణ వ్యవస్థ ప్రభావం ఉండటం వల్లే ప్రతిభావంతులైన దళితులకు రాజకీయ న్యాయం ఆనాటి నుండి ఈనాటి వరకు జరగకుండా పోతూవుంది. రాజకీయ వ్యక్తిత్వాన్ని గురించి ‘‘రెనడే గాంధీ జిన్నా’’ వ్యాసంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లోతుగా చర్చించారు. రాజకీయవేత్త నిష్పాక్షికంగా ఉండాలని, నిజాయితీగా ఉండాలని, నీతిగా ఉండాలని అంబేద్కర్ అన్నారు.

డాక్టర్ అంబేద్కర్ వ్యక్తిత్వంలో బౌద్ధ నీతి సూత్రాలు ఉన్నాయి. దళిత బహుజనులు, మైనారిటీలు, స్త్రీలు పాలనలోకి వచ్చినప్పుడే సమ సమాజ భావన, సామాజిక సమతుల్యం ఏర్పడుతుందని అంబేద్కర్ చెప్పారు. నిజానికి ఇప్పుడు మతాధిపత్య, కులాధిపత్య, కార్పొరేట్ ఆధిపత్య రాజకీయాలకు వ్యతిరేకంగా దళిత బహుజన రాజకీయాలు ప్రవర్తిల్ల వలసి ఉంది. రాజకీయ నాయకులు అవినీతిపరులైతే, కార్పొరేట్ వ్యవస్థలకు లొంగిపోతే, దేశాన్ని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తే పేదలకు దారిద్య్రం, అస్పశ్యత, అసమానత, హింస, వివక్ష, విద్రోహం పెరుగుతూ వెళ్తాయి. ఇప్పుడు భారతదేశం ఆ పరిస్థితుల్లోనే ఉంది.

భారతదేశంలో బ్రాహ్మణవాద, మనువాద, వర్ణవాద, అప్రజాస్వామిక వాద, రాజకీయ శక్తులు రెండు కూటములుగా ఏర్పడి రాజకీయ అధికారం కోసం పోరాడుకుంటున్నాయి. రాజకీయ పండితునిగా ఈ వైరుధ్యాలను కనిపెట్టిన వాడు అంబేద్కర్ ఒక్కడే. అస్పశ్యులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం వలన మాత్రమే భారత దేశంలో ఉత్పత్తి శక్తి పెరుగుతుందని ఆర్థికవేత్తగా అంబేద్కర్ చెప్పారు.

దారిద్య్రంలో 70 కోట్ల మంది..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ ప్రణాళికలో చెప్పినట్టు భూముల్ని, పరిశ్రమల్ని జాతీయం చేసే దిశగా దళిత బహుజన మైనార్టీ ప్రజాస్వామ్యవాదుల, స్త్రీల రాజ్యాధికారం రావాలి. దీనికి బౌద్ధతాత్విక వాదమే రాజకీయ పునాది కావాలి. భారతదేశంలో శ్రమశక్తితో జీవించేవారు 70 కోట్ల మంది ఇప్పుడు దారిద్య్రంలో ఉన్నారు. వారికి నివాసం లేదు, విద్యుత్తు లేదు, పనిలేదు, మంచినీరు లేదు, శుభ్రమైన గాలి లేదు, వారి పిల్లలకు సరైన విద్యా అవకాశాలు లేవు.

అందుకే డా॥ అంబేద్కర్ దళితుల ఆర్థిక, సాంఘిక హక్కుల కోసమే గాక వారి రాజకీయ హక్కుల కోసం కూడా చారిత్రాత్మకమైన పోరాటం చేశారు. రాజకీయంగా దళిత జాతులకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆయన ప్రయత్నించారు. భారతదేశ బడా పెట్టుబడిదారుల పార్టీగా కాంగ్రెస్ ముందుకు నడుస్తున్నప్పుడు 1936 ఆగష్టులో దళిత జాతుల సముద్ధరణకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని (ఐ.యల్.పి.) ఆయన నిర్మించారు.

రాజకీయాధికారమే మౌలికం!

అంబేద్కర్ నిర్మించిన ఇండియన్ లేబర్ పార్టీ 1937లో బొంబాయి ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌కు పటిష్టమైన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ఇండియన్ లేబర్ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశంతో డా॥అంబేద్కర్ 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎ.ఐ.యస్.సి.ఎఫ్)ను స్థాపించారు. ఆ సందర్భంగా డా॥ అంబేద్కర్ దళితుల సాంఘిక ఆర్థిక హక్కులను సాధించటానికి వారికి రాజకీయాధికారం కావాలని ప్రబోధించారు. అంబేద్కర్ తన రాజకీయాలు నైతికతా పునాది మీద నడిపించారు.

జీవించే హక్కు కోసం ఆయన పోరాడాడు. బి.సి.లను, యస్.సి.లను, మైనార్టీలను, స్త్రీలను రాజకీయ ఐక్య శక్తిగా సిద్ధాంత పునాదుల మీద రూపొందించాలని కృషి చేశారు. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్‌లో కాన్షీరామ్ బహుజన సమాజ్ పార్టీని, బహుజన సమాజ రూపకల్పన కోసం స్థాపించి ఓటు విలువను చాటి చెప్పారు. ఎనభై ఐదు శాతం మందిలో పదిహేను శాతం మందికి ఓటు వేయడం ద్వారా మీ రాజకీయ హక్కులను కోల్పోతున్నారని చాటి చెప్పారు.

ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేవలం అణచివేత గురించి కార్పోరేట్ మతోన్మాద రాజకీయాల గురించే కాక జనాభా నిష్పత్తిని బట్టి సీట్లు, బహుజనుల రాజ్యాధికారం, కుల నిర్మూలనా ఎజెండా, విద్యావంతులకు ఉద్యోగ భద్రత, భూమి పంపకం ఎజెండా లేకుండా ఒకరికొకరు వివాద పడటం వలన ప్రయోజనం లేదు. అందుకు భారతదేశ వ్యాప్తంగా దళిత బహుజన మైనార్టీలు, స్త్రీలు, ప్రజాస్వామ్య వాదులు ఐక్యంగా రాజ్యాధికారాన్ని అంబేద్కర్ సిద్ధాంత పునాదిపై సాధించు కోవలసిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. అప్పుడే భారతదేశ పునర్మిర్మాణం జరుగుతుంది. హిందూవాద, వర్ణవాద, కార్పోరేట్ వాద, వంశపారంపర్యవాద, రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయవాద, సమసమాజ నిర్మాణ దిశగా అంబేద్కర్ మార్గంలో పయనిద్దాం. ఇది అంబేద్కర్ రాజకీయ యుగం. ఆ నిర్మాణం మన కర్తవ్యం.

(నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి)

మహాకవి డా. కత్తి పద్మారావు

దళిత ఉద్యమ నేత – 9849741695






Next Story

Most Viewed