నవతరానికి వైతాళికుడు.. జ్యోతిరావు పూలే

by Disha Web Desk 13 |
నవతరానికి వైతాళికుడు.. జ్యోతిరావు పూలే
X

నితనం పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారిత కోసం కృషిచేసిన మహనీయుడు మహత్మా జ్యోతిరావు పూలే. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పవచ్చు. విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక సమానత్వం నిర్మూలించడానికి పూలే ఎంతో కృషి చేశారు. సమాజం విద్యాపరంగా ఎదిగినప్పుడే అభివృద్ధి చెందుతుందని కాంక్షించిన దూరదృష్టి కలిగిన సామాజిక తత్వవేత్త.

దేశంలో మొదటి సామాజిక తత్వవేత్త..

బ్రాహ్మణీయ కుల వ్యవస్థకు వ్యతిరేక పోరాటమే కాకుండా బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా బహుజనులను చైతన్య పరిచిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక వ్యవసాయ తోటమాలి కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయినా పూలే తండ్రి పెంపకంలో పెరిగాడు.1834-38 కాలంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన జ్యోతిరావు పూలే మధ్యలో చదువు ఆపేసిన ఆ తర్వాత ఒక ముస్లిం ఉపాధ్యాయుడి చొరవతో చదువు కొనసాగించాడు.1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో కుల వివక్షకు గురైన పూలే బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాల పై జ్ఞానాన్ని సంపాదించిన జ్యోతి రావు పూలే జీవితం పైన చత్రపతి శివాజీ ,జార్జి వాషింగ్టన్ జీవిత చరిత్రలు ప్రభావితం చేశాయి. వారి వల్ల దేశ భక్తి నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్ రచించిన మానవ హక్కులు పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేశాయి.1848లో మొదటిసారిగా తన భార్య సావిత్రి బాయి పూలే సహకారంతో బాలికల కోసం మొదటి పాఠశాల నెలకొల్పాడు.

జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వాలని ,స్త్రీలు విద్యావంతులు కావాలని అతని ఆకాంక్ష. క్రమేపి అనేక పాఠశాలలు స్థాపించి బాలికల విద్యాభివృద్ధికి బంగారు బాటలు వేశాడు.1864 లో బాల హత్యా ప్రతిబంధక్ గృహ ను స్థాపించి వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. 1973లో సత్యశోధక సమాజాన్ని స్థాపించి మొదటి సంస్కరణోద్యమానికి పునాది వేశాడు. ఈ సత్యశోధక సమాజం తరఫున దీనబంధు పత్రికను స్థాపించి కార్మికుల సమస్యలను వెలుగులోకి తెచ్చాడు. పన్నెండేళ్లు పూణే మున్సిపాలిటీకి ప్రజాప్రతినిధిగా పనిచేసి సామాజిక సమస్యలపై సమరశంఖం పూరించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే. గులాంగిరి, చత్రపతి శివాజీ, తృతీయ రత్న, బ్రహ్మణ్ పంతోజి మొదలైన రచనల ద్వారా మానవత్వం విలువలైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేశారు. బొంబాయి నూలు మిల్లులోని శూద్ర కార్మికుల హక్కుల కోసం 12 గంటల పని దినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్లను నెలకొల్పి పోరాటాలు చేశాడు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే కాకుండా సమసమాజ స్థాపనకు జీవితాన్ని అంకితం చేసిన జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28న పరమపదించారు.

ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలి..

సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీల అభివృద్ధి చెందకపోతే సమజం అభివృద్ధి చెందదని పూలే భావించాడు. అందుకనుగుణంగా స్త్రీలందరు విద్యావంతులు కావాలని ఆనాడే దిశా నిర్దేశం చేశాడు. కానీ స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు గడిచిపోయినా దేశంలో రాష్ట్రంలో ఇప్పటికి స్త్రీ విద్యలో వెనుకబడే ఉన్నాం. ఒకటో తరగతి లో అడుగుపెట్టిన 100 మంది బాలికల్లో పదవ తరగతి వచ్చేవరకూ 33 మంది బాలికలు మాత్రమే మిగులుతున్నారు. అలాగే నేటికీ బహుజనులు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారు. సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు చేరడం లేదు. బాల్య వివాహాలాంటి సాంఘిక దురాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మత వివక్ష నానాటికి పెరిగిపోతున్నది. సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలను రూపుమాపి సమసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వాలు కృషి చేసినప్పుడే జ్యోతి రావు పూలే ఆశయాలకు అప్పుడే ఘనమైన నివాళి.

(నేడు జ్యోతిరావు పూలే జయంతి)

అంకం నరేష్, 6301650324






Next Story

Most Viewed