ఇది వదలలేం.. అది రాయలేం!

by Disha edit |
ఇది వదలలేం.. అది రాయలేం!
X

2019లో వాళ్లు ఉద్యోగంలో చేరారు. అసలే ఉద్యోగాలు లేని పరిస్థితి. చిన్నదో పెద్దదో వచ్చిందిగా ఒక ప్రభుత్వోద్యోగం అనుకొని చదివిన చదువులను, చేసిన కార్పొరేట్ ఉద్యోగాలను వదులుకొని మరీ అందులో చేరారు. మూడేళ్ల ప్రొబేషన్ మాత్రమే కదా! ఇట్టే గడిచిపోతుంది అనుకున్నారు. మూడేళ్లను నాలుగేళ్లు చేశారు. జీతం పెంచడం మాత్రం కాస్త సంతృప్తినిచ్చింది. ఆ జీతాన్ని చూసుకునే కష్టంగా చేస్తున్న పనులను ఇష్టం గా మార్చుకునే ప్రయత్నం చేస్తూ వారి రోజువారీ బాధ్యతలకు అలవాటు పడ్డారు.

ఇప్పుడు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్‌లు రావడంతో మళ్లీ ఆలోచన మొదలుపెట్టారు. తెలంగాణ వచ్చిన నాటి నుండి మొదటిసారి గ్రూప్-1 నోటిఫికేషన్ పడింది. గ్రూప్-1 సాధించడం అంటే చిన్నపాటి తపస్సు లాంటిదే. దానికి చాలా డెడికేషన్ కావాలి, సమయం కేటాయించాలి. ప్రస్తుతం జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా చేస్తున్న వారిలో చాలా మంది లక్ష్యం గ్రూప్-1 గా ఉన్నవారు ఉన్నారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ధర్మాల నిమిత్తం వారు వారి కోరికలను చంపుకుంటున్నారు. పంచాయతీ కార్యదర్శిగా గ్రామాలలో గంపెడు పనులు చేస్తూ, చదవడం చాలా కష్టంగా మారింది. అలాగని ఉద్యోగం వదిలేయలేని పరిస్థితి.

పోటీలో నిలబడగలమా?

ఎన్నో ఆశలతో ప్రభుత్వోద్యోగం అని చేరినప్పటికీ ఏ ఒక్కరోజు కూడా వారు ప్రశాంతంగా నిద్రపోలేదు. తలకు మించిన పనులతో సతమతమయ్యారు. శిక్షణ లేకపోయినా సొంతంగా అన్ని నేర్చుకున్నారు. ఇబ్బందులు తట్టుకోలేక కొందరు ఉద్యోగం మానేస్తే, మరికొందరు ప్రాణాలు వదిలేశారు. ఎప్పటికైనా నోటిఫికేషన్ వస్తే, పెద్ద ఉద్యోగం సంపాదించి వెళ్లిపోవాలనే ఆశతో ఉన్నవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్‌లు వచ్చినప్పటికీ వాళ్ల ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. మూడేళ్ల నుండి పుస్తకం ముఖం చూడని వాళ్లంతా కొత్తగా పుస్తకాలు కొంటున్నారు. పోటీని చూసి నిలబడగలమా అని సందేహిస్తున్నారు. గతంలో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ పరీక్షలలో టాపర్‌లుగా నిలిచినవాళ్లే ఇప్పుడు తమ మీద తాము నమ్మకాన్ని కోల్పోతున్నారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

సెలవుల మాట ఎత్తొద్దట

ప్రభుత్వోద్యోగం కదా, సెలవు పెట్టేసి చదువుకోవచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీరి వ్యక్తిగత పనులకే సెలవులు ఇవ్వడానికి పై అధికారులు సంకోచిస్తారు. నిజానికి వాళ్ల పనులు అలా ఉంటాయి మరి. ఒకవేళ చచ్చిబతికి సెలవు ఇచ్చినా ఆ రోజు మొత్తం ఫోన్ మోగుతూనే ఉంటుంది. అలా ఫోన్లతో ఇబ్బంది పడేకంటే సెలవు తీసుకోకపోవడమే మంచిదని చాలా మంది పంచాయతీ సెక్రెటరీలు భావిస్తుంటారు. ఇక ఇప్పుడు నోటిఫికేషన్‌లు పడ్డాయి చదువుతామని సెలవులు అడిగితే ఆ మాటెత్తొద్దని పై అధికారులు గట్టిగా చెబుతున్నారు. అంటే, అందరికీ సెలవులు ఇవ్వడం కుదరదు కదా? ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న పల్లెల పరిస్థితి, వీళ్లు లేకపోతే మళ్లీ చిందరవందరగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రానున్న ఎలక్షన్ల గురించి గ్రామాల్లో రాజకీయ పరివర్తనలు కనిపిస్తున్న తరుణంలో వీరికి సెలవులు ఇవ్వడం అంటే కత్తిమీద సాము లాంటిదే అని పై అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరి ఏం చేయాలి?

ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం ఉన్న పంచాయతీ సెక్రెటరీ ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేయడం తప్ప వేరే దారిలేని పరిస్థితి ఏర్పడింది. పెళ్లి చేసుకొని, పిల్లలు ఉన్న పంచాయతీ సెక్రెటరీల పరిస్థితికి ఇది కుదరదు. అందుకే వాళ్లంతా అయోమయంలో పడ్డారు. ఒక్క ఉద్యోగం వారి జీవితాన్ని ఇలా చేస్తుందని ఊహించలేదని వారు బాధపడుతున్నారు. అయితే ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసి, ఎలాగూ గ్రామాలలోనే నివాసం ఉండాలన్న నియమం ఉంది కాబట్టి అక్కడే ఉంటూ ఖాళీగా ఉన్న సమయాన్ని పద్ధతిగా ఉపయోగించుకుంటే గ్రూప్-1, గ్రూప్-2 లాంటివి కాకపోయినా, గ్రూప్-3, గ్రూప్-4 లాంటి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ఈ ఆలోచనల కారణంగా ఎంతోమంది పంచాయతీ సెక్రెటరీలు మానసికంగా బాధపడుతూ తమ వ్యక్తిగత జీవితాలను సమస్యలమయం చేసుకుంటున్నారు అనేది మాత్రం అక్షర సత్యం! ప్రభుత్వం వారికి ఏమైనా వెసులుబాటు కలిగించగలుగుతుందా? ఉన్నతాధికారులు కనికరిస్తారా?!

- ప్రగత్ దోమల

మాజీ పంచాయతీ కార్యదర్శి

గ్రూప్-1 అభ్యర్థి

6300 105 472



Next Story

Most Viewed