మల్లన్న సాగర్ వెనుక మట్టిమనుషుల కన్నీళ్లు..

by Disha edit |
మల్లన్న సాగర్ వెనుక మట్టిమనుషుల కన్నీళ్లు..
X

ల్లన్నసాగర్ రిజర్వాయర్ వెనక ఎనిమిది గ్రామ పంచాయితీలు, ఆరు శివారు గ్రామాల మట్టిమనుషుల కన్నీళ్లు ఉన్నాయి. కొందరివి ఇంకిన కన్నీళ్లు.. ఇంకొందరివి ఆగిన గుండెలు, మాయం అయిన మాయి ముంతలు, గడప గడపకు పూజలు అందుకున్న వనదేవతలు.. ఆ వనదేవతల వలపోతతో వలసెల్లి పోయాయి. నోరు లేని గుడులు బడులు మట్టిపోరల్లో చరిత్ర శిథిలాల కింద మాయం అయ్యాయి. ఎవరైనా రాస్తే అది చరిత్ర. మర్చిపోతే అది మట్టి దిబ్బ. ఊళ్లకు ఊళ్ళు ఉసిల్ల దండులాగా వెంటపడి తరుముతున్న యమభటుల లాఠీ దెబ్బలతో, బూట్ల పద ఘట్టనల నడుమ చెల్లాచెదరు అయ్యారు. మనకు కనబడని విధ్వంసాలు ఎన్నో జరిగాయి. పారే నీళ్ళను చూసి పారవశ్యంతో చేసే మన పులకరింతలకు ఆ నీళ్ళలో కోట్లాది మంది కన్నీళ్లు ఉంటాయనే ఎరక మనకు ఉండదు.

యాదాద్రి అంత సింపుల్ కాదు..

ఒక నిర్వాసిత రైతు తన తాతల నాటి నుండి సంక్రమించిన ఇంటిని బలవంతంగా ఖాళీ చేయమని అడిగితే, ఇంటి కలప మొత్తం ఒక దగ్గర పేర్చి అదే కలపతో చితి పేర్చుకుని కాల్చుకుని సచ్చిపోయిన మల్లారెడ్డి బలవంతపు నిష్క్రమణ యాదికి వచ్చింది. మల్లారెడ్డి లాంటి వంచిత బ్రతుకుల ఆయువు ఆవిరైపోయింది. ఇంకా గుండె పగిలి చనిపోయిన ఆనవాళ్ళు నమోదు కావాల్సే ఉంది. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, గౌరవెల్లి, మల్లన్న సాగర్ ఎంపిక బాగానే ఉంది. ఆ నీళ్ళ కింద కనుమరుగు అయిన మట్టి దిబ్బల కింద ఎన్ని పోచమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ, కట్ట మైసమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ గుడులు ఉన్నాయో.. నువ్వు రాళ్ల సొరికలో ఉన్న కొమరెల్లి మల్లన్నను యాదగిరి గుట్టను ఏసీ గదులతో యదాద్రి చేసినంత సింపుల్ కాదు. నీకు యదాద్రి రియల్ దందా. కానీ తరాలుగా మొక్కిన బండరాయిని పునర్నిర్మాణం చేయడం నీ తరం కాదు. పదహారు వేల ఎకరాల వ్యవసాయ, అటవీ భూమి మాయం అయ్యింది. ఆరేడు నెలల కింద రేమిల్ల అవధాని (సీనియర్ జర్నలిస్ట్ హిందూ) కాల్ చేసారు. తాను మెదక్ సంగారెడ్డిలో పనిచేసే కాలంలో మల్లన్న సాగర్ మీద చేసిన ఫీల్డ్ రిపోర్ట్స్ పుస్తకంగా వేస్తున్నా అని నేను ఫేస్‌బుక్‌లో రాసుకున్న నోట్ తన పుస్తకంలో వేసుకుంటా అని నా అనుమతి అడిగారు. వీలుంటే ఇంగ్లీష్ చేసి ఇవ్వమన్నారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న అతనికే ఆ అనువాదం లొంగలేదు. నేనూ చేయలేక పోయా.

నీళ్లతో ఉరిపోసి..

Reservoirs Of Silence : A Journalist's Chronicle of Unheard Voices. కేవలం నూట పదిహేను పేజీల ఈ చిన్న పుస్తకానికి శ్రీనివాస్ కండ్లకుంట ముందుమాట రాశారు. ఎక్కడో కోనసీమలో పుట్టిన అవధాని గడిచిన నలభై ఏళ్ళుగా హైదరాబాద్‌నే అంతిమ స్థావరం చేసుకున్నాడు.. తాను ఎరిగిన కన్నీళ్లను, చూసిన కడగండ్లను రాసే క్రమంలో ఎంత యాతన పడ్డాడో. కాసుల సత్యనారాయణ శర్మ వేముల ఘాట్‌లో ఐదు తరాలుగా అక్కడ పూజారి, బడి పంతులు, తన పదవీ విరమణతో వచ్చిన డబ్బులతో ఒక ఇల్లు కట్టుకున్నాడు. బహుశా ఆ ఊరు ఖాళీ చేయాల్సిన చివరి ఇల్లు చివరిసారిగా తన గుడిని చూసుకుని విస్తాపితుడిగా మరో ఇల్లు గుడి కోసం వెతుకులాడుతూ.. అన్ని కొంపలు కూల్చి నీళ్ళతో ఉరిపోసిన కేసీఆర్ ఎందుకో గజ్వేల్ వదిలి కామారెడ్డి వలస బోతున్నాడు. కారణం కేసీఆర్‌కూ కూలిన దర్వాజలకూ ఎరుక.

ఇవ్వాళ అందరూ మల్లన్న సాగర్ నీళ్లను చూసి పరవశించి పోతున్నారు. కానీ ఆ నీళ్ల వెనక ఎన్ని కన్నీళ్లు ఉన్నవో, కోల్పోయిన ఆనవాళ్లు ఉన్నవో నాకు దగ్గరగా తెలుసు. పోయేదేమీ లేదు అనుకోవడానికి వాడు బండరాయి కాదు. ఇంతేలే నా గతి అనుకోడానికి వాడి సేవ చచ్చిపోలేదు. ఒక నిష్క్రమణ మరొక విస్ఫోటనాన్ని ఇవ్వొచ్చు. కొన్ని వేల మంది నిర్వాసితులు అయ్యారు. వాళ్ళ తాతలు, తండ్రులు, ఆడుకున్న జ్ఞాపకాలు శిథిలం కాబోతున్న బాధాకరమైన సందర్భం ఇది. మల్లన్న సాగర్ వాళ్ళ బొందలగడ్డలు కూడా మిగల్చలేదు, ఎన్ని తరాలు ఆ నేలమీద ఆకలి, కష్టం, సుఖం, దుఖం కలబోసుకొని ఉండొచ్చు. ఎన్ని తరాలు ఆ మట్టితో సంభాషించి ఉండొచ్చు.

నాలుగేళ్ళు కొలువు జేసీ, కిరాయికి ఉన్న ఇల్లు వదిలిపోతుంటే మొన్న యాతన అనిపించింది. చదివినబడి ఒదిలి పోతుంటేనే వలపోత ఆగదు. అలాంటది తాతలు, తండ్రులు అయ్యలు, పురుళ్ళు, పుణ్యాలు, దినాలు, కొత్తగా పెళ్లయిన పెళ్లి కూతురు ఊరొదిలి పొలిమేర దాటి ఓ సారి ఊరికి దండం పెట్టే అవ్వా అయ్యలను వదలలేక, పొలిమేర గుండు మీద పెట్టిన వెతల కథలు ఎన్ని మాయం అయి ఉండొచ్చు కొమరెల్లి మల్లన్న సాక్షిగా?

ఎంత చరిత్ర ఆనవాళ్లు కోల్పోయి..

దునికే నీళ్ల సవ్వడి వెనక కేరింత చూసే వాళ్ళు కొందరు పూడ్చిన ఆనవాళ్ల ఒక్కో రెక్కా విరిసి మంటల్లో మాడుస్తున్నారు. ఎంత చరిత్ర ఆనవాళ్లు కోల్పోయి ఉంటుంది ఆ నీళ్ల కవ్వం వెనక? అభివృద్ధి పేరుతో ఆనకట్టలు కట్టి ఊళ్లకు ఊళ్ళే మాయం అవుతుంటే ఎక్కడ బొడ్రాయి? ఎక్కడ పొలిమేర గుండు? మల్లన్న సాగర్‌లో మాయం అయి ఇల్లు కూలిన ఒక గిరిజన విద్యార్థి నాకు దగ్గరగా తెలుసు. ఈ మధ్య నన్ను కలవడానికి వచ్చాడు. ఆ ఊరు వదిలి వచ్చే రోజు నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిండు. వచ్చిన డబ్బుతో ఒక బైక్ కొనుక్కుండు. కొత్త ఇల్లు, పొలం కూడా.. ఇన్ని ఉన్నా ఊరు లేని ఐశ్వర్యం ఎందుకు సర్ అని గుక్క పట్టి ఏడ్చిండు. ఉన్న గుడిసె కూల్చి నీకు భవంతి కట్టా సుఖంగా ఉండు అంటే సహించడానికి అది అరిగే అన్నం కాదు. మన ఎముకల్లో మజ్జ కదా? కోల్పోయిన ఆనవాళ్లు ఒక్కో ఊరు జ్ఞాపకాల గుండె గనుల్ని తవ్వుకుంటున్నాయి. వాళ్ళకు మట్టి తెలుసు కనుకే కోల్పోయిన మమత తెలుసు, ప్రేమ తెలుసు.. ఏ లెక్కలు వాడి కుండను పగలగొట్టినవో, ఏ కూడికలు వాని కలలను కూల్చినవో, ఏ కొట్టివేతలు వాని దూలాన్ని ఇరిచినవో, నిజాలు చెప్పేందుకు ఏ కంఠాలు మూగబోయినవో.. విడమర్చి రాసేందుకు ఎన్ని కలాలు కుదవ బెట్టబడినవో? వియోగం చూపించేందుకు ఎన్నీ టీవీలు కాసులు మింగినవో! కాలం లెక్కలు వేసే ఉంటది. ఆట నీకు సైదోడు కావొచ్చు.. పాట నీకు సాగిల పడిపోవచ్చు.. రాత తన సిగ్గు లజ్జను నీ కాళ్ళ కాడ సాకబొయొచ్చు. మేధావి నీకు గులాము కావొచ్చు. కోల్పోయిన వాడికి నోరు లేవక పోవచ్చు. ఒకవేళ అడిగినా అధికార మదంతో బలవంతంగా నోరు మూయించవచ్చు. కానీ చరిత్ర చెక్కిలి మీద రాలిన ప్రతి కన్నీటిబొట్టు నీ చరిత్రను చెత్తకుప్పలో వేసే రోజు రావొచ్చు.

గుర్రం సీతారాములు

99516 61001

Next Story

Most Viewed