మంచి చెడుల కలబోతే ఎన్ఈపీ-2020

by Disha edit |
మంచి చెడుల కలబోతే ఎన్ఈపీ-2020
X

2040 నాటికి భారతీయ విద్యా వ్యవస్థను సమగ్రంగా, సమున్నతంగా రుపుదిద్దాలన్న లక్ష్యంతో ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు వృత్తి విద్యలను గ్రామీణ పట్టణ భారతాన్ని కలుపుకుని సుమారు ఐదు సంవత్సరాల కాల సుదీర్ఘ చర్చల తర్వాత కేంద్ర క్యాబినెట్ 2020 జూలై 29న నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. దేశంలో ప్రతి 30 ఏళ్లకు ఒక మారు విద్యావిధానంలో మార్పులు చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం. 1948లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సిఫార్సుల ఆధారంగాను, 1966లో కొఠారి కమిషన్‌ నివేదిక ఆధారంగాను, 1986లో ప్రధాని రాజీవ్‌ గాంధీ హయాంలో మరోమారు విద్యా విధానం ప్రకటించారు. ప్రస్తుతం ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరి రంగన్‌ అధ్యక్షతన మోడీ ప్రభుత్వం ఒక కమిటీ వేశారు. దాని ఆధారంగా నూతన విద్యా విధానాన్ని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్‌ఈ‌పీ-2020 పాఠశాల విద్యకు సంబంధించి ఒక మార్పును కేంద్రం సూచించింది. గత 30 ఏళ్లుగా భారతదేశంలో 10+2+3 అనే విధానం కొససాగుతోంది. దీనికి ప్రత్యామ్నయంగా మోడీ ప్రభుత్వం 5+3+3+4 విధానాన్ని సూచించింది.

విద్యాహక్కు చట్టాన్ని సవరించాలి

అయితే నూతన విద్యావిధానంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ కూడా విద్యా రంగంలోకి తీసుకొని రావడంతో పాటు ఇంటర్‌(ప్లస్‌టు)ను కూడా పాఠశాల విద్యలో ఉండాలని కమిటీ చెప్పింది. ఈ రెండింటినీ ఆహ్వానిస్తాం. ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ విద్యారంగంలో ఉండాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. కానీ సమస్య ఏమిటంటే ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్‌ను నెరవేర్చడానికి ఒక నిర్థిష్టమైన వ్యవస్థను ఈ నూతన విద్యా విధానం ప్రతిపాదించలేదు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్‌ను నెరవేరుస్తామని కేంద్రం చెబుతోంది. కానీ అంగన్‌వాడీ కేంద్రాల లక్ష్యాలు వేరు. వాటి ప్రధానమైన విధి పిల్లలకు, తల్లులకు పోషక ఆహారాన్ని అందించడం. మాల్‌ న్యూట్రిషన్‌ లేకుండా చేయడం. ఇలాంటి బృహత్తర విధులు నిర్వహిస్తున్న కేంద్రాలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ నిర్వహణను అప్పగించడం శాస్త్రీయమైన విధానం కాదు.

ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను కూడా విద్యలో భాగం చేసి, దాని నిర్వహణ కోసం ప్రత్యేకమైన వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ట్రైన్డ్‌ టీచర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలా లేకుండా చేస్తే అది నిర్ధిష్టంగా నడిచే అవకాశం లేదు. 5+3+3+4 విధానాన్ని అమలు చేయాలి. ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్‌ను కూడా విద్యారంగంలో భాగం చేయాలంటే జాతీయ విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేయాలి. జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు చదువు చెప్పాలని నిర్దేశిస్తోంది. కానీ మోడీ ప్రభుత్వం 3 నుంచి 18 ఏళ్లలోపు వారికి చెప్పాలంటోంది. దీనికి అనుగుణంగా జాతీయ విద్యా హక్కు చట్టాన్ని పార్లమెంట్‌లో సవరణ చేసి ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్‌ను నిర్వహించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను, సుక్షితులైన ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అది విజయవంతంగా నడిచే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కేంద్రం చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతిభ ఆధారంగా ఇంక్రిమెంట్లు, పదోన్నతులు అంటే సీనియారిటీని పట్టించుకొకపోవడమే కాకుండా ప్రతిభకు కొలమానాలంటే అది పాఠశాల పరిస్థితులు, విద్యార్థుల స్థాయి ఆ పాఠశాల చుట్టు ఉన్న సామాజిక పరిస్థితులు అవి చూపే ప్రభావాలు ఆలోచించినట్లుగా లేదు.

ఎన్ఈపీ అనివార్యం

ప్రతి చట్టం, విధానం నిర్మాణంలో అత్యున్నత లక్ష్యాలను, ఆదర్శమైన భావాలను కలిగి ఉంటుంది. కానీ ఆచరణలోని వైఫల్యాలు, బలహీనతలు స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ఉంటాయి. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యతగా పరిగణించకూడదు. విద్యలోని ప్రత్యక్ష భాగస్వామిగా మనం అమలులో చిత్తశుద్దితో, కర్తవ్య దీక్షతో వ్యవహరించాలి. జాతీయ స్థాయిలో మిశ్రమ స్పందన రాబట్టిన ఈ విధానం మంచి, చెడుల కలబోతగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచపు పరుగులో ఇది అనివార్యమైనదిగా చెప్పవచ్చు. మాతృభాషా బోధన విషయంలో ప్రాథమిక స్థాయి వరకు నిర్దేశించడం ముదావహం. కానీ ఇది ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో తప్పక అమలయ్యేలా చర్యలు తీసుకున్నప్పుడే స్ఫూర్తి కొనసాగుతుంది.

ఇక 5+3+3+4 విధానానికి సంబంధించి పూర్వ ప్రాథమిక విద్య శిశుసంక్షేమ విధానం కింద ఉండటం, ఇంటర్ విద్య కళాశాల విభాగం పరిధిలో ఉండటంతో వీటి మేళవింపు అనుసంధానానికి సంబంధించి పూర్తి స్పష్టతనివ్వాలి. ప్రస్తుత ఉపాధ్యాయులనే 12తరగతి విద్య కొరకు ఉద్యోగొన్నతి ప్రక్రియ చేపట్టాలి. పరీక్షలకు సంబంధించిన పరిణామాలు ఆహ్వానించదగినవే. విద్యార్థి నైపుణ్యాలను పొందుపరిచే ప్రగతి పత్రాలు మంచి ఫలితాలను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కోడింగ్ పరిచయానికి సంబంధించి మంచి మార్పే అయినప్పటికీ ఆ మేరకు సాంకేతిక వనరులు, వసతుల కల్పన గురించి, సిబ్బంది గురించి కేంద్ర ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలి. మధ్యాహ్న భోజన పథకంలో అల్పాహారం విద్యార్థుల పౌష్టికాహార స్థాయిని తప్పకుండా ఉన్నతీకరించగలదు. కానీ ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేలా సర్దుబాటు చర్యలు చేపట్టాలి. నాలుగు దశల బ్యాచిలర్ డిగ్రీ దిగువ స్థాయి వరకు ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తుంది. కానీ ఉద్యోగ, ఉపాధి హామీ కొరవడింది. తద్వారా సమాజంలో ఉన్నత విద్యపై ఆసక్తి సన్నగిల్లింది. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉపాధ్యాయ కనీస అర్హతగా చేయడం సహేతుకమే కానీ విచ్చలవిడిగా అనుమతించిన ప్రైవేటు కళాశాల ద్వారా ప్రమాణాలు పడిపోతున్న తీరును పరిగణలోకి తీసుకోవాలి.

ఇప్పటికే కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు ఈ నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి పచ్చజెండా ఉపాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆమోదం తెలుపవలసి ఉన్నది. రాష్ట్రంలోని విద్యావిధానానికి అనుగుణంగా నూతన విద్యా విధానంపై విద్యావేత్తలతో, మేధావులతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించవలసిన సమయం ఆసన్నమైనది. మన రాష్ట్రం నూతన విద్యావిధానం ద్వారా విద్యా వ్యవస్ధలో సమూల మార్పులకు శ్రీకారంచుడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తూ ఆ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం.

సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747



Next Story

Most Viewed