ఉనికి కోల్పోతున్న వామపక్షాలు

by Disha edit |
ఉనికి కోల్పోతున్న వామపక్షాలు
X

రోజుల్లో వామపక్షాలు (సీపీఐ, సీపీఎం, యం.ఎల్) గ్రూపులు కూడా ఐక్యత కోసం కృషి చేయకుండా దశాబ్ధాలుగా విడిగానే ఉంటున్నాయి. ప్రజా సమస్యలు (లక్ష్యం) ఒక్కటి గానే ఉన్నప్పుడు, పరిష్కరించవలసిన మార్గం (ప్రజా ఉద్యమాలు) ఒక్కటి గానే ఉన్నప్పుడు వారు విడివిడిగా ఉండి పోరాటం చేయటం ఎందుకు? చేసి సాధించింది ఏమిటి? శ్రేయోభిలాషులు ఎన్నిసార్లు వామపక్షాలు కలిసిపోవాలి, చిన్నచిన్న ఇగో సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా వామపక్షాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంకా ఎంత కాలం విడివిడిగా పోరాటాలు చేస్తారు? ఎన్నికల రాజకీయాలలో రోజురోజుకు ఈ పార్టీలు ఉమ్మడిగా కలిసి పోరాడి వామపక్ష భావజాలం అస్థిత్వం నిలుపుకోవటానికి ప్రయత్నించకుండా ఇంకెంత కాలం బూర్జువా పార్టీలకు ఎన్నికల సమయంలో అనుబంధ పార్టీలుగా పనిచేస్తారు (వారు వామపక్షాలను 'తోక పార్టీలు') అంటూ విమర్శించినా, ఈసడించినా సరే ఎన్నికల సమయంలో పొత్తులకై వారిని ఆశ్రయించటం దేనికి? వామపక్షాలు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఒక రకంగా దేశ వ్యాప్తంగా రోజురోజుకు బలపడుతున్నాయా, బలహీన పడుతున్నాయా? సమీక్ష అవసరం లేదా?

ఎంతకాలం తోకపార్టీలుగా...

వామపక్షాలు ఉమ్మడిగా కలిసి పోయి ప్రజా సమస్యల కోసం ఐక్యంగా పోరాటం చేయకుండా వేరుకుంపట్లతో ఇంకెంత కాలం (తోక పార్టీలుగా) కొనసాగుతారు. వారికి అవసరం అయినప్పుడు ఎన్నికల సమయంలో పై వ్యక్తులు, పార్టీలు వామపక్షాల నాయకులను పిలిచి సహకారం కోరుతారు. అవసరం లేకపోతే వారు ఒంటరిగానే పోటీచేస్తారు. వారు వామపక్లాల ఓట్లతో, సహకారంతో గెలిచి అధికారంలోకి వచ్చి తమ పార్టీ సొంత విధానాలనే అనుసరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వామపక్షాల సహకారం పొందిన బీఆర్ఎస్ గెలిచాక ఈ 9 ఏళ్లలో వామపక్షాల చిరకాల డిమాండ్లను ఏమైనా నెరవేర్చిందా? పేదలకు మూడు ఎకరాల భూమి పంచుతామన్న వాగ్దానం నెరవేర్చిందా? పేదలకు ఇండ్లు (కట్టినవే తక్కువ, కట్టినవి కూడా నాసిరకంగా కట్టారు) పంపకాలలో వామపక్షాలను సంప్రదించిందా? రైతులకు సంకెళ్ళు వేయటంలో కానీ, నక్సలైట్ల ఏరివేతలో కానీ, ప్రజా ఉద్యమాలు లేకుండా కేసులు పెట్టడంలో కానీ, పోలీసులను ఉపయోగించుకుని నిజమైన తెలంగాణ ఉద్యమకారులను నిర్భందించటం, కనీసం సభలు పెట్టుకొనే స్థలాన్ని కూడా ఇవ్వకపోవటం. సభలు, సమావేశాలకు పర్మిషన్లు ఇవ్వకుండా పోలీసులచే ఉద్యమాలను అణచివేయటంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నడూ వెనుకకు తగ్గలేదు. నిజమైన తెలంగాణ ఉద్యమ నేతలను, ఉద్యమకారులను కేసీఆర్ కావాల్సినంత దూరం పెట్టాడు. పౌరహక్కులు కాలరాశాడు. వారిపై అనేక అక్రమ కేసులు పెట్టి నిర్భందించాడు.

అయినా, బీజేపీ బూచిని చూపించి ఈ వామపక్షాలు కేసీఆర్ పంచనే ఎందుకు చేరుతాయి. నిజానికీ కేసీఆర్ అనేక విషయాల్లో బీజేపీ ప్రజా వ్యతిరేక పథకాలకు, విధానాలకు వంత పాడినవాడే. అనేక సందర్భాల్లో బీజేపీని పార్లమెంట్‌లో, రాష్ట్ర శాసన సభలో సమర్ధించినవాడే. ఇటీవల బీజేపీతో (కవిత విషయంలో, వ్యక్తిగత వ్యవహారంలో) ఏదో కొంత చెడింది. బీజేపీ ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటుంది. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చలేదు. నిధులు సరిగా ఇవ్వటం లేదు. గవర్నర్ ద్వారా రాష్ట్ర బిల్లులు పెండింగులో పడ్డాయి. అయినా బీజేపీ, బీఆర్ఎస్ తగాదా కొనసాగుతుందా! అది భవిష్యత్తులో కూడా మరింత విషమిస్తుందా? చెప్పలేం. కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలు, మాటలు, చేతలు ఎప్పుడు, ఎలా మారతాయో ఊహించలేము. అయినా వామపక్షాలు కేసీఆర్‌తో రాబోయే ఎన్నికల్లో పొత్తులకై ప్రయత్నంచటం సరైనదేనా? వామపక్షాలు మరోసారి సమీక్షించుకోవాలి.

వారిలో..వామపక్ష భావాలు ఉన్నట్టా?

వామపక్ష భావాలు ఉన్నాయని చెప్పుకున్న ఈటెల రాజేందర్, కేసీఆర్ పంచెన చేరి ఉన్నత పదవులు పొంది ఆయన ఆస్తులు పెంచుకున్నాడే కానీ పేదలకు ఏం చేశాడు? ఇప్పుడు హిందూ మతతత్వ పార్టీ అని విమర్శించిన రాజేందర్ బీజేపీలోకి చేరి మరింత దిగజారాడు. మరో వామపక్ష నేత నోముల నర్సయ్య బీఆర్‌ఎస్‌లో చేరి ఏం సాధించాడు? ఇక వామపక్ష భావజాలం ఉన్న సీపీఐ నేత నారాయణ తిరుపతికి పోయి మొక్కుతాడు.మాజీ నక్సలైటు ఉద్యమకారుడు గద్దర్ పతనం మనం చూస్తున్నాము. (కాసేపు చిన్నజీయర్ సమతా మూర్తి ఆలయానికి పోయి పాటలు పాడుతాడు. షర్మిల దగ్గరకు పోతాడు, కే.ఏ.పాల్ దగ్గరకు పోతాడు. ఇప్పుడు కాంగ్రెస్ మీటింగులకు పోయి పాటలు పాడి, రాహుల్ గాంధీని కౌగలించుకొని ముద్దులు పెడతాడు.) ఏమిటి ఇదంతా ఈ గద్దర్ పాటలు, ఉపన్యాసాలు విని వందలాది మంది విద్యార్థులు, యువకులు వామపక్ష భావజాలంతో ప్రభావితం చెంది నక్సలైట్లలో చేరి ప్రాణాలు అర్పించారు. మరి ఇప్పుడు అదే గద్దర్ మానసిక స్థితి ఏమిటో అర్థం కావడం లేదు.

పొత్తు కోసం అంత ఉబలాటమా?

ఇక ఈ మధ్యకాలంలో సీపీఐ, సీపీఎం పార్టీలో కొత్తగా యువకుల నుండి చేరికలు లేవు. కేడర్ బలపడడం లేదు. విద్యార్థి ఉద్యమాలు బలహీనపడ్డాయి. ఈ వామపక్ష పార్టీలలో ఉన్నత పదవులలో అగ్రవర్ణాల నాయకత్వమే దశాబ్దాలుగా కొనసాగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత లేదు. మహిళా రిజర్వేషన్లు పార్టీ పదవుల్లో ఇవ్వరు. వామపక్ష నేత సీతక్క గతంలో తెలుగు దేశంలో, ఇప్పుడు కాంగ్రెసు నేతగా కొనసాగుతోంది. మొత్తం మీద వామ పక్షాలు, వామపక్ష భావజాలం ఆచరణలో అనేక విధాలుగా వెనకపడుతోంది. వామపక్ష నేతల తీరులో మార్పు రావడం లేదు. కేసీఆర్ బీజేపీ బీ టీమ్‌గా కొందరు చెబుతున్నారు. తెలంగాణలో వామపక్షలు మాత్రం కేసీఆర్‌తో అంటకాగుతున్నాయి. కేసీఆర్‌ను బలపరుస్తాము అంటున్నాయి. బీఆర్ఎస్ నుండి ఇప్పటి వరకు వామపక్షాలతో పొత్తులు ఉంటాయని ప్రకటించలేదు. నిజానికి నరేంద్రమోదీకీ, కేసీఆర్‌కు పెద్ద తేడా ఏమీ సామాన్యులకు కనపడటం లేదు. ఇద్దరూ మతంలో గాఢంగా నమ్మకం ఉన్నవారే, స్వామీజీ భక్తులే. ఇద్దరూ మాటలు నేర్చినవారే, తమ ఉపన్యాసాలతో ప్రజలను బురిడీ కొట్టించటంలో సిద్దహస్తులే. మాటలు ఘనం, చేతలు శూన్యం. ఇద్దరూ నియంతృత్వ పోకడలు ఉన్నవారే. ఈ నేపథ్యంలో చూసినప్పుడు వామ పక్షాలు కేసీఆర్‌ను ప్రత్యేకంగా బలపరచడానికి సహేతుక కారణం ఏమీ కనపడటం లేదు.

ఏపీలో అయితే మరీ ఘోరం!

ఆంధ్రప్రదేశ్‌లో వామ పక్షాల పాత్ర నామమాత్రం. తెలంగాణాలో ఉన్న బలంతో పోలిస్తే బిజేపీకి అక్కడ ఏ మాత్రం ఉనికి కూడా లేదు. అయినా అక్కడ బీజేపీ విధానాలను ఎదిరించే నాయకుడే లేడు. నిజానికి దేశంలో బిజేపికి తిరుగులేని మద్దతు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంతగా మరో రాష్ట్రంలో లేదు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు అనేక వాగ్ధానాలు చేసింది. విభజన హామీలు ఏమి నెరవేర్చలేదు. రైల్వే జోన్ హామీ ఆచరణలో కనిపించడం లేదు. రాజధాని ఉనికి లేదు. పోలవరానికి సరిపడా నిధులు ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కారుచౌకగా అమ్మకానికి సిద్ధంగా ఉంది. పోర్టులు అదానీ హస్తగతం అయ్యాయి. రుణభారంతో రాష్ట్రం అల్లాడుతోంది. కేంద్రం సహకరించదు అయినా రాష్ట్రంలో బలమైన మూడు పార్టీల ముగ్గురు నేతలు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్రంలో బీజేపీని అన్ని విషయాల్లో బలపరిచే వాళ్ళే. మణిపూర్ దురాగతాలపై బీజేపీని ఈ ముగ్గురు నేతలు కనీసం విమర్శించరు. అయినా, ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు పుంజుకోలేదు. ఉద్యమాలు ఊపందుకోలేదు.

మొత్తానికి దేశంలో, ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు చాలా బలహీనంగా దిగదుడుపుగానే ఉన్నాయి అనేది కొట్టవచ్చినట్లు కనిపించే వాస్తవం. ఇకనైనా వామపక్షాలు ఐక్యత కోసం ప్రయత్నించాలి. ప్రజా సంక్షేమమే ఎజెండాగా కృషి చేయాలి. లోపాలు సవరించుకుంటే కనీసం గత వైభవాన్ని సాధించగలుగుతారు. మరోసారి వామపక్షాలు 'చారిత్రిక తప్పిదాలు' చేయవని ఆశిద్దాం.

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496


Next Story

Most Viewed