అభ్యర్థుల్లో.. గుబులు పుట్టిస్తున్న నోటా...!

by Disha edit |
అభ్యర్థుల్లో.. గుబులు పుట్టిస్తున్న నోటా...!
X

టు అనేది ఒక ఆయుధం. ఇది ప్రజాస్వామ్యానికి ప్రాణం. అందుకే ఓటిచ్చేటప్పుడు బుద్ధుండాలి ఆన్నాడు ప్రజాకవి కాళోజీ. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రజలలో వచ్చిన మార్పు ఆయన మాటల్ని నిజం చేస్తున్నాయి. ఓటు అనే రెండు అక్షరాలకు ప్రపంచ గతినే మార్చే శక్తి ఉంటుంది. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది. వ్యవస్థలో మార్పుకు నాంది పలుకుతుంది. కానీ నేడు ఓటు విలువ చాలా తక్కువ మందికి తెలుసు.

స్వచ్చందంగా తిరస్కరించే అవకాశం

2014 ముందు భారతదేశంలో తమ నియోజకర్గంలోని అభ్యర్థులను తిరస్కరించే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా ఎవరినో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. తద్వారా నియోజకవర్గంలో పోటీచేసే ఏ అభ్యర్థి అయినా నచ్చకపోతే ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండేవారు. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారిగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ అవకాశాన్ని ఓటర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60 లక్షల ఓట్లు ఈ నోటాకు నమోదయ్యాయి. తర్వాత జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోటా ప్రాధాన్యత విస్తృతంగా పెరుగుతూ వచ్చి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 1.3 కోట్లు ఈ నోటాకు నమోదయ్యాయి. దీని ప్రాధాన్యం ఎంతవరకు వచ్చిందంటే క్రమంగా ఎన్నికల విజేతకు, ఓడిపోయిన అభ్యర్థికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కంటే ఎక్కువ ఓట్లు నోటాకు నమోదవుతూ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేంత కీలకంగా ఈ నోటా మారిపోయి, అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

సాధారణంగా ఒక ఓటర్ పోలింగ్ బూత్‌లోకి వెళ్ళగానే గతంలో బ్యాలెట్ బాక్స్‌లు ఉండి వాటిపై అభ్యర్థుల గుర్తులతో కూడిన బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ యుగానికి అనుగుణంగా ఎన్నికల వ్యవస్థలో సైతం డిజిటలీకరణకు నాంది పలుకుతూ భారత ఎన్నికల సంఘం ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలైన ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) లను అందుబాటులోకి తెచ్చింది. వీటిపై ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల పోటోలు వారి పార్టీకి చెందిన గుర్తులు కనిపిస్తాయి. వాటి ఆధారంగా ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి లేదా పార్టీకి చెందిన గుర్తును నొక్కి తన ఓటు హక్కు వినియోగించుకుంటాడు. ఒకవేళ ఓటరుకు ఆ ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థులు కానీ లేదా పార్టీలు కానీ నచ్చనట్లయితే ప్రస్తుతం తన ఓటుహక్కును వినియోగించుకుంటూనే అభ్యర్థును స్వచ్చందంగా తిరస్కరించే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఇలాంటి అవకాశం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో మాత్రం కాస్త ఆలస్యంగా అందుబాటులోకి వచ్చిందనే చెప్పాలి.

2014 ముందూ.. నోటా

ఈ నోటా విధానాన్ని అందుబాటులోకి తేవాలని ఎన్నికల సంఘం 2009లోనే ప్రయత్నించగా, దీనిని అప్పటి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పెద్దఎత్తున వ్యతిరేకించాయి. దీంతో పౌరహక్కుల సంస్థ ఈ విధానానికి మద్దతుగా కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేయగా, సుప్రీంకోర్టు దీనిపై 2013లో తన తీర్పును వెల్లడించింది. అయితే ఈ విధానంతో అక్షరాస్యతలకు ఎలాంటి సమస్య లేకపోయినా నిరక్షరాస్యులకు ఇది ఇబ్బందికరమై నోటా అనే విధానం ఒకటుందనే విషయం కూడా తెలిసేలా ఏదైనా గుర్తును కేటాయించాలని, రచయిత సౌదా అరుణ కోర్టులో పిటిషన్ వేయగా, దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు నోటాకు క్రాస్ (X) గుర్తు కేటాయించాలని ఎన్నికల కమిషన్‌ను సూచించింది. 2015లో క్రాస్(X) గుర్తును ఖరారు చేశారు.

నిజానికి తిరస్కార ఓటు వేసే అధికారం భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 49(ఓ) ప్రకారం ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుండేది. అయితే దీనికోసం పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి 17 (ఏ) ఫారం తీసుకొని ఫలానా అభ్యర్థిని పార్టీని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ బాక్సులో వేయవచ్చు. ఇది రహస్య బ్యాలెట్ విధానానికి విరుద్ధమైనది. పైగా ఓటరు భద్రత రీత్యా అది మంచి పద్ధతి కాదని విమర్శలు వచ్చాయి. అప్పట్లో దీనిపై చాలామంది ఓటర్లకు అవగాహన ఉండేది కాదు. ఈవీఎంలు వాడుకలోకి రావడంతో ఎన్నికల కమిషన్ చొరవతో, సుప్రీంకోర్టు ఆదేశాలతో నేడు నోటా అందుబాటులోకి వచ్చింది. దీనిపై విశిష్ట ప్రచారం జరగడంతో ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరాం లాంటి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది విరివిగా ఈ నోటాను ఉపయోగించారు, ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి అభ్యర్థుల కంటే ఈ నోటాకే అధికంగా ఓట్లు పోలైనా సందర్భాలు లేకపోలేదు.

‘నోటా’లో మార్పులు అవసరమేనా?

ఓటు హక్కు ఎంత పవిత్రమో దాని వినియోగించడం కూడా అంతే పవిత్రమైనది. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును మాటలతో ఏమార్చి, అరచేతిలో వైకుంఠధామాన్ని చూపించి తర్వాత మర్చిపోయే అభ్యర్థులకు తగిన శాస్తిని నోటా ద్వారా కలిగించవచ్చు. నోటా నొక్కడమంటే మేము మిమ్మల్ని నమ్మడం లేదని మొహం మీదనే చెప్పేసినట్లు. నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో 30% కంటే ఎక్కువ ఓట్లు సంపాదించి విజేతలుగా నిలిచిన ప్రజాప్రతినిధులు సంఖ్య చాలా తక్కువ. అటువంటి వారికి ఈ నోటా గట్టి హెచ్చరిక. ఎన్నికల సమయంలో అభ్యర్థులు చేసే వాగ్దానాలకు, మాటలకు ఒక్కోసారి హద్దుపద్దు లేకుండా పోతోంది. శుష్కవాగ్దానాలతో కల్లబొల్లి కబుర్లతో ఓట్లు వేయించుకొని తర్వాత మొహం తిప్పేసే అభ్యర్థుల అభ్యర్థితత్వాన్ని నిరాకరించడానికి లభించిన ఆయుధం ఈ నోటా. మాటల గారడికి తాము మోసపోమంటూ వారికి తిరస్కరిస్తూ నోటాతో వారికి చెక్ పెట్టవచ్చు.

అయితే ఈ నోటా వల్ల ఇంత ప్రాముఖ్యత ఉన్నా, కొంతమంది మేధావులు ఈ నోటా విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థుల కంటే ఈ నోటా అధిక ఓట్లు పోలైనట్లయితే ఆ ఎన్నికలను రద్దుచేస్తూ, సదరు అభ్యర్థులను 6 సంవత్సరాలపాటు ఎలాంటి ఎన్నికలు పాలుపంచుకోకుండా అనర్హులుగా ప్రకటించాలని అప్పుడైతేనే, తప్పుడు హామీలతో తప్పుడు వాగ్దానాలతో ఓటర్ల జీవితాలతో చెలగాటం ఆడుకునే అభ్యర్థుల తిక్క కుదురుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యానికి జీవం ఈ ఓటు. దేశ భవిష్యత్తుకు ఆయుధం ఈ ఓటు. దానిని సక్రమంగా వినియోగించడం మనందరి నైతిక బాధ్యత.

- అంజద్ మియా

90005 17186

Next Story

Most Viewed