ఇలాగైతే.. తెలుగు బతికేనా?

by Disha edit |
ఇలాగైతే.. తెలుగు బతికేనా?
X

విద్యారంగంలో, రచనలలో, పత్రికలలో వాడుక భాష అమలు కోసం గిడుగు రామమూర్తి తన జీవితాన్ని అంకితం చేశారు. ఏం చేసినా ఆయన దృష్టి అంతా తెలుగు భాష పైనే! ఆలోచనలు భాష చుట్టూనే! గిడుగు, గురజాడల కాలంలో విద్యార్థులు ప్రశ్న పత్రాలకు సమాధానాలు గ్రాంధికంలోనే రాయాలనే నియమం ఉండేది. విద్యార్థులు మంచి వచన రచనలు చదవాలని, సజీవ భాషలో పరీక్షలు రాయాలని గ్రాంధికంపై పోరాటం చేసి అందులో విజయం సాధించారు. దీంతో నేటి విద్యార్థులు చాలా సులభంగా, ఎలా మాట్లాడుతున్నారో అలాగే తెలుగు పరీక్ష రాసే అవకాశం ఉంది. మరి, అలా రాయగలుగుతున్నారా? అంటే లేదనే చెప్పాలి.

నేడు తెలుగు భాషా సమాజం ఒక చిత్రమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక పక్క రచయితలు, కవులు అసంఖ్యాకంగా రచనలు చేస్తున్నారు. సాహిత్య సంపదను విస్తారం చేస్తున్నారు. వెలువడుతున్న సాహిత్యం మీద ఆరోగ్యకరమైన చర్చ, విమర్శ కూడా జరుగుతోంది. ఇది చాలా ఆనందించవలసిన విషయం. మరో పక్క, పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ద్వితీయ భాషగా తెలుగును చదువుతున్న డిగ్రీ విద్యార్థులు అక్షర దోషాలు లేకుండా ఒక వాక్యం కూడా రాయలేకపోతున్నారు. అర్థవంతంగా, వ్యాకరణ బద్ధంగా వాక్యాలు నిర్మించలేకపోతున్నారు. విరామచిహ్నలంటే వాళ్ళకి తెలియవు. అతి విషాదకరమైన విషయమేమిటంటే, కొందరు డిగ్రీ విద్యార్థులు తమ పేరును కూడా తెలుగులో తప్పులు లేకుండా రాయలేకపోతున్నారు. తరగతి గదిలో విన్న విషయాన్ని తమ మాటలలో వ్యక్తం చేయలేకపోతున్నారు. అయినా, తెలుగు పరీక్షలో ఉత్తీర్ణతను సాధిస్తున్నారు. మంచి మార్కులు వచ్చేస్తున్నాయి. ఇది ఎలా సాధ్యం? ఇలాగే ఉంటే, రాబోయే కాలంలో విద్యారంగంలో తెలుగు స్థితి ఎలా ఉంటుంది?

తెలుగుతో.. సంబంధం లేని చదువులా?

ఒకప్పుడు భాషలలో, అది ఇంగ్లీషు అయినా, తెలుగు అయినా, మరొకటి అయినా పరీక్ష పేపర్లు దిద్దటం చాలా కఠినంగా ఉండేది. అధ్యాపకులు అక్షరమక్షరం చూసి దిద్దేవారు. వచ్చిన తక్కువ మార్కులనే విద్యార్థులు గొప్పగా భావించేవారు. ప్రథమ శ్రేణి మార్కులు లేకుండానే యూనివర్సిటీ ర్యాంకులు వచ్చిన సందర్భాలు కూడా ఆనాడు ఉండేవి. అందుకే, అక్షర దోషాలు లేని భాష రాయటం వారికి పట్టుబడింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? వారు రాస్తున్నప్పుడు చేసే దోషాలను అధ్యాపకులు చెప్పినా, పట్టించుకోని, ఆచరించని ఒక నిర్లక్ష్య ధోరణి ఇప్పటి విద్యార్థులలో ఉంది. మరి, వారికి భాష ఎలా వస్తుంది? గ్రాంధిక భాషలో రాయటం, చదవటం కష్టమనే కదా, గిడుగు, గురజాడలు విద్యార్థుల సౌలభ్యం కోసం, జీవద్భాషా అమలుకు కృషి చేసింది. ఆ ఫలితాన్ని నేటి యువత సక్రమంగా ఉపయోగించుకోవాలి కదా! దీనికి తోడు పదవతరగతి వరకూ తెలుగును చదివిన విద్యార్థి ఇంటర్ రెండేళ్లపాటు మార్కుల కోసం సంస్కృతం చదవటం, తెలుగు మర్చిపోవటానికి ఒక కారణంగా చెపుతారు. చిన్నప్పటినుంచి చదివిన తెలుగును రెండేళ్ల విరామంలో ఎలా మర్చిపోతారు? అంతే కాక, డిగ్రీలో సెమిస్టరు విధానం వచ్చాక మూడవ సెమిస్టర్ తరవాత తెలుగుతో విద్యార్థులకు సంబంధం ఉండట్లేదు. విద్యారంగంలో తెలుగు మనుగడకు, వికాసానికి మరో ఉద్యమం రావలసిన అవసరం కనిపిస్తోంది. తెలుగు మాతృ భాషీయులు తెలుగు చక్కగా చదవాలంటే, వారిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెరగాలంటే మేధావులు చెప్పినట్లు, ఒకటవ తరగతి నుంచి డిగ్రీ మూడవ సంవత్సరం వరకూ తెలుగు ప్రథమ భాషగా ప్రభుత్వ, తదితర విద్యా సంస్థల భేదం లేకుండా అన్నింటా నిర్భంధ పాఠ్యంశంగా చదివే పద్ధతి అమలు కావాలి. మార్కుల శాతం కన్న దోష రహితమైన భాష రావటం ముఖ్యమనే విషయాన్ని ఉపాధ్యాయులు తమ విద్యార్థుల మనస్సుల కెక్కించగలగాలి.

వ్యవహారిక భాషను వాడాలని..

తెలుగు వాడుక భాష ప్రామాణిక భాషగా గుర్తింపు పొందటానికి ప్రధాన కారకులు గిడుగు, గురజాడలు. వీరు నెల్లూరు, మద్రాసు, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం పట్టణాలకు వెళ్లి అక్కడి విద్యావంతులతో చర్చించి తమ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసారు. ఈ లక్ష్యంతోనే వేరు వేరుగా ‘ఎ మెమోరాండం ఆన్ మోడరన్ తెలుగు’ అని గిడుగు వారు రాస్తే, ‘మినిట్ ఆఫ్ డిసెంట్’ (అసమ్మతి పత్రం) అని గురజాడ రాశారు. ఈ పుస్తకాల లక్ష్యం ఒక్కటే. ప్రాథమిక పాఠశాలల్లోను, సెకండరీ పాఠశాలల్లోను ఆధునిక వ్యావహారిక తెలుగును అనుమతించటం వల్ల కలిగే లాభాలను వివరించడం! అలాగే గిడుగు వారి సంపాదకత్వంలో ‘తెలుగు’ మాస పత్రిక తెచ్చి మాతృ భాషలో స్వేచ్ఛగా రాయవచ్చుననే భావన రచయితలలో కలిగించారు. కానీ నేటి యువతరం ఎంతమంది తెలుగు దిన పత్రికలు చదువుతున్నారనేది సందేహమే!

గిడుగు కల నెరవేరినట్లేనా?

మాతృ భాషా బోధకుల భుజస్కంధాలపై మహత్తర బాధ్యత ఉందని గురజాడ చెప్పారు. మరి, ఈ బాధ్యతను భాషోపాధ్యాయులు, అధ్యాపకులు నిర్వర్తించ గలుగుతున్నారా? అనేక ఒత్తిడుల మధ్య కళాశాలల్లో తెలుగు బోధన సాగుతోంది. తెలుగే కదా అనే నిర్లక్ష్యం, ఇది చదివితే ఏం లాభం, రాయటం కష్టం, ఇటువంటి మాటలు విద్యార్థుల నుంచి వస్తున్నాయి. విచిత్రమేమంటే, తెలుగే కదా అని తేలికగా చూసేవారే చక్కగా అనుకున్న భావాన్ని తెలుగులో వ్యక్తం చేయలేకపోతున్నారు. తప్పులు లేకుండా రాయలేకపోతున్నారు. ఈ ధోరణి, ఇటువంటి భావనలు పోవాలంటే తెలుగైనా పట్టుబట్టి సాధిస్తేనే కానీ సాధ్యం కాదని, దానికీ నిరంతర అభ్యాసం అవసరమనే విషయాన్ని ఉపాధ్యాయులు విద్యార్థుల మెదళ్ళలోకి ఎక్కించగలగాలి. అంతే కాదు, పరీక్షా పత్రాల మూల్యాంకనం కఠినంగా ఉండాలి. అప్పుడే అక్షర దోషాలు లేకుండా రాయగలుగుతారు. తెలుగు పరీక్ష అంటే ఏం చదవకుండా ఏదో ఒకటి సొంతంగా రాసేయవచ్చు అనే నిర్లక్ష్య ధోరణి విద్యార్థులలో పోవాలి. భాషా వికాసం ప్రధానంగా ప్రభుత్వం, విద్యా సంస్థల పరస్పర సహకారంతోనే సాధ్యమవుతుందని గుర్తించాలి. తమ జీవితంలో సింహ భాగాన్ని విద్యారంగంలో వాడుక భాషా అమలుకు అంకితం చేసిన గిడుగు, గురజాడలు ఆశించింది ఇటువంటి తెలుగు భాషా సమాజాన్నైతే కాదు కదా! డిగ్రీ చదువుతున్నా నన్నయ్య అంటే ఎవరో, రామాయణం ఎవరు రచించారో, కందుకూరి ఏం చేసారో, జాషువా ఎవరో ఇటువంటి పేరు పొందిన విషయాలను కూడా చెప్పలేని విద్యార్థి లోకాన్ని కాదు కదా! జీవద్భాషలో నేటి విద్యార్థులు, యువత ఎటువంటి భావాన్నైనా చక్కగా చెప్పగలగటం, అక్షర దోషాలు లేకుండా రాయగలగటం అభ్యాసం చేయాలి. అందులో పరిణతి సాధించాలి. ఇదే గిడుగు వారి భాషోద్యమానికి, వారి కృషికి నేటి తరం ఇచ్చే నిజమైన గౌరవం, గుర్తింపు. అప్పుడే గిడుగు కల నెరవేరినట్లు!

డా. చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Next Story

Most Viewed